ఇంట్రెస్టింగ్ రీ రిలీజ్... 6 ఏళ్లు ఐనా తగ్గని క్రేజ్!
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో పెద్ద ఎత్తున రీ రిలీజ్ అవ్వడం మనం చూస్తున్నాం.
By: Tupaki Desk | 6 Sep 2024 7:39 AM GMTఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో పెద్ద ఎత్తున రీ రిలీజ్ అవ్వడం మనం చూస్తున్నాం. ఇటీవల రీ రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు సాధించిన గబ్బర్ సింగ్ ను మించి మరేదైనా సినిమా వస్తుందేమో చూడాలి. టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా రీ రిలీజ్ లు అవుతున్నాయి. కానీ టాలీవుడ్ స్థాయిలో మాత్రం ఇతర భాషల సినిమాలు వసూళ్లు రాబట్టలేక పోతున్నాయి. ఇటీవల హిందీ సూపర్ హిట్ క్లాసిక్ మూవీ షోలే రీ రిలీజ్ అయ్యింది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది, ఒక మోస్తరు వసూళ్లు నమోదు అయినట్లు సమాచారం అందుతోంది.
షోలే తర్వాత బాలీవుడ్ లో మరో క్రేజీ మూవీ రీ రిలీజ్ కు సిద్ధం అయింది. 2018లో వచ్చిన హర్రర్ డ్రామా మూవీ 'తుంబాడ్' రీ రిలీజ్ అవ్వబోతుంది. గతంలో థియేటర్ లో విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఆ సినిమా ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయింది. కానీ కొన్నాళ్లుగా అక్కడ నుంచి కూడా తుంబాడ్ ను తొలగించారు. ఆన్ లైన్ లో సినిమా క్లిప్స్ చూసిన సమయంలో, సినిమా గురించి చర్చ జరిగిన సమయంలో చూడని వారు తుంబాడ్ ను చూడాలని ఆశ పడుతున్నారు. వారి కోసం రీ రిలీజ్ ప్లాన్ చేశారు.
ఓటీటీలో ఉన్న సినిమాలే రీ రిలీజ్ అయ్యి మంచి వసూళ్లు సాధిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పుడు ఓటీటీలో లేని ఈ సినిమా కచ్చితంగా రీ రిలీజ్ తో భారీ వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయని హిందీ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 1940లో ఒక పల్లెటూరు లో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు రహి అనిల్ బర్వే దర్శకత్వం వహించాడు. సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. పలు అవార్డులు రివార్డులు కూడా దక్కాయి. దాంతో రీ రిలీజ్ కి మంచి బజ్ క్రియేట్ అయింది అనడంలో సందేహం లేదు.
పల్లెటూరులోని ఒక పాడుబడ్డ గుహలో దెయ్యాల కాపలాతో పెద్ద మొత్తంలో బంగారు నాణేల నిధి ఉంటుంది. ఆ నిధి విషయం తెలిసిన ఒక వ్యక్తి దెయ్యాలకు గోధుమ పిండి వేయడం ద్వారా బంగారు నాణేలు సంపాదిస్తాడు. అలా తక్కువ సమయంలోనే అతడు పెద్ద మొత్తంలో బంగారం సంపాదిస్తాడు. అయితే అనుకోని కారణాల వల్ల అతడు సమస్యల్లో చిక్కుకుంటాడు. ఇంతకు అతడికి వచ్చిన సమస్యలు ఏంటి, ఆ బంగారు నాణేల గని చివరకు ఏమైంది అనేది సినిమా కథ. ఒక మంచి కాన్సెప్ట్ తో పాటు, మంచి స్క్రీన్ ప్లేతో సాగిన ఈ సినిమా థియేటర్ లో చూస్తే కచ్చితంగా ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతారు. అందుకే ఓటీటీ లో కంటే థియేటర్ లో రీ రిలీజ్ బెటర్ అని మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 13న ఈ సినిమా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.