Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : ట్రూ లవర్

By:  Tupaki Desk   |   10 Feb 2024 9:18 AM GMT
మూవీ రివ్యూ : ట్రూ లవర్
X

'ట్రూ లవర్' మూవీ రివ్యూ

నటీనటులు: మణికందన్-శ్రీ గౌరీప్రియ- కన్న రవి- శరవణన్ తదితరులు

సంగీతం: సీన్ రోల్డాన్

ఛాయాగ్రహణం: శ్రేయస్ కృష్ణ

మాటలు: రాకేందుమౌళి

నిర్మాతలు: యువరాజ్ గణేశన్-మగేష్ రాజ్

రచన-దర్శకత్వం: ప్రభురామ్ వ్యాస్

గత ఏడాది బేబితో సంచలనం రేపింది మాస్ మూవీ మేకర్స్. ఇప్పుడీ సంస్థ తమిళం నుంచి ఓ ప్రేమకథా చిత్రాన్ని తెలుగులోకి తీసుకొచ్చింది. అదే.. ట్రూ లవర్. జై భీమ్.. గుడ్ నైట్ చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న తమిళ నటుడు మణికందన్.. తెలుగమ్మాయి శ్రీ గౌరీప్రియ జంటగా నటించిన చిత్రమిది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

అరుణ్ (మణికందన్).. దివ్య (శ్రీ గౌరీప్రియ) కాలేజీ రోజుల నుంచి ప్రేమించుకుంటున్న జంట. చదువు పూర్తయ్యాక దివ్య సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అవుతుంది. ఉద్యోగంలో మంచి స్థాయికి వెళ్తుంది. అరుణ్ బిజినెస్ చేయాలని ప్రయత్నించి విఫలమై.. చిన్న ఉద్యోగంలో చేరతాడు. అక్కడా అతడికి టైం కలిసి రాదు. తన ప్రేయసి విషయంలో బాగా పొసెసివ్ అయిన అరుణ్.. దివ్యను ప్రతిదానికీ అనుమానిస్తూ.. తనకు షరతులు పెడుతూ ఇద్దరి మధ్య అపార్థాలకు కారణమవుతుంటాడు. దివ్య అన్నింటినీ భరిస్తూనే అతడితోనే సాగుతుంటుంది. కానీ ఒక దశ దాటాక అపార్థాలు శ్రుతి మించి ఇద్దరూ విడిపోయే పరిస్థితి వస్తుంది. చివరికి ఈ జంట ప్రయాణం ఎక్కడి దాకా వెళ్లిందన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

అచ్చం మనలాంటి వ్యక్తులు.. లేదా మనకు తెలిసిన వాళ్లు.. మనకు ఎదురైన అనుభవాలు.. మన చుట్టూ జరిగే విషయాలు తెరపై కనిపించినపుడు ఈజీగా రిలేటవుతాం. అందులోనూ ప్రేమకథల్లో ఇలాంటి అంశాలున్నపుడు వాటితో కనెక్ట్ కావడానికి మరింత అవకాశం ఉంటుంది. 'బేబి' లాంటి సినిమాలతో యూత్ బాగా రిలేట్ కావడానికి ఇప్పటి ప్రేమలు ఇలాగే కదా ఉన్నాయి అనే భావన కలగడమే కారణం. ఐతే పాత్రలను.. మిగతా విషయాలను రియలిస్టిగ్గా చూపించాలని రొటీన్ అనిపించే.. సాధారణమైన విషయాలనే తెరపై చూపిస్తూ రెండు గంటల పాటు ప్రేక్షకులను థియేటర్లను కూర్చోబెట్టడం అంటే చాలా కష్టమే. ఎంతో కొంత డ్రామా ఉండాలి. కథ ఊహించని మలుపులు తిరగాలి. షాకింగ్ గా అనిపించే విషయాలేవైనా తెరపై కనిపించాలి. ఇవేమీ లేకుండా ఒక అమ్మాయి.. అబ్బాయి మధ్య ఆరేళ్ల ప్రయాణాన్ని సాధారణమైన సన్నివేశాలతోనే లాగించేశాడు 'ట్రూ లవర్'లో దర్శకుడు. ప్రధాన పాత్రలు.. సన్నివేశాలు చాలా వరకు రిలేట్ చేసుకునేలానే ఉన్నప్పటికీ.. సినిమాకు అవసరమైన డ్రామా లేకపోవడంతో 'ట్రూ లవర్' ఒక మోస్తరుగా అనిపిస్తుందే తప్ప బలమైన ముద్ర వేయదు.

