Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్ బ్యూటీ దూకుడు మామూలుగా లేదే!

ఇండస్ట్రీలో వైష్ణవి చైతన్యకు వ్యతిరేకంగా ఒక వర్గం నిర్మాతలు ఉన్నారనే టాక్‌ ఉంది. అయినా కూడా మీడియం రేంజ్ సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   1 April 2025 3:30 PM
హైద‌రాబాద్ బ్యూటీ దూకుడు మామూలుగా లేదే!
X

సోషల్‌ మీడియా ద్వారా వచ్చిన గుర్తింపుతో రవితేజ హీరోగా నటించిన 'టచ్ చేసి చూడు' సినిమాలో చిన్న పాత్రలో నటించడం ద్వారా వెండితెరకు పరిచయం అయిన ముద్దుగుమ్మ వైష్ణవి చైతన్య. తెలుగు అమ్మాయిలు క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా చేసుకోవాల్సిందే అని, హీరోయిన్‌గా సక్సెస్‌లు దక్కించుకోవడం అంత సులభమైన పని కాదని అంతా అంటున్న సమయంలో అనూహ్యంగా 'బేబీ' సినిమాతో సూపర్‌ హిట్ దక్కించుకుని స్టార్‌ హీరోల దృష్టిని సైతం ఆకర్షించింది. బేబీ సినిమా విజయంతో యంగ్ క్రేజీ స్టార్‌ సిద్దు జొన్నలగడ్డకు జోడీగా జాక్ సినిమాలో నటించే అవకాశం దక్కింది. జాక్ విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే కచ్చితంగా టాలీవుడ్‌లో వైష్ణవి బిజీ బిజీగా సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇండస్ట్రీలో వైష్ణవి చైతన్యకు వ్యతిరేకంగా ఒక వర్గం నిర్మాతలు ఉన్నారనే టాక్‌ ఉంది. అయినా కూడా మీడియం రేంజ్ సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి. గత ఏడాది దిల్‌ రాజు ఫ్యామిలీ హీరో ఆశిష్ రెడ్డి నటించిన 'లవ్‌ మి' సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమాలో నటనతో మెప్పించింది. కానీ కమర్షియల్‌గా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేక పోయింది. అయినా కూడా టాలీవుడ్‌లో రెండు మూడు క్రేజీ సినిమాల్లో నటిస్తున్న ఈమెకు తాజాగా కోలీవుడ్‌ నుంచి పిలుపు వచ్చిందని సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఈ విషయమై సినీ వర్గాల్లో, తెలుగు మీడియా సర్కిల్స్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

కోలీవుడ్‌ హీరోయిన్స్‌ టాలీవుడ్‌లో నటించడం మనం చూస్తూ ఉంటాం. తెలుగులో ఎంతో మంది తమిళ హీరోయిన్స్‌ తెలుగు స్టార్‌ హీరోలకు జోడీగా నటించారు. కానీ తెలుగు హీరోయిన్స్‌ అతి కొద్ది మంది మాత్రమే కోలీవుడ్‌లో నటించారు. ఇప్పుడు తెలుగు అమ్మాయి తమిళ్ స్టార్‌ హీరోకు జోడీగా నటించే అవకాశం దక్కించుకుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కోలీవుడ్‌ స్టార్‌ హీరో విశాల్‌ నటించబోతున్న సినిమాలో హీరోయిన్‌ పాత్ర కోసం వైష్ణవి చైతన్యను సంప్రదించారు. ఆమె ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిందనే వార్తలు సైతం వస్తున్నాయి. ఈమధ్య కాలంలో తెలుగు అమ్మాయిలు ఇతర భాషలో పెద్ద హీరోకు జోడీగా నటించడం చాలా అరుదుగా చూస్తూ ఉన్నాం.

కొందరు తెలుగు మూలాలు ఉన్న హీరోయిన్స్ నటించారు, కానీ తెలుగు అమ్మాయి, యూట్యూబ్‌ ద్వారా గుర్తింపు సొంతం చేసుకున్న అమ్మాయి ఇలా కోలీవుడ్‌ స్టార్‌ హీరో విశాల్‌ కి జోడీగా నటించడం చర్చనీయాంశంగా మారింది. వైష్ణవి ఎంతో మంది తెలుగు అమ్మాయిలకు ఆదర్శం అనడంలో సందేహం లేదు. హీరోయిన్‌గా మంచి ఫామ్‌ లో ఉన్న వైష్ణవి కోలీవుడ్‌లో వచ్చిన విశాల్‌ సినిమా ఆఫర్‌ను సద్వినియోగం చేసుకుని, ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుని, ఆ సినిమాలో ఈమె నటనకు మంచి మార్కులు దక్కితే మరిన్ని తమిళ సినిమాల్లో నటించే అవకాశాలు దక్కవచ్చు అంటూ సినీ విశ్లేషకులు, మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.