గద్దర్ అవార్డుల కోసం కమిటీ రెడీ
సినిమా రంగాన్ని ప్రోత్సహిస్తూ `నంది` అవార్డుల తరహాలో `గద్దర్` పురస్కారాలను అందించాలనే ఆలోచన ఉందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 24 Aug 2024 4:03 AM GMTసినిమా రంగాన్ని ప్రోత్సహిస్తూ `నంది` అవార్డుల తరహాలో `గద్దర్` పురస్కారాలను అందించాలనే ఆలోచన ఉందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై సలహాలు, సూచనలతో రావాల్సిందిగా సినీపెద్దలను ఆహ్వానించినట్టు ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. అయితే పరిశ్రమ నుంచి ఎవరూ సరిగా స్పందించలేదని కూడా ఆయన ఆవేదనను వ్యక్తం చేసారు.
అదే క్రమంలో రేవంత్ ప్రయత్నాన్ని అభినందిస్తూ సినీపరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి సహా ఇతర సినీపెద్దలు ప్రభుత్వానికి తమవంతు సహాకారం అందించేందుకు ముందుకు వచ్చారు. నంది స్థానంలో తెలంగాణలో గద్దర్ అవార్డులను ప్రదానం చేయాలనే ప్రయత్నానికి మద్ధతు పలికారు.
తాజా సమాచారం మేరకు.. గద్దర్ అవార్డుల టైటిల్ లోగో సహా విధివిధానాలు, నియమనిబంధనలను రూపొందించడానికి ఏర్పాటు చేసిన కమిటీకి ప్రముఖ సినీ నిర్మాత బి నర్సింగ్ రావును తెలంగాణ ప్రభుత్వం చైర్మన్‌గా నియమించింది. తెలంగాణ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులలో కమిటీ కీలక సభ్యుల వివరాలను వెల్లడించారు. ఈ కమిటీకి వైస్ చైర్మన్‌గా టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నియమితులయ్యారు. తమ్మారెడ్డి భరద్వాజ, అల్లు అరవింద్, డి సురేష్ బాబు, కె రాఘవేంద్రరావు, అందె శ్రీ, తనికెళ్ల భరణి, కె చంద్రబోస్, ఆర్ నారాయణ మూర్తి, వందేమాతరం శ్రీనివాస్, అల్లాణి శ్రీధర్, సానా యాదిరెడ్డి, హరీష్ శంకర్, యెల్దండి వేణు తదితరులు కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు.
ఈ ప్రకటనకు సంబంధించిన పేపర్ ప్రింట్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. అల్లు అరవింద్- డి.సురేష్ బాబు- దిల్ రాజు- కేఆర్ లాంటి ఆ నలుగురు కమిటీలో ఉండటం అందరి దృష్టిని ఆకర్షించింది. గద్దర్ పురస్కారాల కోసం రేవంత్ రెడ్డి నిజాయితీగా ప్రయత్నిస్తుంటే, అటు ఆంధ్రప్రదేశ్‌లోను నంది అవార్డులను తిరిగి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ధృవీకరించారు. ఇటు నంది పురస్కారాలు, అటు గద్దర్ పురస్కారాలు కళాకారులు, సాంకేతిక నిపుణుల్లో ఉత్సాహం నింపుతాయనడంలో సందేహం లేదు.