ఇంజినీరింగ్ లో ప్రేమించుకోవడం మొదలుపెట్టిన ఓ అబ్బాయి-అమ్మాయి.. కాలేజీ రోజుల్లో ఏ బాధ్యతలు లేకుండా తిరుగుతున్నంత వరకు అంతా బాగానే ఉంటుంది. కానీ చదువు పూర్తయ్యాక అమ్మాయి ఉద్యోగంలో చేరుతుంది. అబ్బాయి సెటిల్ కాక ఇబ్బంది పడుతుంటాడు. అమ్మాయికి కొత్త పరిచయాలు జరుగుతాయి. అబ్బాయిలో ఇన్ సెక్యూర్ ఫీలింగ్ మొదలవుతుంది. మరీ పొసెసివ్ గా ఉంటూ అమ్మాయిని కంట్రోల్ చేయడం మొదలుపెడతాడు. ఆ అమ్మాయి అబద్ధాలు చెప్పడం మొదలుపెడుతుంది. అవి బయటపడ్డ ప్రతిసారీ అబ్బాయి ఓవర్ గా రియాక్టవుతుంటాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తలెత్తే అపార్థాలు.. గొడవలు.. ఈ నేపథ్యంలో నడుస్తుంది 'ట్రూ లవర్'. ఇలాంటి అనుభవాలు చాలామంది జీవితాల్లో ఉంటాయి. లేదా వాళ్ల చుట్టూ ఇలాంటి విషయాలే చూసి ఉంటారు. కాబట్టి యూత్ ఈ సినిమాలోని పాత్రలు.. వాళ్ల జీవితాల్లో జరిగే విషయాలతో ఈజీగా రిలేట్ అవుతారు. అవును మనకూ ఇలా జరిగింది కదా.. మనమూ ఇలాంటివి చూశాం కదా అనుకుంటూ సినిమాతో ట్రావెల్ అవుతారు.

'ట్రూ లవర్'తో ఉన్న అతి పెద్ద సమస్య ఏంటంటే.. మొదట్నుంచి చివరి దాకా ఒకటే పాయింట్ మీద నడుస్తుంటుంది. అబ్బాయి వ్యక్తిత్వాన్ని దృష్టిలో ఉంచుకుని అమ్మాయి చిన్న చిన్న అబద్ధాలు చెప్పడం.. అవి బయటపడ్డపుడు అతను ఓవర్ గా రియాక్టవడం.. అంతే కాక అతను ప్రతిదానికీ ట్రిగ్గర్ అయి సీన్ క్రియేట్ చేయడం.. అమ్మాయి అతణ్ని చూసి భయపడి అతనికి దూరం జరగడం.. తిప్పి తిప్పి ఇవే సన్నివేశాలనే సినిమా అంతా చూపించారు. సినిమా ముందుకు సాగే కొద్దీ అబ్బాయి పాత్ర మీద ప్రేక్షకులకు కూడా చిరాకు పుడుతుంది. ఇలాంటి వాడిని అమ్మాయి ఎలా భరిస్తుంది అనే ప్రశ్న తలెత్తుతుంది. అతను ట్రూ లవర్ లాగా కాకుండా శాడిస్ట్ లవర్ లాగా కనిపిస్తాడు. అతను హద్దులు దాటి ప్రవర్తించడం.. ఆమె నువ్వు నాకొద్దు అనడం.. అతను సారీ చెప్పి మళ్లీ దగ్గరికి రావడం.. ఇదే వరస. ఒక దశ దాటాక ఈ వ్యవహారం ఓవర్ డోస్ అనిపించి.. విసుగు తెప్పిస్తుంది. కథలో చెప్పుకోదగ్గ మలుపులేమీ లేకుండా ఇదే లైన్లో సినిమా సాగి సాగి.. చివరికి ముగింపు దశకు చేరుతుంది. ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా సినిమాను ముగించడం బానే ఉంది కానీ.. అసలు దర్శకుడు ఏం చెప్పదలుచుకున్నాడు అనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ సినిమాకు పెట్టిన టైటిలే కరెక్ట్ కాదనిపిస్తుంది. ప్రేమలో బాధ తప్ప ఆనందం లేదనే సంకేతాన్ని ఈ సినిమా ఇస్తుంది. అది యువ ప్రేక్షకులకు ఏమేర రుచిస్తుందో చూడాలి. మొత్తంగా చూస్తే 'ట్రూ లవర్'లో యూత్ రిలేట్ చేసుకునే కథ.. పాత్రలు.. సన్నివేశాలు ఉన్నాయి. అవి ఆ వర్గం ప్రేక్షకులకు టైంపాస్ అయితే చేయిస్తాయి కానీ.. మొత్తంగా సినిమా ఒక ప్రత్యేక అనుభూతినైతే కలిగించదు.

