Begin typing your search above and press return to search.

పంద్రాగస్టుకు మనకు మూడు వందే భారత్ స్లీపర్లు

నిజానికి సార్వత్రిక ఎన్నికలకు కాస్త ముందుగా ఈ స్లీపర్ ట్రైన్లను అందుబాటులోకి తీసుకురావాలని భావించారు. కానీ.. సాధ్యం కాలేదు.

By:  Tupaki Desk   |   3 July 2024 4:56 AM GMT
పంద్రాగస్టుకు మనకు మూడు వందే భారత్ స్లీపర్లు
X

వందే భారత్ సిరీస్ లో భాగంగా ఇప్పటికే ఏసీ ఛైర్ కార్ ట్రైన్లు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. గడిచిన కొంతకాలంగా ఊరిస్తున్న వందే భారత్ స్లీపర్ ట్రైన్లు మరో నెలలో పట్టాలు ఎక్కనున్నాయి. దీనికి సంబంధించిన తుది కసరత్తు ఇప్పుడు జరుగుతోంది. నిజానికి సార్వత్రిక ఎన్నికలకు కాస్త ముందుగా ఈ స్లీపర్ ట్రైన్లను అందుబాటులోకి తీసుకురావాలని భావించారు. కానీ.. సాధ్యం కాలేదు.

పంద్రాగస్టు వేళ కొత్తగా తీసుకొచ్చే వందే భారత్ స్లీపర్ ట్రైన్లలో మూడింటిని తెలుగు రాష్ట్రాల్లో పరుగులు తీసేలా ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే కాచిగూడ - బెంగళూరు, సికింద్రాబాద్ - విశాఖ - సికింద్రాబాద్, సికింద్రాబాద్ - తిరుపతి - సికింద్రాబాద్ ఛైర్ కార్ ట్రైన్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒక్క కాచిగూడ - బెంగళూరు - కాచిగూడ ట్రైన్ మాత్రమే ఎనిమిది బోగీలతో నడుస్తుంటే.. మిగిలిన రెండు రైళ్లు మాత్రం పదహారు బోగీలతో నడుస్తోంది.

కొత్తగా తీసుకురానున్న స్లీపర్ వందే భారత్ విషయానికి వస్తే.. ఈ మూడు రైళ్లలో రెండు రైళ్లు పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో పరుగులు తీస్తుండగా.. మరొకటి మాత్రం మహారాష్ట్రలోనూ పరుగులు తీయనుంది. అత్యంత రద్దీ రూట్లుగా చెప్పే కాచిగూడ - తిరుపతి, కాచిగూడ - విశాఖపట్నం, సికింద్రాబాద్ - ఫుణే రూట్లలో తిప్పాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ కొత్త స్లీపర్ వందే భారత్ స్లీపర్లను పదహారు బోగీలతో నడపనున్నారు.

వందే భారత్ ఛైర్ కార్ల మాదిరి కాకుండా.. ఈ స్లీపర్ క్లాస్ ట్రైన్ ను ఏసీ.. నాన్ ఏసీ కోచ్ లతో నడపనున్నారు. దీంతో.. వందే భారత్ ఛైర్ కార్ ట్రైన్ల మాదిరి ఖరీదుతో కాకుండా.. సామాన్యులు సైతం ప్రయాణించేందుకు వీలుగా టికెట్ ధరలు ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక.. ట్రైన్ టైమింగ్స్.. టికెట్ల రేట్లు.. ఏయే స్టాపుల్లో ట్రైన్ ఆగుతుందన్న వివరాలు మాత్రం వెల్లడి కావాల్సి ఉంది. ఏమైనా.. మొదటి వరుసలో మూడు రైళ్లు తెలుగు రాష్ట్రాలకు దక్కటం సంతోషించాల్సిన అంశంగా చెప్పక తప్పదు.