Begin typing your search above and press return to search.

వర్మతో గొడవపై క్లారిటీ ఇచ్చింది

రామ్‌ గోపాల్‌ వర్మ ఎంతో మంది హీరోయిన్స్‌తో వర్క్ చేశాడు. ఆయన సినిమాలతో ఫేమస్ అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు.

By:  Tupaki Desk   |   22 Jan 2025 11:30 AM GMT
వర్మతో గొడవపై క్లారిటీ ఇచ్చింది
X

బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటించి అక్కడ ఇక్కడ స్టార్‌ డం దక్కించుకున్న ముద్దుగుమ్మ ఊర్మిళ మటోండ్కర్‌. అయిదు పదుల వయసులోనూ చాలా అందంగా కనిపిస్తూ ఆకట్టుకునే ఊర్మిళకు ఈ స్థాయి గుర్తింపు స్టార్‌డం దక్కడంలో కీలక పాత్ర పోషించిన దర్శకుల్లో రామ్‌ గోపాల్ వర్మ ఒకరు అనడంలో సందేహం లేదు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ ఊర్మిళతో రామ్‌ గోపాల్‌ వర్మ సినిమాలు తీసి ఆమె అందాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. రంగీలా సినిమాతో బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌ల జాబితాలో ఊర్మిళ నిలిచింది. అయితే కొన్ని కారణాల వల్ల గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటుంది.

రామ్‌ గోపాల్‌ వర్మ ఎంతో మంది హీరోయిన్స్‌తో వర్క్ చేశాడు. ఆయన సినిమాలతో ఫేమస్ అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వారందరితోనూ వర్మకు సన్నిహిత సంబంధాలు ఇప్పటికీ ఉన్నాయి కానీ ఊర్మిళతో మాత్రం గొడవలు ఉన్నాయి, ఇద్దరి మధ్య మాటలు లేవు అంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. రామ్‌ గోపాల్‌ వర్మ వంటి బోల్డ్‌ పర్సన్‌తో ఊర్మిళకు వచ్చిన గొడవ ఏంటి, ఏ కారణాల వల్ల ఇద్దరు మాట్లాడుకోవడం లేదు అనే విషయమై గత కొంత కాలంగా చర్చ జరుగుతోంది. ఆ విషయమై తాజాగా రంగీలా హీరోయిన్‌ ఊర్మిళ క్లారిటీ ఇచ్చింది. మీడియాలో వస్తున్న పుకార్లన్నింటికి సమాధానం చెప్పి, పుకార్లకు చెక్‌ పెట్టింది.

రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో రూపొంది సెన్షేషనల్‌ హిట్‌ సాధించిన సత్య సినిమా రీ రిలీజ్ కాబోతుంది. ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఊర్మిళ మీడియాతో తన అనుభవాలను పంచుకుంది. అదే సమయంలో రామ్‌ గోపాల్‌ వర్మతో ఉన్న విభేదాల గురించి క్లారిటీ ఇచ్చింది. ఊర్మిళ మాట్లాడుతూ... రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తాను అంతం, గాయం, రంగీలా, సత్య సినిమాల్లో నటించాను. ఆయన దర్శకత్వంలో అన్ని సినిమాలు చేసే అవకాశం రావడం తనకు దక్కిన అదృష్టం, గౌరవంగా భావిస్తాను. మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు తమ ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు అంటూ క్లారిటీ ఇచ్చింది.

వర్మ అంటే తనకు గౌరవం ఉందని, ఆయనతో సందర్భానుసారంగా కలవడం, మాట్లాడటం చేస్తూనే ఉన్నాను. కనుక మీడియాలో వస్తున్న పుకార్లు ఇప్పటికి అయినా ఆపేయాలని ఆమె కోరింది. తమ మధ్య విభేదాలు అంటూ కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న కథనాలను నమ్మవద్దు అంటూ ఊర్మిళ విజ్ఞప్తి చేసింది. ఊర్మిళ స్పందనపై రామ్‌ గోపాల్‌ వర్మ ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి. ఒకప్పుడు వర్మ చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేసి సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ అయ్యే విధంగా పోస్ట్‌లు పెట్టే వాడు. కానీ ఇప్పుడు ఆయన తీరు కాస్త మారినట్లు అనిపిస్తుంది. కనుక ఊర్మిళ స్పందనపై ఆయన ఎలాంటి కామెంట్స్ చేయక పోవచ్చు అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సత్య రీ రిలీజ్ తర్వాత తన నుంచి మంచి సినిమాలు వస్తాయని వర్మ అన్నాడు. అది ఎంతవరకు నిజమో చూడాలి.