'ఆమె విడాకులతో రెహమాన్ కు ఎలాంటి సంబంధం లేదు'
దీనికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో, దీనిపై సైరా బాను తరపు న్యాయవాది వందనా షా స్పందించారు.
By: Tupaki Desk | 21 Nov 2024 5:55 AM GMTస్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ - సైరా బాను దంపతులు విడిపోయిన సంగతి తెలిసిందే. విడాకుల విషయాన్ని మంగళవారం అధికారికంగా ప్రకటించారు. అయితే అదే రోజున రెహమాన్ టీంలోని మోహిని డే అనే అసిస్టెంట్ కూడా తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు. గురు శిష్యురాలు ఒకే రోజు తమ డివోర్స్ గురించి ప్రకటనలు చేయడంతో, వారి సంబంధం గురించి సోషల్ మీడియాలో అనేక పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి. వీటిపై తాజాగా సైరా తరపు లాయర్ స్పందించారు.
ఏఆర్ రెహమాన్, మోహిని డే ఇద్దరూ కొన్ని గంటల వ్యవధిలోనే తమ భాగస్వాములతో విడిపోతున్నట్లు ప్రకటించడం సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఇది యాదృచ్చికంగా జరిగిందా? లేదా ఈ రెండు జంటల విడాకులకు ఏమైనా సంబంధం ఉందా? అంటూ డిస్కషన్ మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో, దీనిపై సైరా బాను తరపు న్యాయవాది వందనా షా స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.
‘‘మోహిని డే విడాకులతో ఏఆర్ రెహమాన్ డివోర్స్ కి ఎలాంటి సంబంధం లేదు. సైరా- రెహమాన్ పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. వివాహ బంధానికి స్వస్తి పలకడం ఎంతో బాధతో కూడుకున్న విషయం. డివోర్స్ తీసుకుంటున్నామని ఎవరూ సంతోషపడరు. ఇది సెలబ్రేట్ చేసుకునే విషయం కాదు. ప్రస్తుతం వారిద్దరూ బాధలో ఉన్నారు. వైవాహిక బంధంలో సైరా వ్యక్తిగతంగా ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. వారిద్దరూ విడిపోవడానికి కారణాలు ఉన్నాయి. వాటిని చెప్పే స్వేచ్ఛ నాకు లేదు. కలిసి ఉన్నా, విడిగా ఉన్నా వారిద్దరూ ఉన్నతమైన జీవితాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు’’ అని వందనా షా మీడియాకి తెలిపారు.
ఏఆర్ రెహమాన్, సైరా బాను 1995లో పెళ్లి చేసుకొని వివాహ బంధంలో అడుగుపెట్టారు. వారికి ఖతీజా, రహీనూ, అమీన్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే సడన్ గా తమ 29 ఏళ్ల బంధాన్ని బ్రేక్ చేసుకుంటున్నట్లు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఒకరిపై మరొకరికి గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ, వాళ్లిద్దరి మధ్య ఏర్పడిన ఇబ్బందులు.. పెద్ద అంతరాన్ని సృష్టించాయని, అందుకే విడిపోయాలనే కఠిన నిర్ణయం తీసుకున్నారని లాయర్ వందనా షా వెల్లడించారు. ఇక రెహమాన్ పిల్లలు కూడా తమ తల్లిదండ్రుల విడాకులపై స్పందించారు. ఈ క్లిష్ట సమయంలో తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని సోషల్ మీడియా వేదికగా కోరారు.
సైరాతో విడాకులపై ఏఆర్ రెహమన్ ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ''మేము త్వరలోనే 30 ఏళ్ల వైవాహిక బంధానికి చేరుకుంటామని ఆశించాం. కానీ అనుకోని విధంగా ముగింపు పలకాల్సి వచ్చింది. విరిగిన హృదయాల బరువుకు దేవుని సింహాసనం కూడా వణుకుతుంది. ఈ విరిగిన ముక్కలు మళ్లీ వాటి స్థానాన్ని కనుగొనలేవు. మేము ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకొని ముందుకు సాగుతున్నందున, స్నేహితులు మా వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం'' అని రెహ్మాన్ పేర్కొన్నారు. దీనికి #arrsairaabreakup అనే హ్యాష్ ట్యాగ్ ను జోడించడం ఆయనపై ట్రోలింగ్ కు అవకాశం కల్పించింది. డివోర్స్ తీసుకుంటున్నందుకు అతనికి బాధ లేదని, హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నారని నెటిజన్లు కామెంట్లు చేసారు.