మెగా హీరో కొత్త మూవీ మరింత ఆలస్యం కానుందా?
ఇలా బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాప్స్ పడటంతో వరుణ్ తేజ్ స్క్రిప్ట్ సెలక్షన్, దర్శకుల ఎంపికపై విమర్శలు వస్తున్నాయి.
By: Tupaki Desk | 30 Nov 2024 4:30 AM GMTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ మధ్య కాలంలో వరుస పరాజయాలు ఎదుర్కొంటున్నారు. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాలని చాలా కష్టపడుతున్నాడు కానీ, కష్టానికి తగ్గ ఫలితం మాత్రం దక్కడం లేదు. యాక్షన్ సినిమాలు చేసినా, పీరియాడికల్ డ్రామాల్లోకి నటించినా.. ఏవీ వర్కవుట్ అవ్వడం లేదు. రిజల్ట్ సంగతి పక్కన పెడితే, మెగా హీరో సినిమాలు మినిమం ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోవడం ఆందోళన కలిగించే విషయం.
వరుణ్ తేజ్ నటించి "మట్కా" చిత్రం ఆడియన్స్ ను ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది. కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా పీరియడ్ డ్రామా.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. పెద్ద మొత్తంలో ఖర్చు చేసిన నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. అంతకుముందు వరుణ్ సోలో హీరోగా నటించిన 'గాండీవధారి అర్జున', 'గని', 'ఆపరేషన్ వాలెంటైన్' చిత్రాలు కూడా ఘోర పరాజయాలను చవి చూసిన సంగతి తెలిసిందే.
ఇలా బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాప్స్ పడటంతో వరుణ్ తేజ్ స్క్రిప్ట్ సెలక్షన్, దర్శకుల ఎంపికపై విమర్శలు వస్తున్నాయి. డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నా ఆడియెన్స్ రిజెక్ట్ చేస్తుండటంతో.. వరుణ్ సైతం తన తదుపరి ప్రాజెక్ట్స్ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యహరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నెక్స్ట్ మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి కాస్త టైం తీసుకోనున్నాడని, కొన్నాళ్ళు బ్రేక్ తీసుకునే ఆలోచన చేస్తున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి.
వరుణ్ తేజ్ ఇప్పటికే యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యారు. ఇది రాయలసీమ బ్యాక్ డ్రాప్ హారర్ కామెడీ మూవీ. ఇందులో హీరో పాత్రలో కాస్త నెగిటివ్ షేడ్స్ ఉంటాయని టాక్. 'మట్కా' రిలీజైన వెంటనే గాంధీ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్తారని అందరూ భావించారు. అయితే ఇప్పుడు వరుణ్ నిర్ణయంతో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకాస్త టైమ్ పట్టొచ్చని వార్తలు వస్తున్నాయి.
ఇక 'టచ్ చేసి చూడు' ఫేమ్ విక్రమ్ సిరికొండ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వరుణ్ తేజ్. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ లో ఈ ప్రాజెక్ట్ రూపొందాల్సి ఉంది. కాకపోతే ప్రస్తుతానికి మెగా హీరో తన తదుపరి ప్రాజెక్ట్స్ కోసం కాస్త విరామం తీసుకోవాలని అనుకుంటున్నారట. స్క్రిప్టు సెలక్షన్ విషయంలో పునఃపరిశీలన చేస్తున్నారట. ఈ గ్యాప్ లో మరికొన్ని కొత్త స్క్రిప్ట్‌లు కూడా వింటున్నాడని అంటున్నారు.
ఏదేమైనా వరుణ్ తేజ్ తన క్రెడిబిలిటీని తిరిగి పొందడానికి కచ్ఛితంగా మినిమమ్ గ్యారెంటీ మూవీతో రావాల్సిన అవసరం ఉంది. మట్కా మూవీకి కనీస ఓపెనింగ్స్ కూడా రాలేదంటే, హార్డ్‌కోర్ మెగా ఫ్యాన్స్ కూడా థియేటర్లలో ఈ సినిమా చూడలేదని అనుకోవచ్చు. కాబట్టి మళ్ళీ మెగా ప్రిన్స్ తిరిగి పుంజుకోవడానికి, ఇండస్ట్రీలో తన స్థానాన్ని తిరిగి పొందడానికి ఈసారి తప్పకుండా హిట్ కొట్టాల్సి ఉంటుంది. మరి దీని కోసం వరుణ్ ఎలాంటి అప్రోచ్ తో ముందుకు వెళ్తాడో చూడాలి.