Begin typing your search above and press return to search.

గుంటూరు కారం ట్రైలర్.. త్రివిక్రమ్ సక్సెస్ అయ్యారా?

మహేశ్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం ట్రైల‌ర్ యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది.

By:  Tupaki Desk   |   8 Jan 2024 9:10 AM GMT
గుంటూరు కారం ట్రైలర్.. త్రివిక్రమ్ సక్సెస్ అయ్యారా?
X

మహేశ్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం ట్రైల‌ర్ యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. కేవ‌లం ప‌న్నెండు గంట‌ల్లోనే 25 మిలియ‌న్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. యూట్యూబ్‌లో ట్రెండింగ్ లిస్ట్‌లో నంబ‌ర్ వ‌న్ గా నిలిచింది. టాలీవుడ్‌లో అతి త‌క్కువ టైమ్‌లో హ‌య్యెస్ట్ వ్యూస్ సొంతం చేసుకున్న ట్రైల‌ర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. 24 గంట‌ల్లో న‌ల‌భై మిలియ‌న్ల కుపైగా వ్యూస్ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

అయితే ట్రైలర్ కోసం అనేక గంటలపాటు వెయిట్ చేసిన ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ ఇచ్చారు మేకర్స్. సోషల్ మీడియా వాల్స్ పై ట్రైలర్ ను రీషేర్ చేస్తూ అభిమానులు రచ్చరచ్చ చేస్తున్నారు. మహేశ్ స్క్రీన్ ప్రెజెన్స్, మ్యానరిజం అదిరిపోయాయని చెబుతున్నారు. మహేశ్కు త్రివిక్రమ్ ఇచ్చిన పోకిరి టైప్ ఎలివేషన్లు వేరే లెవెల్ అన్ని అంటున్నారు. మొత్తానికి ట్రైలర్ రిలీజ్ లో కాస్త లేట్ అయినా.. లేటెస్ట్ గా ఉందని కూడా కొందరు నెటిజన్లు చెబుతున్నారు. ఫుల్ శాటిస్ఫై అయ్యామని కామెంట్లు పెడుతున్నారు. కథను త్రివిక్రమ్ ఎక్కువగా రివీల్ చేయకపోవడంతో సినిమాకు ప్లస్ పాయింటేనని అంటున్నారు.

కానీ మరికొందరు నెటిజన్లు కాస్త భిన్నంగా స్పందిస్తున్నారు. ట్రైలర్ లో మహేశ్ బాబు డైలాగ్ టైమింగ్ ఎక్కువగా హైలైట్ అయిందని, మిగతా విషయాలను పెద్ద పట్టించుకోలేదని అంటున్నారు. జస్ట్ ట్రైలర్ చూసి సూపర్, అదుర్స్ అనిపించేలా లేదని చెబుతున్నారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్దగా అట్రాక్ట్ చేయలేదని కామెంట్లు పెడుతున్నారు. తాము ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాలయ్య అఖండ లెవెల్ లో ఉంటుందని ఆశించామని, కానీ ఆ రేంజ్ అందుకోలేదని ట్వీట్లు చేస్తున్నారు. దీని బట్టి చూస్తే మాస్ ఫ్యాన్స్ కు ట్రైలర్ నచ్చగా.. కొందరికి నచ్చలేదన్నమాట.

ఇక ట్రైలర్ ఎలా ఉన్నా.. బాక్సాఫీస్ వద్ద ఫలితం తేలేది మాత్రం సినిమా రిలీజయ్యాకే. సంక్రాంతి కానుకగా భారీ స్థాయిలో థియేటర్లలో జనవరి 12వ తేదీన రిలీజ్ కానుంది. మరో రోజులో ఈ మూవీ ప్రీ బుకింగ్స్ స్టార్ట్ కానున్నాయని సమాచారం. డిస్ట్రిబ్యుూటర్స్ అందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. అయితే ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ అయిన ప్రభాస్ సలార్ మూవీకి లానే ఈ సినిమా టికెట్ల రేట్లను కూడా పెంచుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతులు ఇస్తాయని టాక్.

సినిమా విషయానికొస్తే.. మహేశ్ సరసన శ్రీలీల మెయిన్ హీరోయిన్ కాగా, హిట్ ఫేమ్ మీనాక్షీ చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతి బాబు, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో పోషిస్తున్నారు. అయితే మహేశ్ సినిమాలకు ట్రైలర్, టీజర్ టాక్ తో పని ఉండదు. బొమ్మ పడ్డాక కంటెంట్ ఉంటే చాలు.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టరే! మరి ఈ సినిమా ఏమవుతుందో చూడాలి.