నటీనటులు:

తెలుగులో కూడా అందుబాటులో ఉన్న 'జై భీమ్'.. 'గుడ్ నైట్' చిత్రాలు చూసిన వాళ్లకు మణికందన్ మంచి నటుడనే విషయం తెలిసే ఉంటుంది. 'ట్రూ లవర్'లో అరుణ్ పాత్రలో అతను జీవించేశాడు. ఓ నటుడిని కాకుండా నిజంగా అలాంటి కుర్రాడిని తెరపై చూస్తున్న ఫీలింగ్ కలిగించాడు. చాలా సహజమైన నటనతో అతను ఆకట్టుకున్నాడు. శ్రీ గౌరీప్రియ కూడా బాగా చేసింది. తన లుక్స్ పాత్రకు సరిపోయాయి. హీరోయిన్ లాగా కాకుండా సగటు అమ్మాయిలా కనిపించింది. ఎమోషనల్ సీన్లలో ఆమె నటన ఆకట్టుకుంటుంది. హీరోయిన్ సహోద్యోగిగా కన్న రవి కూడా మెప్పించాడు. హీరో తల్లిదండ్రులుగా చేసిన ఆర్టిస్టులు ఓకే. మిగతా వాళ్లంతా మామూలే.

సాంకేతిక వర్గం:

సీన్ రోల్డాన్ సంగీతం బాగుంది. పాటలు చార్ట్ బస్టర్స్ లా లేవు కానీ.. సినిమాలో సందర్భాలకు తగ్గట్లుగా బాగానే సాగిపోయాయి. నేపథ్య సంగీతంలో మంచి ఫీల్ ఉంది. శ్రేయస్ కృష్ణ సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది. విజువల్స్ ఈ కథకు తగ్గట్లు కుదిరాయి. నిర్మాణ విలువలు ఓకే. రాకేందు మౌళి మాటలు సహజంగా అనిపిస్తాయి. రైటర్ కమ్ డైరెక్టర్ ప్రభురామ్ వ్యాస్.. మన చుట్టూ కనిపించే ప్రేమకథలకే స్క్రిప్టు రూపం ఇచ్చాడు. రియలిస్టిక్ సిచువేషన్లను క్రియేట్ చేసి.. ఆయా సందర్భాల్లో ఒక అబ్బాయి-అమ్మాయి ఎలా ప్రవర్తిస్తారు.. వాళ్ల మధ్య మాటలు ఎలా ఉంటాయి.. అని ఊహిస్తూ స్క్రిప్టు రాసినట్లు అనిపిస్తుంది. కానీ సినిమాకు అవసరమైన డ్రామాను.. మలుపులను మాత్రం ఈ కథలోకి తీసుకురాలేకపోయాడు. తన టేకింగ్ బాగుంది.

చివరగా: ట్రూ లవర్.. ఒక సగటు ప్రేమకథ

రేటింగ్-2.5/5