'యుఐ' మూవీ రివ్యూ
అతను స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఓం.. ఎ.. ఉపేంద్ర.. లాంటి చిత్రాలు 90వ దశకంలో సంచలనం రేపాయి. అతను చాలా గ్యాప్ తర్వాత డైరెక్ట్ చేసిన సినిమా.. యుఐ.
By: Tupaki Desk | 20 Dec 2024 5:02 PM GMT'యుఐ' మూవీ రివ్యూ
నటీనటులు: ఉపేంద్ర-రేష్మ నన్నయ-మురళీ శర్మ-రవిశంకర్-అచ్యుత్ కుమార్-సాధు కోకిల-నిధి సుబ్బయ్య తదితరులు
సంగీతం: అజనీష్ లోక్ నాథ్
ఛాయాగ్రహణం: వేణుగోపాల్
నిర్మాతలు: మనోహరన్-శ్రీకాంత్
తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న కన్నడ నటుడు ఉపేంద్ర. అతను స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఓం.. ఎ.. ఉపేంద్ర.. లాంటి చిత్రాలు 90వ దశకంలో సంచలనం రేపాయి. అతను చాలా గ్యాప్ తర్వాత డైరెక్ట్ చేసిన సినిమా.. యుఐ. సినిమాకు సంబంధించి ప్రతి ప్రోమో వెరైటీగా ఉండడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం.
కథ: సత్య (ఉపేంద్ర) తన చుట్టూ ఉన్న వాళ్లందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి. మంచి పనులు చేస్తూ.. కష్టంలో ఉన్న వాళ్లను ఆదుకుంటూ జనంలో మంచి ఆదరణ సంపాదించుకుంటాడు. ఇది కత్తెర శీనా (రవిశంకర్) అనే రాజకీయ నాయకుడికి నచ్చదు. ఎలాగైనా సత్య అడ్డంకి తొలగించుకోవాలని చూస్తుంటాడు. అదే సమయంలో సత్య పోలికలు ఉన్న మరో వ్యక్తి జనాలను నానా హింసలు పెడుతుంటాడు. సమాజంలో రకరకాల వ్యక్తులను తీసుకొచ్చి తనదైన శైలిలో శిక్షిస్తుంటాడు. జనం అతణ్ని కల్కి అవతారంగా భావిస్తారు. ఆ కల్కి.. సత్యను కూడా బంధించి తన గురించి అతడికి ఓ నిజం చెబుతాడు. ఆ నిజం ఏంటి.. ఇంతకీ కల్కి లక్ష్యమేంటి.. అతడి అకృత్యాలను సత్య ఆపగలిగాడా.. ఈ ప్రశ్నలకు తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.
కథనం-విశ్లేషణ: ఓం.. ఎ.. ఉపేంద్ర.. సూపర్.. ఉపేంద్ర దర్శకత్వంలో వచ్చిన సంచలన చిత్రాలు. అతను అందరూ నడిచే దారిలో నడవడు. తన పాత్రలు-కథలు క్రేజీగా ఉంటాయి. రొటీన్ కు భిన్నంగా ఆలోచిస్తూ.. ఎవ్వరూ చర్చించని విషయాలను.. బయటికి మాట్లాడలేని అంశాలను.. తన పాత్రలు-కథల ద్వారా చర్చించడం.. సన్నివేశాలను క్రేజీగా తీర్చిదిద్దడం ద్వారా దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు ఉపేంద్ర. ఐతే గతంలో అతను తీసిన కథల్లో కొత్తగా ఏం చెప్పాలని చూసినా.. అందులో ఒక క్లారిటీ ఉండేది. చెప్పుకోవడానికి ఒక కథ.. దాన్ని నరేట్ చేయడానికి ఒక స్క్రీన్ ప్లే.. అర్థవంతమైన పాత్రలు కనిపించేవి. ఈ పరిధిలో ఉంటూనే కొత్తగా ఏదో చెప్పడానికి ప్రయత్నించేవాడు. కానీ 'ఉపేంద్ర' సినిమాకు సీక్వెల్ తీసినపుడు ఉప్పి క్రియేటివిటీ హద్దులు దాటిపోయింది. తనేం రాస్తున్నాడో.. ఏం తీస్తున్నాడో తెలియని అయోమయంలో ప్రేక్షకులను తీవ్ర గందరగోళానికి గురి చేసి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. ఇప్పుడు 'యుఐ'తో ప్రేక్షకులకు మరోసారి కఠిన పరీక్ష పెట్టాడు. క్రియేటివిటీ పేరుతో అర్థం పర్థం లేని కథ రాసి.. ఒక పద్ధతీ పాడూ లేకుండా ఇష్టం వచ్చినట్లు దాన్ని నరేట్ చేసి.. ఏం అర్థం చేసుకుంటారో.. ఎలా ఎంటర్టైన్ అవుతారో మీ ఇష్టం అన్నట్లుగా స్క్రీన్ మీదికి వదిలేశాడు. ఆరంభం నుంచి చివరి దాకా అసలీ కథేంటి.. పాత్రలేంటి.. ఉపేంద్ర అసలేం చెప్పదలుచుకున్నాడు అని... బుర్ర బద్దలుకోవడం తప్పితే ఇందులో ఆస్వాదించడానికి పెద్దగా ఏమీ లేదు. కొన్ని క్రేజీ సీన్లు.. డైలాగులు అక్కడక్కడా కొంత నవ్వించినప్పటికీ.. ఇదొక బ్రహ్మపదార్థం లాంటి సినిమానే.
