బేబీ ఆ బ్యాడ్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసేనా?
ఏప్రిల్ 10న విడుదల కాబోతున్న 'జాక్' సినిమా ఫలితంపై వైష్ణవి చైతన్య చాలా నమ్మకంగా ఉంది.
By: Tupaki Desk | 4 April 2025 9:30 AMయూట్యూబ్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయిన వైష్ణవి చైతన్య 2018లో మొదటి సారి రవితేజ హీరోగా నటించిన టచ్ చేసి చూడు సినిమాలో చిన్న పాత్రలో నటించి వెండి తెరపై కనిపించింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. అయితే సోలో హీరోయిన్‌గా 2023లో అవకాశం దక్కించుకుంది. 'బేబీ' సినిమాతో హీరోయిన్‌గా వైష్ణవి చైతన్యకు మంచి గుర్తింపు దక్కింది. అందంతో పాటు నటనతోనూ మంచి మార్కులు దక్కించుకుంది. దాంతో బేబీ సినిమా తర్వాత ఇబ్బడి ముబ్బడిగా ఆఫర్లు వచ్చాయి. కానీ వైష్ణవి ఆచితూచి ఎంపిక చేసుకుంది. బేబీ తర్వాత దిల్ రాజు బ్యానర్‌లో 'లవ్ మీ' సినిమాలో నటించింది.
గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'లవ్ మీ' సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. పైగా ఆ సినిమాలోని వైష్ణవి చైతన్య పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత దక్కలేదు. దాంతో వైష్ణవి చైతన్యను ఇంకా 'బేబీ' హీరోయిన్‌గానే ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాల వారు గుర్తిస్తున్నారు. ఆమె గురించి మాట్లాడుకోవాలి అన్నా బేబీ సినిమా గురించి ప్రస్తావించి మాట్లాడుకునే పరిస్థితి. లవ్ మీ సినిమా తర్వాత సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందుతున్న 'జాక్' సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెల్సిందే. జాక్ విడుదలకు సిద్ధం అయింది.
ఏప్రిల్ 10న విడుదల కాబోతున్న 'జాక్' సినిమా ఫలితంపై వైష్ణవి చైతన్య చాలా నమ్మకంగా ఉంది. అందుకే కొత్త సినిమాలకు సైన్ చేయడానికి జాక్ సినిమా ఫలితం తర్వాత అంటూ వాయిదా వేస్తుందట. జాక్ ఫలితంతో టాలీవుడ్‌లో స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు వస్తాయని వైష్ణవి చైతన్య ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు అమ్మాయిలు అతి తక్కువ మంది టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్స్‌గా ఉన్నారు. కొందరు తెలుగు మూలాలు ఉన్న వారు, బయట పుట్టి పెరిగిన వారికి టాలీవుడ్‌లో స్టార్స్ సరసన నటించే అవకాశాలు దక్కాయి. కానీ తెలుగు అమ్మాయి అని పక్కాగా ముద్ర ఉన్న వారికి అవకాశాలు దక్కినట్లు ఈ మధ్య కాలంలో భూతద్దం పెట్టి వెతికినా లభించే పరిస్థితి లేదు.
జాక్ సినిమా హిట్ అయితే ఇతర తెలుగు అమ్మాయిల మాదిరిగా కాకుండా తనకు కచ్చితంగా ఇండస్ట్రీలో మంచి ఆఫర్లు వస్తాయని వైష్ణవి చైతన్య ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు అమ్మాయిలకు తెలుగు స్టార్ హీరోలతో తెలుగు సినిమాల్లో నటించే అవకాశాలు రావు అని ఉన్న సెంటిమెంట్‌ను ఈ తెలుగు అమ్మాయి బ్రేక్ చేస్తుందా అనేది చూడాలి. వైష్ణవి చైతన్యకు స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు వచ్చినా రాకున్నా సిద్దు తరహా యంగ్ హీరోలు, టైర్ 2 హీరోలకు జోడీగా నటించే అవకాశాలు చాలానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల కూడా ఒక యంగ్ హీరో సినిమాలో ఈమెను ఎంపిక చేసేందుకు గాను చర్చలు జరిగాయనే వార్తలు వచ్చాయి. ఆ విషయమై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.