Begin typing your search above and press return to search.

రూ.100 కోట్ల హీరో సినిమా ఓపెనింగ్‌ కలెక్షన్స్‌ రూ.1.5 కోట్లు!

ఉన్ని ముకుందన్‌ ఇక మీదట బాక్సాఫీస్ వద్ద తన ప్రతి సినిమాతో కుమ్మేయడం ఖాయం అని ఫ్యాన్స్‌ అనుకున్నారు. కానీ చాలా తక్కువ గ్యాప్‌లోనే వచ్చిన ఉన్ని ముకుందన్ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.

By:  Tupaki Desk   |   25 Feb 2025 3:30 PM GMT
రూ.100 కోట్ల హీరో సినిమా ఓపెనింగ్‌ కలెక్షన్స్‌ రూ.1.5 కోట్లు!
X

మలయాళ స్టార్‌ నటుడు ఉన్ని ముకుందన్‌ కెరీర్‌లో మొదటి బ్లాక్ బస్టర్‌ సక్సెస్‌ను 'మార్కో'తో దక్కించుకున్నాడు. గత ఏడాది చివర్లో క్రిస్మస్‌ కానుకగా విడుదలైన మలయాళ మూవీ 'మార్కో' బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు మించి వసూళ్లు రాబట్టింది. తక్కువ సమయంలో ఎక్కువ వసూళ్లు రాబట్టిన సినిమాగానూ మార్కో నిలిచింది. మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో 'ఎ' సర్టిఫికెట్‌ సినిమాలు వచ్చాయి. కానీ అందులో ఏ ఒక్కటి రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టలేదు. మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఈమధ్య కాలంలో వంద కోట్ల వసూళ్లు అనేది కామన్‌ అయింది. కానీ ఎ సర్టిఫికెట్‌ సినిమాలు మాత్రం వంద కోట్ల మార్క్‌ను చేరుకోలేక పోయాయి.

ఆ అరుదైన అవకాశంను ఉన్ని ముకుందన్‌ తన 'మార్కో' సినిమాతో చేరుకున్నాడు. అత్యంత హింసాత్మక సినిమా కావడంతో 'మార్కో' సినిమాకు సెన్సార్‌ బోర్డ్‌ ఎ సర్టిఫికెట్‌ను ఇవ్వడం జరిగింది. అయినా మలయాళ బాక్సాఫీస్‌ వద్ద సినిమాకు వంద కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. సినిమాలో ఉన్ని ముకుందన్‌ నటనకు ప్రశంసలు దక్కాయి. రికార్డ్‌ వసూళ్లు సొంతం చేసుకుని అరుదైన ఘనత దక్కించుకున్న ఉన్ని ముకుందన్‌ ఇక మీదట బాక్సాఫీస్ వద్ద తన ప్రతి సినిమాతో కుమ్మేయడం ఖాయం అని ఫ్యాన్స్‌ అనుకున్నారు. కానీ చాలా తక్కువ గ్యాప్‌లోనే వచ్చిన ఉన్ని ముకుందన్ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.

మార్కో సినిమా తర్వాత ఉన్ని ముకుందన్‌ 'గెట్‌ సెట్‌ బేబీ' సినిమాతో వచ్చాడు. విభిన్నమైన కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను మలయాళ ప్రేక్షకులు ఆధరించడం లేదు. ఇటీవలే విడుదలైన ఈ సినిమాకు డిజాస్టర్‌ టాక్‌ వచ్చింది. మొదటి వీకెండ్‌లో ఈ సినిమా కేవలం రూ.1.5 కోట్ల వసూళ్లు రాబట్టింది. సినిమాకు నెగటివ్‌ టాక్ వ్యాప్తి చెందడంతో మొదటి రోజు నుంచే వసూళ్లు డ్రాప్ అయ్యాయి. వీక్‌ డేస్‌లో చాలా చోట్ల షో లు రద్దు అవుతున్నాయట. వంద కోట్లకు మించి వసూళ్లు సాధించిన హీరో తదుపరి సినిమా ఫలితం మరీ ఇంత దారుణంగా ఉందేటి అంటూ బాక్సాఫీస్‌ వర్గాల వారు సైతం షాక్‌ అవుతున్నారు.

ఉన్ని ముకుందన్‌ హీరోగా నటించిన ఈ సినిమాలో నిఖిల విమలన్‌ హీరోయిన్‌గా నటించింది. ఇంకా ఈ సినిమాలో చెంబన్‌ వినోద్‌ జోస్‌, శ్యామ్‌ మోహన్‌, సురభి లక్ష్మి, జానీ ఆంటోనీ, సుధీష్‌, దినేష్‌ ప్రభాకర్‌, మీరా వాసుదేవన్‌, భగత్‌ మాన్యూవల్‌, అభిరామ్‌ ఎల్‌ షిబ్లాత్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సామ్ సిఎస్ సంగీతాన్ని అందించారు. వినయ్‌ గోవింద్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్‌ వద్ద లాంగ్‌ రన్‌లో కనీసం రూ.5 కోట్లు కూడా రాబట్టే పరిస్థితి లేని ఈ సినిమాను హీరో ఉన్ని ముకుందన్‌ ఎలా ఒప్పుకున్నాడు అంటూ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.