Begin typing your search above and press return to search.

కొత్త కథలకే ఓటు.. ఆదికేశవ్ కొత్త ఎక్స్ పీరియన్స్..!

శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాలో జోజు జార్జ్, అపర్ణ దాస్ ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. ఈ నెల 24న రిలీజ్ అవుతున్న ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు.

By:  Tupaki Desk   |   21 Nov 2023 12:31 PM GMT
కొత్త కథలకే ఓటు.. ఆదికేశవ్ కొత్త ఎక్స్ పీరియన్స్..!
X

మెగా మేనల్లుడు వైష్ణవ్ ఏజ్ లీడ్ రోల్ లో శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా ఆదికేశవ. వైష్ణవ్ తేజ్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటించగా ఈ సినిమాకు జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాలో జోజు జార్జ్, అపర్ణ దాస్ ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. ఈ నెల 24న రిలీజ్ అవుతున్న ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు.


ఆదికేశవ ప్రయాణం ఎలా మొదలైంది అనే ప్రశ్నకు సమాధానంగా రంగ రంగ వైభవంగా చివరి దశలో ఉన్నప్పుడే నిర్మాత నాగ వంశీ ఈ కథ చెప్పారు. కథ వినగానే ఎంతగానో నచ్చింది. ఎన్నో మెరుగులు దిద్దుకుని సినిమా అద్భుతంగా వచ్చిందని అన్నారు వైష్ణవ్ తేజ్.

మాస్ ఇమేజ్ కోసమే సినిమా చేశారా అని అడిగితే.. అలాంటి ఉద్దేశం లేదు. కథ నచ్చే చేశాను. నిజాయితీగా కష్టపడి పనిచేయడమే తనకు తెలుసు.. ఫలితం గురించి పెద్దగా ఆలోచించలేదని అన్నారు. నా మొదటి సినిమా ఉప్పెన కూడా అలానే చేశానని అన్నారు. కథ నచ్చితేనే సినిమా చేస్తాను. ఎవరైనా అడిగినా సరే నేను హీరోని కాదు నటుడిని అని చెబుతానని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా నాతో నటుడిగా అనిపించుకుంటేనే విభిన్న పాత్రలు చేసే అవకాశం ఉంటుందని చెప్పారని వైష్ణవ్ తేజ్ అన్నారు.

ఆదికేశవలో నచ్చిన అంశం ఏంటని అడిగితే.. పూర్తిస్థాయి మాస్ సినిమా అయినా కథలో కొత్తదనం ఉంటుంది. కథ విన్నప్పుడే ఇలాంటి పాయింట్ ఎవరు టచ్ చేయలేదు అనిపించింది. కామెడీ, సాంగ్స్, విజువల్స్, ఫైట్స్ అన్నీ బాగుంటాయని అన్నారు. ఆడియన్స్ సినిమా చూసి థియేటర్ల నుంచి ఆనందంగా వస్తారని అన్నారు.

యాక్షన్ సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయనే ప్రశ్న రాగా.. యాక్షన్ సన్నివేశాలు కథలో భాగంగానే ఉంటాయి. వాటిని సాధ్యమైనంత మేర సహజంగానే చిత్రీకరించామని అన్నారు. ఫైట్స్ ఎక్కడా ఓవర్ ది బోర్డ్ ఉండవు. కొడితే పది మంది గాలిలో ఎగరడం అలాంటివి ఉండవు. నా వయసుకి తగ్గట్టుగానే ఫైట్లు ఉంటాయని అన్నారు.

శ్రీలీల గారితో డ్యాన్స్ చేయడం ఎలా అనిపించిందని అడగ్గా.. నేను డ్యాన్సర్ ని కాదు. నేను మాస్టర్ కి ఒకటే చెప్పాను. మీరు ఓకే అనేవరకు నేను ఎంతైనా కష్టపడి చేస్తానని అన్నారు. 100 శాతం కష్టపడి పని చేయడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను. మొదటి రెండు టేకులకే ఎలా చేయాలి.. ఎంత ఎనర్జీ పెట్టాలో అర్థమైపోయింది. మాస్టర్.. శ్రీలీల సపోర్ట్ తో పూర్తి న్యాయం చేయగలిగానని అన్నారు.

ఆదికేశవలో దైవత్వం ఉంటుందా అని అడిగితే.. పదిశాతం అలా శివుడి గురించి ఉంటుంది. అది కథలో భాగమే అన్నారు. దర్శకుడు శ్రీకాంత్ గురించి చెబుతూ.. కథ చెప్పినప్పుడు నాకు ఎంత బాగుంది అనిపించిందో.. దానిని అంతే అద్భుతంగా ఆయన తెరకెక్కించారని వైష్ణవ్ తేజ్ చెప్పారు.

జోజు జార్జ్ గారితో కలిసి పని చేయడం ఎలా ఉంది అని అడిగితే.. జోజు జార్జ్ గారు స్వీట్ పర్సన్. ఆయనతో సెట్స్ లో ఉన్నప్పుడు విజయ్ సేతుపతి గారిని చూసినట్లే అనిపించేది. ఆయన భోజన ప్రియుడు. ఫలానా చోట ఫుడ్ బాగుంటుంది అంట కదా అని అడిగేవారు. అంత పెద్ద యాక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ అయినప్పటికే డౌన్ టు ఎర్త్ ఉంటారని చెప్పారు.

శ్రీలీలతో మీ సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయి అనే ప్రశ్నకు సమాధానంగా.. నాకు, శ్రీలీల మధ్య వచ్చే సన్నివేశాలు క్యూట్ గా ఉంటాయి. సంభాషణలు సహజంగా సరదాగా సాగుతాయి. షూటింగ్ టైంలో ఆ సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు ఎంతో ఎంజాయ్ చేస్తూ చేశాం. పాత్రలోని అమాయకత్వం.. తింగరితనంతో దర్శకుడు శ్రీకాంత్ హాస్యం రాబట్టారు. స్క్రీన్ మీద చాలా ముద్దుగా అనిపిస్తాయి అని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ గారితో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన మెలోడీ అయినా.. మాస్ బీట్ అయినా ఏదైనా ఇవ్వగలరు. నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా ఇస్తారు. చాలా స్వీట్ పర్సన్ అని అన్నారు వైష్ణవ్ తేజ్.

సీనియర్ యాక్టర్ రాధిక గురించి చెబుతూ.. అంత సీనియర్ ఆర్టిస్ట్ సెట్స్ లో ఎలా ఉంటారో అనుకున్నాను. కానీ ఆమె అందరితో బాగా కలిసిపోయి సరదాగా మాట్లాడతారు. ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటారని అన్నారు. ఆమెతో కలిసి పనిచేయడం సంతోషంగా అనిపించిందని అన్నారు వైష్ణవ్ తేజ్.

ఉప్పెనకి, అల్లు అర్జున్ కి జాతీయ అవార్డులు రావడం ఎలా అనిపించిందని అడిగితే.. బన్నీకి అవార్డ్ రావడం గర్వంగా అనిపించింది. ఉప్పెన విషయంలో చాలా సంతోషం కలిగింది. అందరి కష్టానికి తగిన ఫలితం వచ్చింది అనిపించిందని అన్నారు.

కథల ఎంపిక విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనే ప్రశ్నకు సమాధానంగా.. ఖచ్చితంగా కథలో కొత్తదనం ఉండాలి. అలాగే పాత్రలో కొంచెం కమర్షియాలిటీ ఉండేలా చూసుకుంటాను. ఈ తరానికి నచ్చేలా ఉండాలని అని చెప్పారు వైష్ణవ్ తేజ్.