ముఖం పెదాలకు సర్జరీలా? తస్మాత్ జాగ్రత్త!- ఉర్ఫీ
తన 18 సంవత్సరాల వయస్సు నుండి లిప్ ఫిల్లర్‌లను ఆశ్రయిస్తున్నానని ఉర్ఫీ జావేద్ వెల్లడించింది
By: Tupaki Desk | 25 July 2023 3:42 AM GMTచాలా మంది కథానాయికలు నటీమణులు తమ అందానికి మెరుగులు దిద్దుకునేందుకు శస్త్ర చికిత్సలను ఎంచుకున్న సందర్భాలున్నాయి. శ్రీదేవి మొదలు ప్రియాంక చోప్రా వరకూ.. నేటితరం లో శృతిహాసన్.. ఉర్ఫీ జావేద్ వరకూ అందానికి మెరుగులు దిద్దుకునేందుకు వెనకాడని నాయికలు ఎందరో. అయితే ఒక్కోసారి అందానికి శస్త్ర చికిత్సలు వికటిస్తే అది ప్రమాదకరంగాను మారుతుంది. పబ్లిక్ లో తిరగాలంటేనే భయపడేలా రూపం మారిపోతుంది. శస్త్రచికిత్స వికటిస్తే పెను విపత్తు ఎలా ఉంటుందో ఇప్పుడు తనకు కూడా అనుభవం అయిందని ఉర్ఫీజావేద్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది.
నిరంతరం తనదైన ఫ్యాషన్ సెన్స్ తో హెడ్ టర్నర్ గా మారిన నటి కం మోడల్ ఉర్ఫీ జావేద్ తాను కూడా పెదవికి శస్త్ర చికిత్స చేయించుకున్నానని అయితే అది ఫెయిలైందని వెల్లడించింది. ఉర్ఫీ తన అందం ప్రక్రియ తాలూకా వివిధ దశలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసి శస్త్ర చికిత్సల విషయంలో ప్రజలు జాగ్రత్త వహించాలని కోరింది. తన 18 సంవత్సరాల వయస్సు నుండి లిప్ ఫిల్లర్‌లను ఆశ్రయిస్తున్నానని ఉర్ఫీ జావేద్ వెల్లడించింది.
అప్పటికి నా దగ్గర అంత డబ్బు లేదు కానీ నా పెదవులు చాలా సన్నగా ఉన్నాయని నేను భావించేదానిని. నాకు పెద్ద నిండు పెదవులు కావాలి. నేను డెర్మటాలజీ క్లినిక్ కి వెళ్లాను. తక్కువ ఖర్చుతో ఫలితం ఆశించాం.. కానీ కొన్నిసార్లు ఫలితాలు ఇలా ఉంటాయి. అందుకే ఆ చికిత్సను నేను రద్దు చేసుకున్నాను.. ఇది అత్యంత బాధాకరమైన విషయం అని ఉర్పీ తెలిపింది.
అందానికి మెరుగుల కోసం అత్యుత్సాహం ప్రదర్శించేవారంతా చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ ఎంపిక చాలా కీలకం అని కూడా ఉర్పీ సూచించింది. బ్యూటీ ప్రొసీజర్‌లను పొందే ముందు క్షుణ్ణంగా పరిశోధించాకే నిర్ణయం తీసుకోవాలని కోరింది. నేను శస్త్ర చికిత్సలు అవసరం లేదని ప్రజలకు చెప్పడం లేదు కానీ నిజానికి నేను చెప్పదలుచుకున్నది ఫిల్లర్లు లేదా బొటాక్స్ పొందేటప్పుడు జాగ్రత్తగా ఉండండి... అని వ్యాఖ్యానించింది.
"చాలా సంవత్సరాల ప్రయాణం తర్వాత నా ముఖానికి ఏది సరిపోతుందో నాకు తెలుసు. ఇప్పుడు తక్కువ ఎక్కువల గురించి నాకు తెలుసు. ఏదైనా వైద్యుడి వద్దకు వెళ్లే ముందు క్షుణ్ణంగా పరిశోధన చేయమని ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించడం నా లక్ష్యం. నేను నిజంగానే అందరికీ ఫిల్లర్‌లను సిఫార్సు చేస్తున్నాను.
మిమ్మల్ని లేదా మీ ముఖాన్ని అసహ్యించుకునే బదులు మీ ముఖం లేదా శరీరం గురించి మీకు కొన్ని అభద్రతాభావాలు ఉంటే ఫిల్లర్లు లేదా సర్జరీలను ఎంచుకోవడం మంచిది. కానీ చాలా మంచి డాక్టర్ ని ఎంపిక చేసుకోవాలి సుమీ! అంటూ తన అనుభవ పాఠాల నుంచి చాలానే చెప్పింది ఉర్ఫీ.
నిజానికి అనుభవం ఉన్న వైద్యులు ఫీజులు ఎక్కువ తీసుకుంటారు. కానీ చికిత్స సుఖంగా ఉంటుంది. అంతగా అనుభవం లేని డాక్టర్లు ఫీజు తక్కువ తీసుకుంటారు. కానీ ప్రజలపై ప్రయోగాలు చేస్తుంటారు. ఇది అందరూ గుర్తించగలిగే సింపుల్ లాజిక్. ఇది తెలుసుకోకుండా ఉర్ఫీ తక్కువ ఫీజు కోసం నైపుణ్యం లేని డెర్మటాలజిస్టులను కలిసి దెబ్బ తిందన్నమాట!!