మణిపూర్ లో 'ఉరి - ది సర్జికల్ స్ట్రైక్'... 23 ఏళ్ల తర్వాత హిందీ సినిమా!
ఇక్కడ ఓపెన్ ఎయిర్ థియేటర్ లో విక్కీ కౌశల్ నటించిన "ఉరి.. ద సర్జికల్ స్ట్రైక్" చిత్రాన్ని ప్రదర్శించగా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు.
By: Tupaki Desk | 16 Aug 2023 9:05 AM GMTదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మణిపూర్ అల్లర్ల సంగతి తెలిసిందే. ఒక్కసారిగా భారతదేశాన్ని ఒక కుదుపు కుదిపేసింది ఈ సంఘటన. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు కల్పించుకుని కీలక వ్యాఖ్యలు చేయడంతో ప్రభుత్వాలు కాస్త అలర్ట్ అయ్యాయని అంటుంటారు. అయితే ప్రస్తుతం మణిపూర్ లో సినిమా ప్రదర్శన జరిగింది.
అవును... జాతుల మధ్య హింసతో గత మూడు నెలలుగా ఉక్కిరిబిక్కిరై వణికిపోయిన మణిపూర్ లో కొద్ది కొద్దిగా పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఇందులో భాగంగా... ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలు ప్రారంభం అయ్యాయి. ఇదే సమయంలో.. రాష్ట్రంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులను సైతం తిప్పుతోంది.
ఈ క్రమంలో 23 ఏళ్ల తరువాత తాజాగా రాష్ట్రంలో హిందీ సినిమా ప్రదర్శనను చేపట్టారు. 2000 సంవత్సరంలో రాష్ట్రంలో హిందీ సినిమా ప్రదర్శించవద్దని మైతీ ఉగ్రవాద సంస్థ హెచ్చరించడంతో బంద్ అయిన హిందీ సినిమాల ప్రదర్శన.. 23 ఏళ్ల తరువాత మంగళవారం తిరిగి ప్రారంభం అయింది.
మైతీ ఉగ్రవాద సంస్థ హిందీ సినిమా ప్రదర్శించవద్దని 2000 సంవత్సరంలో హెచ్చరించడంతో అక్కడ బాలీవుడ్ సినిమాలు ప్రదర్శన ఆగిపోయింది. మణిపూర్ లో 1998లో చివరిగా ప్రదర్శితమైన సినిమా కుచ్ కుచ్ హోతా హై. ఆ తరువాత రాష్ట్రంలో హిందీ సినిమాల ప్రదర్శన చేయరాదని నిషేధం విధించారు.
అయితే ప్రస్తుతం 23 ఏళ్ల తర్వాత మణిపూర్ హింసాకాండలో తీవ్రంగా ప్రభావితమైన చురాచందాపూర్ జిల్లాలో హిందీ సినిమాను ప్రదర్శించారు. ఇది మణిపూర్ కేపిటల్ ఇంఫాల్ కు 63 కి.మీ.దూరంలో ఉంది. ఇక్కడ ఓపెన్ ఎయిర్ థియేటర్ లో విక్కీ కౌశల్ నటించిన "ఉరి.. ద సర్జికల్ స్ట్రైక్" చిత్రాన్ని ప్రదర్శించగా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు.
మైతీ వేర్పాటువాద సంస్థ "పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ"కి చెందిన పొలిటికల్ వింగ్ రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్ 2000 సెప్టెంబరులో హిందీ చిత్రాలను మణిపూర్ లో ప్రదర్శించ వద్దని హెచ్చరించింది. ఈ క్రమంలో తాజాగా "హమర్ స్టూడెంట్స్ అసోసియేషన్"(హెచ్‌ఎస్‌ఏ) చొరవతో తిరిగి ప్రారంభమయింది.