సడెన్‌గా ఉపాసన ఐల్యాండ్ పర్యటన రద్దు!
గ్లోబల్ వార్మింగ్ వంటి ప్రమాదాలను మనిషి ఎదుర్కోవడానికి కారణాలలో ఇది ఒకటి అని సైన్స్ పత్రికలు ఘోషిస్తున్నాయి.
By: Tupaki Desk | 19 Dec 2024 10:01 AM GMTఈ సృష్టిలో జీవించే హక్కు ప్రతి ప్రాణికి ఉంది. కానీ అసాధారణ మేధో సంపత్తి ఉన్న మానవుడు చేస్తున్న ప్రాణహాని అంతా ఇంతా కాదు. మనిషి మనుగడ కోసం, ఆహారం కోసం నిరంతరం మూగ జీవాలను హననం సాగిస్తున్నాడు. ముఖ్యంగా సముద్ర జీవాలు, మత్స్యసంపదపై మనిషి ఆధారపడటం, పెచ్చుమీరిన వాణిజ్యం పర్యావరణ హానిగా మారింది. గ్లోబల్ వార్మింగ్ వంటి ప్రమాదాలను మనిషి ఎదుర్కోవడానికి కారణాలలో ఇది ఒకటి అని సైన్స్ పత్రికలు ఘోషిస్తున్నాయి.
తాజాగా మరోసారి పర్యావరణ హాని గురించి చర్చ జరగడానికి ఉపాసన కొణిదెల కారకురాలయ్యారు. ఉపాసన తన ఐస్‌లాండ్ ప్లాన్‌లను ఆకస్మికంగా రద్దు చేసుకున్నట్లు ఇన్‌స్టాలో ప్రకటించడం హాట్ టాపిగ్గా మారింది. ఐస్‌లాండ్ లో హాని కలిగించే ఫిన్ వేల్స్ సహా రెండు వేలు పైగా తిమింగలాలను చంపడానికి ప్రభుత్వం అనుమతించింది. ఆ మేరకు వేటగాళ్లకు లైసెన్సులను ప్రభుత్వం పునరుద్ధరించనుంది. దీంతో ఐస్ ల్యాండ్ కు తన పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకున్నట్టు ఉపాసన ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని సోషల్ మీడియా అనుచరులు సమర్థించారు. ఇలాంటి ఒక మంచి కాజ్ కోసం నిలబడటాన్ని ప్రశంసించారు. ప్రాణుల పట్ల జాలి దయ, పర్యావరణాన్ని పరిరక్షించాలన్న తన ఆలోచనాత్మక నిర్ణయానికి అన్నివైపుల నుంచి మద్ధతు లభించింది.
జలచరాల్లో పర్యావరణాన్ని కాపాడే జీవాలు తిమింగళాలు. అందుకే వీటి సంహారానికి జారీ చేసే లైసెన్సులను రద్దు చేయాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. వాణిజ్యం పరంగా తిమింగలాల వేటపై శాశ్వత నిషేధానికి కట్టుబడి ఉండాలని ప్రపంచ దేశాల్లో చర్చ సాగుతోంది. దీనికి యూరోపియన్ యూనియన్ మద్ధతు కూడా ఉంది. తిమింగళాలు వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ ని సంగ్రహించి ఆక్సిజన్ పెరగడానికి సహకరిస్తాయి. అలాంటి సముద్ర జీవాలను రక్షించాల్సిన బాధ్యత మానవాళికి ఉంది. ఉపాసన- రామ్ చరణ్ దంపతులు క్లిన్ కారా సహా సెప్టెంబర్ లో ఆస్ట్రేలియాలో పర్యటించిన సంగతి తెలిసిందే. వరుసగా పలు దేశాల్లో ఉపాసన పర్యటిస్తున్నారు. కానీ ఐస్ ల్యాండ్ పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకున్నారు.