లంబకోణాలు నేర్పిన వాళ్లే కుంభకోణాలు చేస్తే ఎలా?
'మనదేశం నిరుద్యోగ భారతం కాదు..ఉద్యోగ భారతం. గ్రూప్ -1..2లాంటి ఉద్యోగ నియామకాల పరీక్షల్లోనూ పేపరు లీకేజీలు జరిగితే విద్యార్ధుల భవిష్యత్ ఏం కావాలి? నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి?
By: Tupaki Desk | 3 Oct 2023 3:30 PM GMTవిప్లవ చిత్రాల దర్శకుడు ఆర్ . నారాయణమూర్తి సంచలనాత్మక చిత్రాల గురించి చెప్పాల్సిన పనిలేదు. బడుగు..బలహీన వర్గాల సమస్యల్ని ఎన్నో చిత్రాల ద్వారా కళ్లకు కట్టారు. ప్రజావ్యతిరేక తిరుగుబాట్లు ఎన్నింటినో తెరకెక్కించారు. సామాజిక దృక్ఫధంతో ఎన్నో సమస్యల్ని తన సినిమాల ద్వారా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లిన ఏకైక దర్శకుడు. ప్రభుత్వాల్ని సైతం ప్రశ్నించేలా ఎన్నో సినిమాలు చేసారు. అందుకే కామ్రేడ్ గా ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించారు.
తాజాగా 'యూనివర్శిటీ` టైటిల్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా ప్రేక్షకుల మందుకు రావాలి. అనివార్య కారణాలతో వాయిదా పడిన చిత్రం ఈనెలలో రిలీజ్ అవుతుంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సినిమా గురించి నారాయణమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఈ సినిమాలో సంచలన అంశాల్నే టచ్ చేసినట్లు తెలుస్తుంది.
'మనదేశం నిరుద్యోగ భారతం కాదు..ఉద్యోగ భారతం. గ్రూప్ -1..2లాంటి ఉద్యోగ నియామకాల పరీక్షల్లోనూ పేపరు లీకేజీలు జరిగితే విద్యార్ధుల భవిష్యత్ ఏం కావాలి? నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి? లంబకోణాలు నేర్పించిన వారే కుంభకోణాలకు పాల్పడుతుంటే రెక్కలు తెగిన జ్ఞానం తెగిన జ్ఞాన పావురాలు విలవిలా కొట్టుకుంటూ ఊపిరాకడక నేల రాలుతున్నాయి. వారిని చూసి కన్న తల్లిదండ్రులు ఏమైపోవాలి.
రెండవ ప్రపంచ యుద్దంలో నాగసాకి..హిరోషిమాలపై ఆమెరికా వేసిన అణుబాంబులు కంటే ప్రమాదకర మైనది ఈ కాపియింగ్. చూసి రాసిన వాడు డాక్టర్ అయితే రోగి బ్రతుకుతాడా? ఇంజనీయర్ అయితే బ్రిడ్జీ నిలబెడతాడా? ఈ పేపరు లీకేజీ వల్ల విద్యావ్యవస్థ చిన్నభిన్నమైతే మొత్తం వ్యవస్థే కుప్పకూలిపోతుంది. విద్యార్దులు జాతి సంపద. వాళ్లను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. సమాజానికి ఉంది. ఇవే అంశాలు యూనివర్శీటీలో ఉంటాయి` అని అన్నారు.
ఆ మద్య తెలంగాణ పబ్లిక్ సర్వీష్ కమీషన్ పేపరు లీకేజీ వ్యవహారం దేశ వ్యాప్తంగా ఎంత సంచలనమైందో తెలిసిందే. ఏకంగా గ్రూప్ పరీక్షలకు సంబంధించిన పేపరే లీక్ అవ్వడంతో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు తెరపైకి వచ్చాయి. గతంలోనూ పలు రాష్ట్రాల్లోనూ ఇలాంటి లీకులు జరిగాయి. అలాగే రైల్వే పరీక్షల పేపరు లీకేజులు గత ప్రభుత్వంలో హాట్ టాపిక్ గా మారిన అంశాలే.