Begin typing your search above and press return to search.

20 ఏళ్ల క్రితం ఆగిపోయిన సినిమా టైటిల్ ఇప్పుడు..!

దాదాపు 20 సంవత్సరాల క్రితం మర్మయోగి టైటిల్ తో కమలహాసన్ సినిమాను ప్రారంభించాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను పూర్తి చేయలేక పోయాడు.

By:  Tupaki Desk   |   18 Oct 2023 4:30 PM GMT
20 ఏళ్ల క్రితం ఆగిపోయిన సినిమా టైటిల్ ఇప్పుడు..!
X

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ వయసు అయిపోయింది.. ఆయన సినిమాలు చేయకపోతే బాగుంటుంది, చేసిన ప్రతి సినిమా కూడా నిరాశ పరచుతోంది కనుక సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లో ఆయన బిజీ అవ్వాలి. లేదంటే విశ్రాంతి తీసుకోవాలని ఆయన అభిమానులు కొంతమంది ఆ మధ్య అనుకున్నారు. కానీ ఇప్పుడు వారు కమల్ హాసన్ మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. ఒకే ఒక్క సినిమా కమల్ హాసన్ కి పునర్జీవనం ఇచ్చినట్లుగా పనిచేస్తుంది.

లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ సినిమా కమల్ కెరియర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. దాంతో కమల్ తిరిగి 20 ఏళ్ల వెనక్కి వెళ్ళినట్లుగా అనిపిస్తున్నాడు. పాతిక సంవత్సరాల క్రితం కమల్ హాసన్ ఎంత బిజీగా సినిమాలు చేసేవాడో ఇప్పుడు కూడా అంతే బిజీగా సినిమాలు చేస్తున్నాడు. ఏకంగా అరడజంను సినిమాలకు ఓకే చెప్పి అందులో కొన్నింటిని ఇప్పటికే మొదలు పెట్టగా మరికొన్నింటిని త్వరలోనే ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు.

కమల్ కమిట్ అయిన సినిమాల్లో హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఒకటి. ఆ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. హెచ్ వినోద్ కమర్షియల్ చిత్రాలకు పెట్టింది పేరు.. అందుకే కమల్ హాసన్ తో ఆయన రూపొందించబోతున్న సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆ అంచనాలను మరింతగా పెంచేందుకు గాను కమల్ హాసన్ డ్రీం ప్రాజెక్టుగా అందరికీ సుపరిచితం ఆయన మర్మయోగి టైటిల్ ను ఈ సినిమాకి ఉపయోగించబోతున్నారు.

కమల్ హాసన్ అభిమానులకు మర్మయోగి టైటిల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 20 సంవత్సరాల క్రితం మర్మయోగి టైటిల్ తో కమలహాసన్ సినిమాను ప్రారంభించాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను పూర్తి చేయలేక పోయాడు. 20 ఏళ్ల తర్వాత కూడా ఆ సినిమా గురించి అప్పుడప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది.

అలాంటి టైటిల్ ని ఇప్పుడు తన సినిమాకు ఉపయోగించడం వల్ల దర్శకుడు ముందుగానే అందరి దృష్టిని ఆకర్షించాడు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మంచి కలెక్షన్స్ రావడం ఖాయం అన్నట్లుగా టైటిల్ విషయంలో కమల్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.