ప్రేక్షకులకు అన్నీ విడమరిచి చెప్పాల్సిన అవసరం లేదన్నది దర్శకుడు ఉపేంద్ర ఉద్దేశం కావచ్చు. కానీ సినిమా అన్నాక ఒక నిర్దిష్టమైన కథ.. దాన్ని అర్థవంతంగా చెప్పే కథనం అవసరం. ఏ పాత్ర ఏంటో అని అయినా అర్థం కావాలి. ఒక సన్నివేశానికి.. ఇంకో సన్నివేశానికి సంబంధం ఉండాలి. కథలో ఒక కంటిన్యుటీ కనిపించాలి. దర్శకుడు అసలేం చెప్పదలుచుకున్నది ఆలోచిస్తే అయినా అర్థం కావాలి. నర్మగర్భంగా విషయం చెప్పడం వేరు. మనసులో ఏదో అనుకుని.. దాన్ని పేపర్ మీద ఇంకోలా రాసి.. తెర మీద ఇంకోలా ప్రెజెంట్ చేసి.. నా ఉద్దేశమేంటో డీకోడ్ చేసి అర్థం చేసుకో అని ప్రేక్షకులకు పజిల్ పెట్టడంలో ఔచిత్యమేంటో ఉసేంద్రనే చెప్పాలి. తన క్రియేటివిటీని.. ఫిలాసఫీలను తక్కువ చేయడం కాదు కానీ... యుఐ సినిమాలో అతను చూసించిన వైవిధ్యమంతా ఒక వ్యర్థ ప్రయత్నమే అయింది. ఎక్కడా కుదురుగా కథను చెప్పకపోవడం.. విపరీతమైన గందరగోళంతో సన్నివేశాలు సాగడం వల్ల ఏ దశలోనూ ఈ సినిమాను ఆస్వాదించలేని పరిస్థితి. కథ-పాత్రలే అర్థం కానపుడు సన్నివేశాల్లో కొంత వినోదం ఉన్నప్పటికీ వాటిని ఎలా ఎంజాయ్ చేయగలం?
యుఐ సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అంటే.. చివర్లో చూపించే భవిష్యత్ చిత్రమే. మనిషి చేసిన తప్పుల ఫలితంగా కొన్ని దశాబ్దాల తర్వాత ప్రపంచం ఎలా ఉండబోతోందో చూపిస్తూ సెటిరైకల్ గా ఆ ఎపిసోడ్ ను ఉపేంద్ర తీర్చిదిద్దిన తీరు చాలా బాగుంది. అందులో సన్నివేశాలు.. డైలాగులు భలే అనిపిస్తాయి. సినిమాలో కొంచెం కుదురుగా.. అర్థవంతంగా సాగే ఎపిసోడ్ ఇదొక్కటే. యుఐ మూవీలో ఇదే బెస్ట్ అని ఉపేంద్రకు కూడా అర్థమైంది కాబట్టే దీన్నే ట్రైలర్ గా వదిలాడు. అది చూసి ప్రేక్షకులు ఏవో అంచనాలతో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తే అతను ఇంకేదో సినిమా చూపించాడు. లోతైన ఫిలాసఫీలు చెప్పాలని ఉపేంద్ర ప్రయత్నించాడు కానీ.. అవి అర్థం చేసుకునే శక్తి, ఓపిక ప్రేక్షకులకు ఉండవు. తన గజిబిజి నరేషన్ ప్రేక్షకుల శక్తి.. ఓపిక నశించిపోయేలా చేస్తాయి మరి. రేప్పొద్దున సినిమాను మళ్లీ మళ్లీ చూసి హిడెన్ డీటైల్స్ బయటికి తీసి.. ఉప్పి బ్రిలియన్స్ ఇదీ అంటూ కొందరు ఊదరగొట్టొచ్చు. కానీ ప్రేక్షకులకు అర్థం కాని విధంగా.. అత్యంత గందరగోళంగా ఈ కథను నరేట్ చేయడం ఉపేంద్ర తప్పే అవుతుంది తప్ప.. ప్రేక్షకులను మాత్రం నిందించడానికి వీల్లేదు. ఎంత ఇంటలిజెన్స్ ఉన్న ప్రేక్షకులకైనా పరీక్ష పెట్టి అసహనానికి గురి చేసేలా యుఐ మూవీ సాగుతుంది. ఈ హెచ్చరిక తర్వాత కూడా యుఐ మూవీ చూసి ఏదైనా డీకోడ్ చేసే ప్రయత్నం చేయాలనుకుంటే అది ప్రేక్షకుల ఛాయిస్.
