ప్రివ్యూ థియేటర్‌లో నల్ల మబ్బు చూసి షాక్
సహజంగానే ఏదైనా థియేటర్ కి పిలిచి ప్రివ్యూ వేస్తున్నాం అంటే, అక్కడ స్మార్ట్ (ఫోన్) కెమెరాలు పట్టుకుని ఏవైనా నచ్చిన సీన్లను షూట్ చేయాలని అనుకునే ఆడియెన్ కూడా ఉంటారు.
By: Tupaki Desk | 19 Sep 2023 5:06 PM GMTసహజంగానే ఏదైనా థియేటర్ కి పిలిచి ప్రివ్యూ వేస్తున్నాం అంటే, అక్కడ స్మార్ట్ (ఫోన్) కెమెరాలు పట్టుకుని ఏవైనా నచ్చిన సీన్లను షూట్ చేయాలని అనుకునే ఆడియెన్ కూడా ఉంటారు. ఇంచుమించు అదే విధమైన ఏర్పాట్లతో వచ్చారు చాలామంది. ఉపేంద్ర దర్శకత్వం వహించిన UI (ఇది యు ఐ కాదు.. ఇది విష్ణు నామం తరహా సింబల్) టీజర్ ని చూడాలని అంతా ఆరాటపడ్డారు. ప్రివ్యూ థియేటర్ కి వచ్చి అందరూ ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇంతలోనే టీజర్ ని తెరపై ప్రదర్శించారు.
తీరా చూస్తే స్క్రీన్ అంతా నల్ల మబ్బు మయం. అక్కడ ఏమీ కనిపించదు. పైగా థియేటర్ లో లైట్లు ఆర్పేయడంతో చిమ్మ చీకటి. విజువల్స్ ఏవైనా మిస్సయ్యాయా? ప్రొజెక్టర్ నుంచి సరిగా పడడం లేదా? అంతా అయోమయంగా చూస్తున్నారు. ఓవైపు ఆడియో వినిపిస్తున్నా కానీ విజువల్ కనిపించలేదు. దీంతో అందరూ సందిగ్ధతలోనే ఉండిపోయారు. టీజర్ బ్యాక్ గ్రౌండ్ లో అరుపులు కేకలు .. సవాళ్లు ఇవన్నీ ఎంతో ఆకట్టుకున్నాయి. సినిమాలో చాలా మ్యాటర్ ఉందని కూడా అంతా ఫిక్సయిపోయేలా చేసింది ఈ ప్రయోగం.
అయితే టీజర్ రిలీజ్ తర్వాత వేదికపైకి వచ్చి అన్ని సందేహాలకు ఉప్పీ అండ్ టీమ్ వివరణ కూడా ఇచ్చారు. మా టీజర్ కి విజువల్ ఉండదు.. ఓన్లీ డైలాగులు మాత్రమేనని చెప్పి సర్ ప్రైజ్ చేసారు. అయితే టీజర్ లో ధ్వనులు వింటున్నంత సేపు ఏదైనా విజువల్ వస్తే చిత్రీకరించాలని స్మార్ట్ ఫోన్ కెమెరాలు ఆన్ చేసి వెయిట్ చేసినవాళ్లు చివరికి ఏ విజువల్ దొరక్క షాక్ కి గురయ్యారు. యుఐ టీజర్ ప్రివ్యూ వేళ చాలామంది ఉపేంద్ర అభిమానులకు ఎదురైన అనుభవమిది.
ప్రొజెక్షన్ వందశాతం సక్సెస్. అనుకున్నది అనుకున్నట్టు జరిగింది. ఈ వింత ప్రయోగం నిజంగా ఇంత పెద్ద హిట్ అవుతుందనుకోలేదు. దీంతో ఉప్పీ టీమ్ చాలా ఆనందంలో ఉందిప్పుడు. మునుముందు ట్రైలర్ విషయంలోను ఏం చేస్తాడోననే డౌట్ కూడా రైజ్ అయింది. ఏదైనా టీజర్ లేదా ట్రైలర్ ని ఎప్పుడూ ఒకేలా చూపించాలని చూసేవాళ్లు క్రియేటర్లు ఎలా అవుతారు? క్రియేటర్ అంటే ఉపేంద్ర. సౌతిండియాలోనే అత్యంత విలక్షణమైన దర్శకుడు.. నటుడు .. ఆల్ రౌండర్ అతడు. ఉప్పీ దృష్టి కోణం పూర్తిగా వేరు. అతడి ఆలోచనా తీరు వేరు. గుంపులో ఒక గొర్రెలా ఉండడు. మందను నడిపించే నాయకుడిలా ఉంటాడు. అతడు తెరకెక్కించిన ఎ- ఉపేంద్ర-ఓం-రా .. ఇవన్నీ విలక్షణమైన సినిమాలు. ఉపేంద్ర దృష్టి కోణం నుంచి వచ్చినవి. వీటన్నిటినీ మించి యుఐ తెలుగు ఆడియెన్ ని ఆకట్టుకుంటుందనే ఆశిద్దాం.
90శాతం గ్రాఫిక్స్‌తోనే...!
2015లో విడుదలైన ఉప్పి 2 తర్వాత ఉపేంద్ర తిరిగి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం 90శాతం గ్రాఫిక్స్ నిండి ఉంటుందని, ప్రీ-ప్రొడక్షన్ భారీ టాస్క్ అయినందున తెరపైకి రావడానికి ఎక్కువ సమయం పడుతుందని ఉపేంద్ర టీజర్ లాంచ్ వేడుకలో వెల్లడించారు. టీజర్ లాంచ్‌లో శివరాజ్‌కుమార్, గీతా శివరాజ్‌కుమార్, దునియా విజయ్, వినయ్ రాజ్‌కుమార్, మేఘా శెట్టి, నిధి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.