నిశ్చితార్థంతో షాకిచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్
అయితే వరలక్ష్మి ఆకస్మిక నిశ్చితార్థం నిస్సందేహంగా అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఎంగేజ్‌మెంట్ స్నాప్‌లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
By: Tupaki Desk | 2 March 2024 8:10 PM GMTప్రముఖ నటుడు శరత్ కుమార్ కుమార్తె, టాలీవుడ్ లేడీ విలన్ వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి బంధంతో తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. ఈ భామ రహస్య నిశ్చితార్థానికి సంబంధించిన వార్తలు మీడియాలో వైరల్ గా మారాయి. తన చిరకాల స్నేహితుడు, గ్యాలరిస్ట్ నికోలాయ్‌తో మార్చి 1న ముంబైలో నిశ్చితార్థం జరిగింది. సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయిన ఈ ఎంగేజ్‌మెంట్ ఫోటోలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
ముంబైలో జరిగిన నిశ్చితార్థ వేడుకకు సన్నిహిత కుటుంబ సభ్యులు, సెలెక్టెడ్ గా కొద్దిమంది స్నేహితులు బంధువులు మాత్రమే హాజరయ్యారు. వరలక్ష్మి భాగస్వామి ఎంపిక ఆసక్తిని కలిగిస్తోంది. అతడు ముంబైకి చెందిన గ్యాలరిస్ట్ .. సినీపరిశ్రమ వ్యక్తి కాకపోవడం ఆశ్చర్యకరం. వరుడి గురించిన వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడి కానప్పటికీ వరలక్ష్మి అతడికి సన్నిహితురాలని తెలుస్తోంది.
నికోలాయ్‌తో 14 సంవత్సరాలుగా మంచి అనుబంధం కొనసాగించింది వరూ.. స్కూల్ డేస్ నుంచి ఈ ఇరువురి బంధం కాల పరీక్షకు ఎదురీతగా నిలిచిందని తెలుస్తోంది. ఈ జంట వివాహం కన్ఫామ్ అయిన సందర్భంగా వరలక్ష్మి సన్నిహితులు, పరిశ్రమ సహచరుల నుండి అభినందన సందేశాలు వెల్లువెత్తాయి.
అయితే వరలక్ష్మి ఆకస్మిక నిశ్చితార్థం నిస్సందేహంగా అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఎంగేజ్‌మెంట్ స్నాప్‌లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అయినా అన్ని వర్గాల నుండి అభినందన సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఆసక్తికరంగా వరలక్ష్మి ఇటీవలే తన పెళ్లి గురించి వచ్చిన పుకార్లన్నింటినీ కొట్టిపారేసింది. తన కెరీర్‌పై దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు పేర్కొంది. కానీ ఇంతలోనే నిశ్చితార్థంతో ఆశ్చర్యపరిచింది.
ప్రముఖ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా వినోద రంగంలో వరలక్ష్మి ప్రయాణం మొదలైంది. తమిళ చిత్రసీమలో కథానాయికగా ప్రారంభించి, క్యారెక్టర్ రోల్స్‌లోకి మారిన వరూ క్రమంగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. ముఖ్యంగా ప్రతినాయక పాత్రల్లో రాణిస్తోంది. విలన్ పాత్రల్లో వరూ నటనకు విస్తృతమైన ప్రశంసలు లభించాయి. ముఖ్యంగా తెలుగు సినిమా `హనుమాన్`లో తన నటనకు అపారమైన ప్రజాదరణను పొందింది. కెరీర్‌లో ఎదుగుతున్న ఈ కీలక దశలో వరలక్ష్మి ఈ ముఖ్యమైన అడుగు వేయడానికి తీసుకున్న నిర్ణయం సముచితంగా కనిపిస్తోందని అభిమానులు భావిస్తున్నారు.