నటీనటులు: ఉపేంద్ర తన అభిమానులను అలరించేలా క్రేజీగా కనిపించే ప్రయత్నం చేశాడు. విచిత్ర వేషధారణ.. విపరీత ప్రవర్తనతో సాగే పాత్రల్లో ఉపేంద్రను చూడ్డం అభిమానులకు ఇష్టం కాబట్టి తన పాత్ర వరకు బాగానే కనెక్ట్ అవుతారు. మిగతా ఆర్టిస్టులు కూడా ఉపేంద్ర దర్శకత్వ అభిరుచికి తగ్గట్లు నటించారు. రవిశంకర్ పాత్ర ఫన్నీగా అనిపిస్తుంది. కొన్ని చోట్ల నవ్విస్తుంది. ఆయన నటన బాగానే సాగింది. హీరోయిన్ రేష్మ నన్నయ తన ఉనికిని చాటుకునే అవకాశం రాలేదు. అసలు తన పాత్రేంటో.. అసలు సినిమాలో తనెందుకు ఉందో అర్థం కాదు. అచ్యుత్ కుమార్.. సాధు కోకిల పాత్రలు.. నటన గురించి చెప్పడానికేమీ లేదు. మిగతా ఆర్టిస్టులంతా మామూలే.
సాంకేతిక వర్గం: 'మంగళవారం'.. 'విరూపాక్ష' సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన సంగీత దర్శకుడు అజనీష్ లోక్ నాథ్.. 'యుఐ'లో తన మార్కు సంగీతం ఇవ్వలేకపోయాడు. అతను ఉపేంద్ర అభిరుచికి తగ్గ పాటలు-నేపథ్య సంగీతం అందించాడు. సోషల్ మీడియా పాపులర్ మీమ్స్ మీద చేసిన పాట ఒక్కటి బాగుంది. మిగతా పాటలేవీ అంతగా ఆకట్టుకోవు. నేపథ్య సంగీతం అంతటా కథాకథనాలకు తగ్గట్లు పిచ్చి సౌండ్లతో సాగిపోయింది. కొన్ని సౌండ్స్ వల్గర్ ఫీలింగ్ కలిగిస్తాయి. వేణుగోపాల్ ఛాయాగ్రహణం కూడా దర్శకుడి శైలికి తగ్గట్లు గజిబిజిగా సాగింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా రిచ్ గా తీశారు. రైటర్ కమ్ డైరెక్టర్ ఉపేంద్ర.. బుర్రలో ఏవేవో ఆలోచనలు ఉన్నాయి కానీ.. అవి రైటింగ్ పేపర్ మీదికి కూడా సరిగా రానట్లున్నాయి. ఇక తెరపైన అతను సృష్టించిన గందరగోళం అంతా ఇంతా కాదు. ఆరంభం నుంచి చివరిదాకా అసలు ఉపేంద్ర ఏం చెప్పదలుచుకున్నాడనే అయోమయంలోనే ఉంటాం. చివరికి ఈ గందరగోళం ఇంకా పెరిగి తలలు పట్టుకుని బయటికి వస్తాం.
చివరగా: యుఐ.. అర్థం లేని క్రియేటివిటీ
రేటింగ్- 2/5