భర్తతో మెగా కోడలు లావణ్య పతంగుల పండగ
ఇదిలా ఉంటే ఈసారి వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి జంట హైదరాబాద్ లో తమ స్వగృహంలో సంక్రాంతి వేడుకలను జరుపుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
By: Tupaki Desk | 15 Jan 2025 4:25 AM GMTప్రతియేటా మెగా కుటుంబం సంక్రాంతి సంబరాలను బెంగళూరు ఫామ్ హౌస్ లో జరుపుకోవడం ఆచారం. దీనికోసం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళతారు. ఈసారి మెగాస్టార్ చిరంజీవి దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ కలయికకు రాజకీయ ప్రాధాన్యత ఉందని కథనాలొచ్చాయి. ఇదిలా ఉంటే ఈసారి వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి జంట హైదరాబాద్ లో తమ స్వగృహంలో సంక్రాంతి వేడుకలను జరుపుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పతంగులు ఎగురవేస్తూ ఎంతో ఆనందంగా కనిపించిన ఈ జంట అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
రాబోవు రోజుల్లో రంగురంగుల పతంగుల్లా ప్రకాశవంతంగా మీ జీవితాలు వెలగాలని ఈ జంట ప్రజలకు విషెస్ తెలిపారు. వరుణ్ పతంగులను ఎగురవేస్తుంటే, లావణ్య దారం వదులుతూ ఉత్సాహంగా కనిపిస్తోంది. ఆ ఇద్దరూ ట్రెడిషనల్ దుస్తులలో అందంగా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది.
సంక్రాంతి పండగ అంటేనే కుటుంబం, స్నేహితులతో జరుపుకునే అందమైన పండుగ. బాగా పిండి వంటలు ఆరగిస్తూ ఆనందంగా గడిపే సమయమిదని వరుణ్ తేజ్ తాజా ఇంటర్వ్యూలో అన్నారు. వరుణ్ మాట్లాడుతూ..``ప్రతి సంవత్సరం మా పెద్ద కుటుంబం చిరంజీవి గారితో ఇంట్లో కలుసుకుంటాం. లేదా బెంగళూరులోని మా ఫామ్‌హౌస్‌లో వేడుకలు జరుపుకోవడానికి హైదరాబాద్ నుండి బయలుదేరుతాం. మేమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే పండగ ఇది. ప్రియమైనవారితో సమయం గడపడం, రుచికరమైన ఆహారాన్ని షేర్ చేసుకోవడం..సరదాగా మాట్లాడుకోవడం... పిల్లలతో గాలిపటాలు ఎగురవేయడం.. ఇవన్నీ మా వ్యాపకాలు`` అని తెలిపారు. ఈ వేడుక ఒక్క రోజులో ముగియదు. ఇది మూడు రోజుల పండుగ. ఫ్యామిలీలో అందరం కలిసి ఈ అందమైన సందర్భాన్ని వేడుకగా జరుపుకుంటామని వరుణ్ తేజ్ తెలిపాడు.
సంక్రాంతి అంటే పెద్ద హీరోల సినిమాలు విడుదలకు అనుకూల సమయమని కూడా వరుణ్ అన్నారు. హిందీ పరిశ్రమలో దీపావళి ఎలానో టాలీవుడ్ కి సంక్రాంతి అలాంటిది! అని వ్యాఖ్యానించారు. సంక్రాంతి అనేది సినిమా ప్రేమికులకు ఒక పెద్ద సీజన్.. ప్రతి సంవత్సరం చాలా పెద్ద సినిమాలు విడుదలవుతాయి. దక్షిణాదిలో ముఖ్యంగా ఆంధ్ర - తెలంగాణలో, ఈ పండుగ వేళ థియేటర్లలో సినిమాలు వీక్షిస్తూ ఆనందంగా జరుపుకుంటారు. ఇది నాకు ఇష్టమైన పండుగ అని వరుణ్ తేజ్ అన్నారు.