Begin typing your search above and press return to search.

రాజమౌళి భయాన్ని త్రివిక్రమ్ కూడా నిజం చేస్తాడా?

'బాహుబలి' ప్రాంఛైజీతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లిన దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి.

By:  Tupaki Desk   |   13 Dec 2024 3:00 AM GMT
రాజమౌళి భయాన్ని త్రివిక్రమ్ కూడా నిజం చేస్తాడా?
X

'బాహుబలి' ప్రాంఛైజీతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లిన దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి. RRR చిత్రంతో ఇండియన్ సినిమాకి తీరని కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డ్ కలను నిజం చేసి చూపించారు. బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించే దర్శక ధీరుడు సైతం ఇద్దరు దర్శకులకు తాను భయపడతానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వాళ్ళెవరో కాదు.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ & సుకుమార్.

రాజమౌళి మాట్లాడుతూ.. "నేను వీళ్ళలాగా సినిమా తీయలేను.. వీళ్ళ స్టైల్ అందుకోవడం కష్టం.. వీళ్ళు నిజంగా కాన్సన్ట్రేట్ చేసి మాస్ సినిమా తీశారంటే మనం ఇంక సర్దుకోవాల్సిందే అని భయపడే డైరెక్టర్లు త్రివిక్రమ్ శ్రీనివాస్ అండ్ సుకుమార్. వాళ్ళిద్దరికీ చాలా స్టఫ్ ఉంది. చాలా ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉంది. నా అదృష్టం కొద్దీ వాళ్ళిద్దరూ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మాస్ మసాలా మూవీస్ తీయడం లేదు. ఒకవేళ తీస్తే మాత్రం ఎక్కడో ఉంటారు" అని అన్నారు. ఆరోజు జక్కన్న చెప్పినట్లే సుకుమార్ ఇప్పుడు 'పుష్ప 2' సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోయారు.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ "పుష్ప 2: ది రూల్". మూడేళ్ల క్రితం వచ్చిన 'పుష్ప: ది రైజ్' సినిమాకి సీక్వెల్ ఇది. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ యాక్షన్ డ్రామా.. బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. 6 రోజుల్లోనే ₹1000 కోట్ల క్లబ్ లో చేసి, అత్యంత వేగంగా ఈ అరుదైన ఘనత సాధించిన భారతీయ చిత్రంగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. లెక్కలు మాస్టారు తీసిన ఈ సినిమా నార్త్ బెల్ట్ లో బాక్సాఫీస్ లెక్కలన్నీ సరి చేస్తోంది. ఇదంతా చూస్తుంటే ఆనాడు రాజమౌళి వ్యక్తం చేసిన భయాన్ని ఇవాళ సుకుమార్ నిజం చేసి చూపించాడని సినీ అభిమానులు అంటున్నారు.

ఒక తెలుగు సినిమా సక్సెస్ మీట్ దేశ రాజధాని ఢిల్లీలో జరిగిందంటే, 'పుష్ప 2' పాన్ ఇండియా వైడ్ గా ఎలాంటి సంచలనం సృష్టిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పట్లో ఈ సినిమా హవా తగ్గేలా కనిపించడం లేదు. చాలా ఏరియాల్లో ఇప్పటికే రాజమౌళి రికార్డులు బ్రేక్ అయ్యాయి. రాబోయే రోజుల్లో ఇంకొన్ని రికార్డులు చెరిగిపోయే అవకాశం ఉంది. మైథలాజికల్, హిస్టారికల్, సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ, భారీ మల్టీస్టారర్ తో కాకుండా.. ఒక కమర్షియల్ సినిమాతో సుకుమార్ హిస్టరీ క్రియేట్ చేయడం మామూలు విషయం కాదు.

'పుష్ప 2' సక్సెస్ తో ఇండియన్ సినిమాలో రాజమౌళికి ధీటుగా నిలబడే సత్తా ఉన్న దర్శకుడిగా సుకుమార్ ప్రశంసించబడుతున్నారు. ఇంక జక్కన్న మాటను త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా నిజం చెయ్యాలని అభిమానులు కోరుకుంటున్నారు. త్రివిక్రమ్ ఇప్పటి వరకూ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రాంతీయ సినిమాలే చేస్తూ వచ్చారు. అందరు దర్శకులు పాన్ ఇండియా అంటున్నా, త్రివిక్రమ్ మాత్రం ఆ దిశగా అడుగులు వేయలేదు. కానీ ఇప్పుడు ఆయన కూడా తన రూటు మారుస్తున్నారు. భారీ స్క్రీన్ లో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ తన తదుపరి సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అతి పెద్ద కాన్వాస్ లో, దాదాపు 700 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇదొక మైథలాజికల్ స్టోరీ అని, కాదు హిస్టారికల్ సబ్జెక్ట్ అని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. రాజమౌళి కూడా టచ్ చేయని జోనర్ అని, ఇంతవరకూ ఇండియన్ సినిమాలో ఎవరూ చూడని విజువల్ వరల్డ్ ని క్రియేట్ చేస్తున్నారని నిర్మాత నాగవంశీ చెబుతున్నారు. సుకుమార్ మాదిరిగానే త్రివిక్రమ్ సైతం బన్నీతో కలిసి పాన్ ఇండియా బాక్సాఫీస్ ను వణికిపోయేలా చేస్తారని ఫ్యాన్స్ అంటున్నారు. మరి రాజమౌళి చెప్పినట్లు త్రివిక్రమ్ కూడా ఆయనకు కాంపిటీటర్ గా మారుతాడేమో చూడాలి.