Begin typing your search above and press return to search.

ఒలింపిక్స్‌లో గౌర‌వం: AR రెహమాన్ సంగీతం రేంజ్ అదీ

ఇటీవ‌లే త‌న సినిమా 'గుణ' నుంచి ట్యూన్ కాపీ కొట్టార‌ని మంజుమ్మ‌ల్ బోయ్స్ నిర్మాత‌ల‌పై కోర్టుకు వెళ్లి మ‌రీ కేసు గెలిచారు ఇళ‌య‌రాజా.

By:  Tupaki Desk   |   6 Aug 2024 7:50 AM GMT
ఒలింపిక్స్‌లో గౌర‌వం: AR రెహమాన్ సంగీతం రేంజ్ అదీ
X

చాలా మంది సంగీత ద‌ర్శ‌కులు కాపీ క్యాట్ ట్యూన్ల‌తో విసిగిస్తున్నారు. కొంద‌రు సంగీత ద‌ర్శ‌కులు అయితే త‌మ ట్యూన్ల‌ను తామే కాపీ కొట్టి, తిప్పి తిప్పి మ‌ళ్లీ అవే వినిపించి సంగీత ప్రియుల‌కు విర‌క్తి పుట్టిస్తున్నారు. సృజ‌నాత్మ‌క‌త స్థానంలో కాపీ క్యాట్ వ్య‌వ‌హారాలు ఎక్కువైపోయాయి. ఇటీవ‌లే త‌న సినిమా 'గుణ' నుంచి ట్యూన్ కాపీ కొట్టార‌ని మంజుమ్మ‌ల్ బోయ్స్ నిర్మాత‌ల‌పై కోర్టుకు వెళ్లి మ‌రీ కేసు గెలిచారు ఇళ‌య‌రాజా.

అదంతా అటుంచితే ఒక భార‌తీయ సంగీత ద‌ర్శ‌కుడి బాణీని ప్ర‌తిష్ఠాత్మ‌క ఒలింపిక్స్ లో ఉప‌యోగించుకోవ‌డం నిజంగా ఆ సంగీత ద‌ర్శ‌కుడికి ద‌క్కిన గొప్ప‌ గౌర‌వంగా చెప్పుకోవాలి. ఇది అరుదైన ఫీట్. ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది మంది లైవ్ లో వీక్షించే ఒలింపిక్స్ లాంటి గొప్ప వేదిక‌పై అత‌డి ట్యూన్ ని ఉప‌యోగించుకుని స్మిమ్మింగ్ టీమ్ చేసిన విన్యాసాలు ప్ర‌జ‌ల హృద‌యాల‌ను గెలుచుకున్నాయి. అంత గొప్ప ఆద‌ర‌ణ గౌర‌వం అందుకున్న‌ది ఎవ‌రో కాదు.. అది లెజెండ్ ఏ.ఆర్.రెహ‌మాన్ ట్యూన్.

ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన తాళ్ సినిమా నుంచి 'తాళ్‌ సే తాల్ మిలా...'కి యూఎస్ స్విమ్మింగ్ టీమ్ చేస్తున్న విన్యాసాల‌ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై ఫిలింమేక‌ర్ సుభాష్ ఘాయ్ స్పందించిన తీరు ఆక‌ట్టుకుంది. అమెరికాకు చెందిన మహిళల కళాత్మక స్విమ్మింగ్ బృందం వరల్డ్ ఆక్వాటిక్స్ దోహా -2024లో నీటి అడుగున కొరియోగ్రఫీ విన్యాసాలు చేసింది. దీనికోసం పాపుల‌ర్ తాళ్‌ సే తాల్ మెలా పాట‌ను నేప‌థ్యంలో ఉప‌యోగించారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఆస్కార్-విజేత స్వరకర్త-గాయకుడు AR రెహమాన్ స్వరపరిచిన 1999 చిత్రం 'తాళ్‌' నేపథ్య సంగీతం ఉపయోగించబడటంతో బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌ సుభాష్ ఘయ్ దీనిపై స్పందించారు. తాళ్‌ సే తాల్ మిలా పాట వినిపిస్తుండ‌గా.. USA మహిళల కళాత్మక స్విమ్మింగ్ బృందం ప్రదర్శన వీడియో మైమ‌రిపించింది. ఈ ప్రదర్శన స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ సుభాష్ ఘై తన X (గతంలో ట్విట్టర్)లో తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

తాళ్‌ వంటి హిందీ సినిమా 'నేపథ్య సంగీతం' ఐకానిక్‌గా మారినప్పుడు ఇది రేర్ ఫీట్ (చప్పట్లు కొట్టే ఎమోజి)... అంటూ ఆయ‌న ఆనందం వ్య‌క్తం చేసారు. ''ఇది వరల్డ్ ఆక్వాటిక్స్ దోహా 2024లో కనిపించింది. USA ఆర్టిస్టిక్ స్విమ్మింగ్ టీమ్‌ని TAAL సంగీతంలో వారి అద్వితీయ ప్ర‌తిభ‌ను ప్రదర్శించడానికి ప్రేరేపించింది. నాకు ఆశీర్వాదాలు ద‌క్కాయి. అందరికీ ధన్యవాదాలు'' (హృదయం , కౌగిలింత ఎమోజి) అని అన్నారు. ఎక్స్‌లోని వీడియోపై అభిమానులు కూడా ప్రతిస్పందించారు. ఒక అభిమాని వ్యాఖ్యానిస్తూ ''తాళ్‌ సే తాల్ ..'' ఏదైనా సాంస్కృతిక కార్యక్రమానికి క‌చ్చితంగా సరిపోతుంది. AR రెహ‌మాన్ నిజంగా భారతీయ సంగీతానికి ముఖం వంటి వారు'' అని మరొక నెటిజ‌న్ వ్యాఖ్యానించారు. ఇది భారతీయులందరికీ గర్వకారణం..క‌చ్చితంగా ఇండియన్ మ్యూజిక్ రాక్స్.. అని ఒక X వినియోగదారు రాశారు.

'తాళ్‌ సే తాల్ మిలా'ను AR రెహమాన్ స్వరపరిచారు. ఆనంద్ బక్షి రచించారు. ఈ పాటను అల్కా యాగ్నిక్ - ఉదిత్ నారాయణ్ పాడారు. ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ దీనికి అభిన‌యించారు. శూన్యం నుంచి ధ్వ‌నుల‌ను విని సంగీతం సృజించే రెహ‌మాన్ ప్ర‌తి సినిమాలో ప్ర‌తి పాట కోసం వైవిధ్య‌మైన ట్యూన్ల‌ను అందించారు. దానికోసం ఎంత‌గానో శ్ర‌మిస్తారు. ధ్యాన‌ముద్ర‌లోకి వెళ‌తారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా చెప్పారు. అందుకే ఆయ‌న మ్యూజిక్ ఎప్ప‌టికీ ఫ్రెష్‌నెస్ తో అంద‌రి హృద‌యాల‌ను గెలుచుకుంటూనే ఉంటుంది.