త్రివిక్రమ్‌ని తక్కువ అంచనా వేయలేం..!
ఎస్ఎస్ రాజమౌళి సపోర్టు లేకుండానే 'పుష్ప 1'తో పాన్ ఇండియా స్టార్ గా మారిన బన్నీ.. ఇప్పుడు ఏకంగా ఆయన రికార్డులనే బ్రేక్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
By: Tupaki Desk | 18 Dec 2024 3:45 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమాతో వరల్డ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా.. ₹1500 కోట్ల క్లబ్ కు అతి చేరువలో ఉంది. ఎస్ఎస్ రాజమౌళి సపోర్టు లేకుండానే 'పుష్ప 1'తో పాన్ ఇండియా స్టార్ గా మారిన బన్నీ.. ఇప్పుడు ఏకంగా ఆయన రికార్డులనే బ్రేక్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే దీని తర్వాత అల్లు అర్జున్ ప్లానింగ్స్ ఎలా ఉండబోతున్నాయి? నెక్స్ట్ మూవీ అంచనాలు ఎలా ఉంటాయి? అనే చర్చలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి.
అల్లు అర్జున్ తన తదుపరి సినిమా కోసం డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేతులు కలపబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ను వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు. అయితే బన్నీ 'పుష్ప 2: ది రూల్' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత, త్రివిక్రమ్ తో సినిమా చేయాలని అనుకోవడం సరెైన నిర్ణయమేనా? అని ఓ వర్గం నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటి వరకూ తెలుగు సినిమాలను మాత్రమే డైరెక్ట్ చేశారు.. అవన్నీ తెలుగు ఆడియన్స్ ను మాత్రమే ఎంటర్టైన్ చేశాయి. బ్లాక్ బస్టర్ విజయాలు సాధించినప్పటికీ, టాలీవుడ్ వరకే పరిమితం అయ్యాయి. ఆయన చిత్రాలు భాషా సరిహద్దులు దాటి విస్తృతంగా వెళ్ళలేదు. ఇప్పుడు తొలిసారిగా అల్లు అర్జున్ మూవీతో పాన్ ఇండియాని టార్గెట్ చేస్తున్నారు. కాకపోతే ₹1500 కోట్ల సినిమా తర్వాత నేషనల్ వైడ్ గా మార్కెట్ ఉన్న దర్శకుడితో కాకుండా, త్రివిక్రమ్ తో వర్క్ చేయడం పట్ల పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే సందీప్ రెడ్డి వంగా లాంటి డైరెక్టర్ తో తదుపరి మూవీ సెట్ చేసుంటే బాగుండేదనే కామెంట్లు చేస్తున్నారు.
సాధారణంగా ఏ హీరో అయినా ఒక పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ హిట్టు కొట్టిన తర్వాత, నెక్స్ట్ మూవీ మీద అంచనాలు దృష్టిలో పెట్టుకొని పాన్ ఇండియా డైరెక్టర్ ను ఎంపిక చేసుకుంటాడు. కానీ ఇక్కడ త్రివిక్రమ్ కు ఇంతకు ముందు అన్ని భాషల ప్రేక్షకులను అలరించిన అనుభవం లేదు. అందులోనూ 'పుష్ప 2' తర్వాత ఉత్తరాదిలో అల్లు అర్జున్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా మాస్ లో ఆయనకు ఇప్పుడు మామూలు ఫాలోయింగ్ లేదు. అలాంటిది నార్త్ ఆడియన్స్ సెన్సిబిలిటీస్ కి తగిన కంటెంట్ ను త్రివిక్రమ్ అందించగలరా? మాస్ లో అంచనాలు అందుకోగలడా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
అయితే ఇక్కడ త్రివిక్రమ్ శ్రీనివాస్ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయలేం. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరికీ మంచి హిట్లు ఇచ్చి, వారి మార్కెట్ ను రెట్టింపు చేశారు. ఓవర్ సీస్ లో ఆయన సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పాన్ ఇండియా సినిమా చేయకపోయినా, డబ్బింగ్ చేయబడో లేదా రీమేక్ చేయబడో ఇతర భాషల వారికి రీచ్ అయ్యాయి. అంతెందుకు రాజమౌళి లాంటి దర్శక ధీరుడే.. నిజంగా త్రివిక్రమ్, సుకుమార్ కాన్సన్ట్రేట్ చేసి మాస్ సినిమా తీశారంటే ఇంక మనం సర్దుకోవాల్సిందే అని భయపడ్డాడంటే దర్శకుడి కెపాసిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి బన్నీతో త్రివిక్రమ్ తీయబోయే సినిమా విషయంలో సందేహాలు అవసరం లేదు.
త్రివిక్రమ్ ఇప్పటి దాకా యూనివర్స్ అప్పీల్ ఉన్న కథతో సినిమా చేయలేదు. కానీ ఇప్పుడు రాజమౌళి కూడా టచ్ చేయని జోనర్ లో మూవీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇండియన్ స్క్రీన్ మీద ఎవరూ చూడని విజువల్ వరల్డ్ ని క్రియేట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. వందల కోట్ల బడ్జెట్ తో, అతి పెద్ద కాన్వాస్ లో ఈ సినిమా చేయబోతున్నారు. మైథలాజికల్ లేదా హిస్టారికల్ సబ్జెక్ట్ తో ఉంటుందనే టాక్ నడుస్తోంది. త్వరలోనే అనౌన్స్ మెంట్ వీడియోతో అన్ని వివరాలు ప్రకటించబడతాయి. ఈ సినిమాతో త్రివిక్రమ్ పాన్ ఇండియా ఫిలిం మేకర్ గా మారడమే కాదు, బన్నీకి మరో భారీ విజయాన్ని అందిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.