Begin typing your search above and press return to search.

మళ్లీ మహా బలుడు.. 19 ఏళ్ల తర్వాత రింగ్ లోకి తెలుగు సినిమా బాక్స

పైన చెప్పొకున్నదంతా దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ గురించి.

By:  Tupaki Desk   |   14 Nov 2024 7:30 PM GMT
మళ్లీ మహా బలుడు.. 19 ఏళ్ల తర్వాత రింగ్ లోకి తెలుగు సినిమా బాక్స
X

ఇప్పుడు ఎవరికీ గుర్తు లేకపోవచ్చు.. అసలు తెలియకపోవచ్చు.. కానీ, 30 ఏళ్ల కిందట అతడు ఒక్క బౌట్ ఆడినా చాలు.. కోట్లాది మంది ప్రేక్షకులు ఎగబడి చూసేవారు.. అప్పట్లోనే వందల కోట్ల రూపాయిలు కుమ్మరించేవారు.. ఇక బాక్సింగ్ రింగ్ లో అతడు దిగాడంటే ప్రత్యర్థికి ముచ్చెమటలే.. మూడే పిడిగుద్దుల్లో అవతలివాడి పని ఖతం.. అయితే, అంతటి ప్రతిభావంతుడు వ్యక్తిగతంగా తీవ్ర వివాదాస్పదుడు. మహిళలతో సంబంధాలు.. గొడవలు.. వ్యక్తిగత అలవాట్లు.. ఆరోపణలు.. చాలా దారుణమైన ప్రవర్తన అతడిది. దీంతోనే అతడి క్రీడా కెరీర్ వెనుకబడిపోయింది. వ్యక్తిగత ప్రతిష్ఠ కూడా దిగజారింది.

చెవి కొరికి.. చేటు తెచ్చుకుని..

పైన చెప్పొకున్నదంతా దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ గురించి. బహుశా బాక్సింగ్ చరిత్రలో మొహమద్ అలీ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నది టైసన్ అంటే ఆశ్చర్యం కాదు. కానీ, టైసన్ క్రీడా జీవితం కంటే క్రమశిక్షణ లోపించిన అతడి వ్యక్తిగత జీవితం చాలా చెడ్డ పేరు తెచ్చింది. ఇవాండర్ హోలీఫీల్డ్ తో ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన బౌట్ లో అతడి చెవి కొరికిన టైసన్ చివరకు బాక్సింగ్ నుంచి తెరమరుగయ్యాడు.

తెలుగు సినిమాలో తళుక్కు..

టైసన్ గురించి అప్పుడొకటి ఇప్పుడొకటి కథనాలు వార్తలు వస్తున్నా.. అతడు ప్రత్యక్షంగా మీడియా ఎదుట కనిపించింది అరుదు. అయితే, అనూహ్యంగా రెండేళ్ల కిందట వచ్చిన లైగర్ సినిమాలో నటించాడు. దీంతో తెలుగు ప్రేక్షకులే కాక ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది. టైసన్ ఏమిటి..? తెలుగు సినిమాలో నటించడం ఏమిటి? అని. అయితే, ఆ సినిమా బాగా నిరాశపరచడంతో మళ్లీ టైసన్ ప్రస్తావన బయటకు రాలేదు.

ఇన్నాళ్లకు మళ్లీ రింగ్ లోకి?

బాక్సింగ్ దూరమై.. నటనలోనూ పెద్దగా ప్రయత్నాలు ఫలించని టైసన్ గురించి ఇప్పుడొక ఆసక్తికర అంశం తెలియవచ్చింది. మహా బలుడిగా పేరుగాంచిన అతడు మళ్లీ బాక్సింగ్ లోకి అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని. కాగా, 19 ఏళ్ల కిందటే టైసన్ చివరి బౌట్ లో పాల్గొన్నాడు. 2005 తర్వాత ప్రొఫెషనల్ బాక్సింగ్ లో మళ్లీ అడుగుపెట్టలేదు. అలాంటి టైసన్ 58 ఏళ్ల వయసులో జేక్ పాల్ తో తలపడనున్నాడట. యూట్యూబర్ గా పేరున్న జేక్ పాల్.. వయసు 27 ఏళ్లే. వీరి మధ్య బౌట్ అమెరికాలోని డల్లాస్ లో జరగనుంది. 1985లో కెరీర్ మొదలుపెట్టిన టైసన్ వరుసగా 37 మ్యాచ్ లను గెలిచాడు. అతడి రికార్డు 50-6 కావడం విశేషం.