మానవత్వం మిగిలే ఉంది.. చిరంజీవిపై ఊర్వశి పోస్ట్ వైరల్
తన తల్లి మీను రౌతేలాకు వైద్య అత్యవసర పరిస్థితిలో చిరును సహాయం కోరగా ఆయన వెంటనే ఆస్పత్రి వర్గాలతో మాట్లాడి సహాయపడ్డారు.
By: Tupaki Desk | 13 Feb 2025 3:55 PM GMTమెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐబ్యాంక్ సేవలే కాదు. పరిశ్రమలో కష్టంలోనో ఆపదలోనో ఉన్నవారిని ఆదుకుని చాలామందికి దేవుడు అయ్యారు. కరోనా క్రైసిస్ కష్టకాలంలో ఆయన సేవలను తెలుగు ప్రజలు మర్చిపోలేరు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాను కష్టంలో ఆదుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఊర్వశి ఇంతకుముందు చిరుతో `వాల్తేరు వీరయ్య` చిత్రంలో ప్రత్యేక గీతంలో నర్తించింది. కానీ ఇప్పుడు కష్టంలో చిరును సహాయం అర్థించింది. తన తల్లి మీను రౌతేలాకు వైద్య అత్యవసర పరిస్థితిలో చిరును సహాయం కోరగా ఆయన వెంటనే ఆస్పత్రి వర్గాలతో మాట్లాడి సహాయపడ్డారు. వివరాల్లోకి వెళితే...
ఇటీవల ఊర్వశి తల్లి మీను రౌతేలా ఎడమ కాలిలో ఇంట్రా ఆర్టిక్యులర్ ఫ్రాక్చర్‌తో ఆసుపత్రి పాలయ్యారు. ఇది చాలా ప్రమాదకరమని వైద్యులు చెప్పినప్పుడు ఊర్వశి చాలా కంగారు పడ్డారు. అయితే వెంటనే చిరంజీవిని సంప్రదించి సహాయం కోరింది. మెగాస్టార్ వెంటనే కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రిలోని వైద్యుల బృందంతో మాట్లాడి సరైన చికిత్సకు సహకరించాల్సిందిగా కోరారు. వైద్యులు శస్త్రచికిత్స చేసిన తర్వాత, మీను రౌతేలా కోలుకున్నారు. తన తల్లికి విజయవంతమైన శస్త్ర చికిత్స జరగడానికి చిరు సహాయం కారణమని ఊర్వశి అన్నారు. తన కుటుంబం జీవితాంతం చిరంజీవికి కృతజ్ఞతతో ఉంటుందని ఎమోషనల్ అయ్యారు.
గతంలో చిరంజీవి సేవా కార్యకలాపాల గురించి నేను చాలా విన్నాను. వాల్తేరు వీరయ్య షూటింగ్ సమయంలో ఆయనను చాలా గమనించాను. అవసరంలో ఉన్నవారికి చిరు చాలా సహాయం చేసారు. ఆ సహాయం ఇప్పుడు నాకు కూడా చేరింది. నా తల్లి ఎడమ కాలికి పెద్ద సమస్య ఉంది. చికిత్సకు సంబంధించి నాకు ఎక్కడా సరైన సమాధానం దొరకలేదు. అప్పుడు చిరును సాయం కోరగా, ఆయన ఎంతో ధైర్యం చెప్పి ఒక సంరక్షకుడిలా, నా తల్లి సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు. వెంటనే కోల్‌కతాలోని అపోలో సిబ్బందితో మాట్లాడి నా తల్లికి సరైన చికిత్స అందేలా చూసారు అని జరిగిన విషయాలను వివరించింది.
అమ్మ చికిత్స తర్వాత కోలుకుంది. మా కుటుంబానికి ప్రాణాధారం ఇచ్చిన నిజమైన హీరోలా కనిపించారు చిరు. కష్ట సమయాల్లో ఆయన చూపిన ప్రేమ, మద్దతును నేను మాటల్లో చెప్పలేను. భూమిపై మానవత్వం ఇంకా ఉందని ఆయన నిరూపించారు. ఇంత బిజీ షెడ్యూల్‌లో కూడా ఆయన మాకు అండగా నిలిచారు. ఇకపైనా ఏదైనా అడగడానికి సిగ్గుపడవద్దని ఆయన మాకు చెప్పారు. ఆయన మాకు సంరక్షకుడిలా కనిపించారు.. అని ఎమోషనల్ అయ్యారు ఊర్వశి. `వాల్తేరు వీరయ్య` చిత్రంలో ``వేర్ ఈజ్ ది పార్టీ బాసు..`` పాటలో ఊర్వశి .. చిరంజీవితో కలిసి స్టెప్పులు వేసింది.