Begin typing your search above and press return to search.

ఆమె వ్యాఖ్యలను ఖండించిన ప్రగ్యా జైస్వాల్‌

ఇంకా ప్రగ్యా జైస్వాల్‌ ఈ విషయమై మాట్లాడుతూ... పెద్ద సినిమాల్లో నటించినప్పుడు, పెద్ద నటీనటులతో నటించినప్పుడు పెద్ద విజయాలు సొంతం చేసుకున్నప్పుడు మాట్లాడే మాటల్లో గౌరవం ఉండాలి.

By:  Tupaki Desk   |   3 Feb 2025 5:32 AM GMT
ఆమె వ్యాఖ్యలను ఖండించిన ప్రగ్యా జైస్వాల్‌
X

బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు, గౌరవం దక్కించుకున్న ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా. ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్యలో ఐటెం సాంగ్‌ చేయడం ద్వారా పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ అమ్మడు ఇటీవల డాకు మహారాజ్‌ సినిమాలో దబిడిదిబిడి ఐటెం సాంగ్‌ చేయడం ద్వారా మరింతగా టాలీవుడ్‌లో పాపులారిటీని సొంతం చేసుకుంది. ముందు ముందు మరిన్ని ఐటెం సాంగ్స్‌లో ఈ అమ్మడు నటించే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు ఈ అమ్మడు బాలీవుడ్లోనూ బిజీగా ఉంది. ఆకట్టుకునే అందంతో పాటు, డాన్స్‌లతో మెప్పించే ఊర్వశి రౌతేలా తాజాగా చేసిన వ్యాఖ్యలతో వివాదాస్పదం అయింది.

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగిన సమయంలో తన ఉంగరాలు చూపిస్తూ ఊర్వశి రౌతేలా చేసిన వ్యాఖ్యలను ఏ ఒక్కరూ సమర్థించడం లేదు. ఆమె తీరును ప్రతి ఒక్కరూ విమర్శించారు. ఆమె తనపై వస్తున్న నెగిటివిటీకి వెంటనే స్పందించింది. తాను చేసిన వ్యాఖ్యలు తప్పు అని ఆమె అర్థం చేసుకుంది. అందుకే వెంటనే క్షమాపణలు సైతం చెప్పింది. తన ఉద్దేశ్యం ఎవరిని విమర్శించాలని కాదని ఆమె క్లారిటీ ఇచ్చింది. అయినా ఆమె చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆమె సహ నటి ప్రగ్యా జైస్వాల్‌ సైతం ఒక ఇంటర్వ్యూలో ఆ వ్యాఖ్యలను ఖండించింది. అలా మాట్లాడి ఉండకూడదని ప్రగ్యా చెప్పుకొచ్చింది.

ఇంకా ప్రగ్యా జైస్వాల్‌ ఈ విషయమై మాట్లాడుతూ... పెద్ద సినిమాల్లో నటించినప్పుడు, పెద్ద నటీనటులతో నటించినప్పుడు పెద్ద విజయాలు సొంతం చేసుకున్నప్పుడు మాట్లాడే మాటల్లో గౌరవం ఉండాలి. చాలా బాధ్యతాయుతంగా మాట్లాడాలి. ముఖ్యంగా సున్నితమైన విషయాల గురించి మాట్లాడేప్పుడు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. కనుక ఊర్వశి రౌతేలా మాట్లాడిన మాటలు సరికాదని ఈ సందర్భంగా ప్రగ్యా జైస్వాల్‌ చెప్పుకొచ్చింది. సెలబ్రెటీలు మాట్లాడే మాటల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రగ్యా పేర్కొంది. ఊర్వశి రౌతేలా వ్యాఖ్యలను ప్రగ్యా జైస్వాల్‌ డైరెక్ట్‌గానే ఖండించడం ద్వారా చర్చనీయాంశం అయ్యింది.

బాలకృష్ణ హీరోగా నటించి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన డాకు మహారాజ్‌ సినిమాతో వీరిద్దరూ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ క్రేజ్‌తో ముందు ముందు వారిద్దరూ మంచి సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సినిమాలో వీరిద్దరి కాంబోలో సన్నివేశాలు లేవు. అయినా ఒకే సినిమాలో నటించిన కారణంగా ప్రగ్యా జైస్వాల్‌ ఆ వివాదంపై స్పందించినట్లుగా తెలుస్తోంది. ప్రగ్యా జైస్వాల్‌ పై ఊర్వశి రౌతేలా ఏమైనా కౌంటర్‌ ఇస్తుందా లేదంటే ఆమె మాటలను గౌరవిస్తున్నాను అంటూ హుందాగా ప్రవర్తిస్తుందా అనేది చూడాలి.