యానిమల్ ఆల్బమ్ బిల్ బోర్డ్ జాబితాలో సంచలనంగా మారింది.
ఇప్పుడు టీసిరీస్ యానిమల్ ఆల్బమ్ కూడా బిల్ బోర్డ్ జాబితాలో సంచలనంగా మారింది.
By: Tupaki Desk | 13 Dec 2023 6:04 AM GMTరణబీర్ కపూర్- రష్మిక మందన జంటగా సందీప్ వంగా తెరకెక్కించిన 'యానిమల్' సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీసిరీస్ తో కలిసి సందీప్ వంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సందీప్ వంగా స్వయంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. త్వరలోనే 1000 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరనుంది ఈ చిత్రం. ఇప్పుడు టీసిరీస్ యానిమల్ ఆల్బమ్ కూడా బిల్ బోర్డ్ జాబితాలో సంచలనంగా మారింది.
తాజాగా యానిమల్ నుంచి మూడు పాటలు బిల్ బోర్డ్ టాప్ 5 చార్ట్ లో చేరాయి. నేటితరాన్ని ఓ ఊపు ఊపిన యానిమల్ సాంగ్ అర్జన్ వెయిలీ ప్రతిష్ఠాత్మక బిల్ బోర్డ్ లిస్ట్ లో టాప్ -1 పాటగా నిలిచింది. ఇదే చిత్రం నుంచి టాప్ 3 పాటగా బి పార్క్ ఆలపించిన `సారీ దునియా జాలా దేంగే..`.. `సత్రంగ..` గీతం టాప్ 5 పాటగా జాబితాలో నిలిచాయి. షారూఖ్ -జవాన్ నుంచి అర్జిత్ సింగ్ ఆలపించిన `చలియే..` పాట టాప్ 2 పాటగా నిలవగా, టాప్ 4 పాటగా హరిహరన్ ఆలపించిన హనుమాన్ చాలీసా నిలిచింది.
అయితే బిల్ బోర్డ్ జాబితాలో టాప్ 1లో నిలిచిన అర్జన్ వైలీపై ప్రస్తుతం వివాదం కొనసాగుతోంది. ఇది సిక్కు గురువుల వీరత్వానికి సంబంధించిన ఒక చారిత్రక గీతం స్ఫూర్తితో రూపొందిన పాట. ఈ పాటను హింసాత్మక సన్నివేశంలో ఉపయోగించడంపై సిక్కుల్లో ఒక వర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిని పలువురు అలాంటి సందర్భంలో ఉపయోగించడం అభ్యంతరకరం అని చెబుతున్నారు. అయితే అర్జన్ వైలీ పాటలోని రౌద్రరసం యువతరానికి పిచ్చిగా నచ్చేసింది. ఇది సినిమా రిలీజ్ కి ముందే గూగుల్ లో మిలియన్ల వ్యూస్ తో ట్రెండింగ్ అయ్యింది. ఇప్పుడు బిల్ బోర్డ్ నంబర్ 1 గీతంగా చరిత్రకెక్కింది. అర్జన్ వైలీ పాటను బూపేందర్ బబ్బల్ ఆలపించారు. ఆయనే ఈ పాటను రాసారు.