రెండు భారీ చిత్రాలకు ఒకే సమస్య...?
ఇప్పుడు తమిళ్ లో రూపొందుతున్న కంగువా మరియు తంగలాన్ సినిమాలు కచ్చితంగా బాహుబలి రేంజ్ సినిమాలు అంటూ అక్కడి మీడియా ప్రచారం చేస్తున్నాయి.
By: Tupaki Desk | 15 Feb 2024 12:30 PM GMTటాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ జక్కన్న రాజమౌళి బాహుబలి తీసుకు వచ్చినప్పటి నుంచి కూడా ఆ రేంజ్ సినిమాను తీయాలని తమిళ సినీ ప్రముఖులు మరియు ప్రేక్షకులు బలంగా కోరుకుంటున్నారు. ఆ మధ్య బాహుబలి రేంజ్ సినిమాలు అంటూ వచ్చాయి కానీ ఏ ఒక్కటి కూడా కనీసం వెయ్యి కోట్ల వసూళ్లు సాధించలేక పోయింది.
ఇప్పుడు తమిళ్ లో రూపొందుతున్న కంగువా మరియు తంగలాన్ సినిమాలు కచ్చితంగా బాహుబలి రేంజ్ సినిమాలు అంటూ అక్కడి మీడియా ప్రచారం చేస్తున్నాయి. తంగలాన్ సినిమా ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెల్సిందే.
ఇక సూర్య హీరోగా నటిస్తున్న కంగువా సినిమా కూడా ఎప్పుడు విడుదల ఉంటుంది అనే విషయంలో స్పష్టత లేదు. మొన్నటి వరకు 2024 సమ్మర్ అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఈ సమ్మర్ లో ఆ సినిమా ఉండటం అసాధ్యం అన్నట్లుగా యూనిట్ సభ్యులు మరియు తమిళ మీడియా వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.
కంగువా మరియు తంగలాన్ సినిమాలకు గ్రీన్ స్టూడియో బ్యానర్ నిర్మాణ సంస్థగా ఉన్న విషయం తెల్సిందే. ఇతర నిర్మాతలు ఉన్నా కూడా జ్ఞానవేల్ రాజా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని, అందుకే ఈ రెండు సినిమాల విడుదల విషయంలో గందరగోళం నెలకొంది అంటూ పుకార్లు మొదలు అయ్యాయి.
స్టూడియో గ్రీన్ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో గతంలో వచ్చిన ప్రాజెక్ట్ ఫలితాలు ఈ సినిమాలపై పడ్డాయి అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆ సంస్థకు చెందిన కొందరు మాత్రం తంగలాన్ మరియు కంగువా సినిమాలకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్నట్లుగా చెబుతున్నారు.
తంగలాన్ సినిమా తో విక్రమ్ కచ్చితంగా ఓ భారీ విజయాన్ని కొట్టడం ఖాయం అన్నట్లుగా ఫోటోలు వీడియోలు చూస్తే అర్థం అవుతుంది. ఇక కంగువా సినిమా కచ్చితంగా తమిళ సినీ ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అన్నట్లుగా పరిస్థితి ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి రెండు క్రేజీ సినిమాల విడుదల తేదీల విషయంలో గందరగోళ పరిస్థితులు ఎదురు అవ్వడం తమిళ సినీ వర్గాల వారిని కలవరానికి గురి చేస్తుంది. చిత్ర నిర్మాతలు ఈ విషయమై మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఆయా హీరోల ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.