Begin typing your search above and press return to search.

బన్నీ నిబద్దతకు మరిన్ని పురస్కారాలు రావాలి : త్రివిక్రమ్‌

ఆయన జాతీయ అవార్డును కైవసం చేసుకోవడంతో పాటు, ఈ ఘనత సాధించిన మొదటి తెలుగు నటుడిగా నిలవడం గర్వంగా మరియు చాలా ఆనందంగా ఉంది.

By:  Tupaki Desk   |   25 Aug 2023 4:57 PM IST
బన్నీ నిబద్దతకు మరిన్ని పురస్కారాలు రావాలి : త్రివిక్రమ్‌
X

అల్లు అర్జున్ పుష్ప సినిమాకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు సాధించడం నాకు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ఆయన జాతీయ అవార్డును కైవసం చేసుకోవడంతో పాటు, ఈ ఘనత సాధించిన మొదటి తెలుగు నటుడిగా నిలవడం గర్వంగా మరియు చాలా ఆనందంగా ఉంది. అల్లు అర్జున్ గారితో వర్క్ చేసి దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా చాలా సంతోషిస్తున్నాను. పాత్రలకు ప్రాణం పోయడం పట్ల ఆయన చూపే శ్రద్ధాసక్తులు, అసమానమైన అంకితభావం, అభిరుచి స్పష్టంగా తెలుసు. అతని అసాధారణమైన ప్రతిభను, నిబద్ధతను గుర్తించే మరిన్ని పురస్కారాలతో అలంకరించబడిన భవిష్యత్తు దగ్గర్లోనే ఉంది.

కీరవాణి గారు ఆర్ఆర్ఆర్ వంటి స్మారక చిత్రానికి గానూ ఒకే ఏడాది అటు ఆస్కార్, ఇటు జాతీయ పురస్కారం గెలుచుకోవడం అభినందించదగ్గ విషయం. వెండితెరపై ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచిన దృశ్యకావ్యం ఆర్ఆర్ఆర్ కి పనిచేసిన ప్రతి సాంకేతిక నిపుణుడుకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

జాతీయ అవార్డు పొందిన కాల భైరవ, శ్రీనివాస్ మోహన్, ప్రేమ్ రక్షిత్, కింగ్ సోలమన్‌ లకు అభినందనలు. ముఖ్యంగా మన తెలుగు సినిమా కీర్తిని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన ఎస్.ఎస్. రాజమౌళి గారికి ధన్యవాదాలు.

మొదటి చిత్రం ఉప్పెనతో జాతీయ అవార్డును గెలుచుకున్న బుచ్చిబాబు మరియు పంజా వైష్ణవ్ తేజ్‌లకు శుభాకాంక్షలు. నేను ఎంతగానో అభిమానించే, గౌరవించే గీత రచయిత చంద్రబోస్ గారు కొండ పొలం సినిమాకు గాను జాతీయ అవార్డు అందుకున్నందుకు నా శుభాకాంక్షలు.

దేవిశ్రీ ప్రసాద్ జాతీయ అవార్డును గెలుచుకోవడం నాకు హృదయం సంతోషంతో నిండిన క్షణం. అతను మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను. మన తెలుగు చిత్ర విజేతలందరితో పాటు, 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు.