Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ కు పవన్ కల్యాణ్ ఎదురెళ్తారా?

గుంటూరు కారం వర్సెస్ ఉస్తాద్ భగత సింగ్ నిన్నటి నుంచి సోషల్ మీడియా అంతా దీని గురించే చర్చలు

By:  Tupaki Desk   |   3 Aug 2023 6:52 AM GMT
త్రివిక్రమ్ కు పవన్ కల్యాణ్ ఎదురెళ్తారా?
X

'గుంటూరు కారం' వర్సెస్ 'ఉస్తాద్ భగత సింగ్' నిన్నటి నుంచి సోషల్ మీడియా అంతా దీని గురించే చర్చలు. సూపర్ స్టార్ మహేశ్ బాబు - పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకేసారి వచ్చే ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నారని చెబుతున్నారు. దీంతో ఈ ఇద్దరిలో ఎవరు విన్నర్ గా నిలుస్తారో అన్న ఆసక్తి ఇప్పటి నుంచే సినీ ప్రియుల్లో విపరీతంగా నెలకొంది.

వాస్తవానికి సంక్రాంతికి మహేశ్ 'గుంటూరు కారం' మాత్రమే వస్తుందని అంతా అనుకున్నారు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం పవన్ పొలిటికల్ బిజీ షెడ్యూల్ కారణంగా 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రీకరణ ఆగిపోయింది. చిత్రాన్ని ఎన్నికల తర్వాతకు పోస్ట్ పోన్ చేశారు. కానీ ఇప్పుడది యూటర్న్ తీసుకుందని తెలిసింది.

దర్శకుడు హరీశ్ శంకర్ - పవన్ కల్యాణ్ తో చర్చలు జరిపి సినిమాను ఎలాగైనా ఈ ఏడాది పూర్తి చేసి సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారని తెలిసింది. దీంతో అభిమానుల మదిలో ఉత్సాహంతో పలు ప్రశ్నలు మెదులుతున్నాయి.

అదేంటంటే.. 'ఉస్తాద్'ను సంక్రాంతికి రిలీజ్ చేయాలంటే.. షూటింగ్ ను ఐదు నెలల్లోనే పూర్తి చేయాల్సి వస్తుంది. అసలు ఇది సాధ్యమవుతుందా? అన్నది అభిమానుల మదిలో మెదలుతున్న మొదటి ప్రశ్న. ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. ఉస్తాద్ భగత్ సింగ్.. మహేశ్ 'గుంటూరు కారం'కు గట్టి పోటినిస్తుంది. దీంతో ఇప్పుడు 'మహేశ్ వర్సెస్ పవన్'తో పాటు 'త్రివిక్రమ్ వర్సెస్ పవన్' అంటూ మాట్లాడుకోవడం ప్రారంభించారు.

నిజానికి పవన్ - త్రివిక్రమ్ కు మధ్య మంచి అనుబంధం ఉంది. ఇద్దరు మంచి మిత్రులు. ఇప్పటికే మాటల మాంత్రికుడు.. పవన్ నటించిన చాలా సినిమాలకు పని చేశారు. ఎప్పుడూ ఆయనతోనే ఉంటూ ఆయనకు సంబంధించిన ప్రతీ విషయాన్ని వెనక నుంచి నడిపిస్తారనే టాక్ కూడా బలంగా ఉంది. మరి అలాంటి త్రివిక్రమ్ సినిమాకే.. పవన్ పోటీ వస్తారా? అనేది ఫ్యాన్స్ మదిలో మెదులుతున్న రెండో ప్రశ్న. ప్రస్తుతం ఇదే విషయం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.

ఇకపోతే సంక్రాంతి బరిలో 'గుంటూరు కారం'తో పాటు రవితేజ 'ఈగల్', ప్రశాంత్ వర్మ 'హనుమాన్' ఉన్నారు. ఎంత కాదనుకున్నా సినీ ప్రియుల మొదటి ప్రాధాన్యత 'గుంటూరు కారం'కే ఉండొచ్చు. ఫలితంగా మంచి వసూళ్లు వస్తాయి. ఒకవేళ సినిమా కాస్త తేడా కొట్టినా పెట్టుబడి పైసలైనా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ 'ఉస్తాద్' ఎంట్రీ అయితే గుంటూరు కారం గ్రాఫ్ లెక్కల్లో మార్పులు వస్తాయి. కాబట్టి ప్రస్తుతం త్రివిక్రమ్ ను దృష్టిలో పెట్టుకుని పవన్ 'ఉస్తాద్'తో వస్తారా లేదా అనేది చూడాలి.