Begin typing your search above and press return to search.

మట్కా' వరుణ్.. బన్నీకి నిజంగా కౌంటర్ ఇచ్చాడా?

ఆ సమయంలో ఆయన చేసి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

By:  Tupaki Desk   |   11 Nov 2024 8:45 AM GMT
మట్కా వరుణ్.. బన్నీకి నిజంగా కౌంటర్ ఇచ్చాడా?
X

మెగా హీరో వరుణ్ తేజ్.. ప్రస్తుతం మట్కా మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ సినిమాను విభిన్నమైన చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో పీరయాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న మట్కాలో మీనాక్షీ చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. నవంబర్ 14వ తేదీన రిలీజ్ కానుందీ సినిమా.

ఇటీవల వరుసగా ఫ్లాప్‌ లను చవిచూసిన వరుణ్ తేజ్.. మట్కాతో భారీ హిట్ కొట్టాలని చూస్తున్నారు. తన కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందుతున్న మట్కాతో కమ్ బ్యాక్ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నారు. ప్రమోషన్స్ లో దూకుడుగా పాల్గొంటున్నారు. అందులో భాగంగా ఆదివారం రాత్రి విశాఖపట్నంలో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన చేసి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సినిమాలు సరిగ్గా ఆడనప్పుడు చాలా బాధేస్తుందని, మూడు రోజుల కిందట మట్కా గురించి ఆలోచిస్తూ లావణ్యతో మాట్లాడి పడుకున్నానని తెలిపారు వరుణ్. ఆ మరునాడు ఉదయమే అన్నయ్య రామ్‌ చరణ్‌ ఫోన్‌ చేశాడని చెప్పారు. ఆయన పది మాటలు చెప్పాల్సిన అవసరం లేదని, పక్కన ఉండి భుజం మీద చేయి వేస్తే అదే నాకు రూ.100 కోట్లని అన్నారు. తనకూ ఎప్పుడూ అండగా రామ్ చరణ్ అన్నయ్య ఉన్నారని తెలిపారు.

అయితే ఫ్యామిలీ గురించి ఎప్పుడూ మాట్లాడతాడేమిటని చాలా మంది అనుకోవచ్చని, కానీ లైఫ్ లో మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన వెనకాల ఎవరున్నారన్నది మరిచిపోతే ఆ సక్సెస్ దేనికీ పనికి రాదని వ్యాఖ్యానించారు. మా పెదనాన్న, బాబాయ్, నాన్న నా వెనుక ఉన్నారని చెప్పారు. తాను ఎక్కడున్నా తనకంటే ఎక్కువగా చూసుకుంటూ లావణ్య సహకారం అందిస్తోందని తెలిపారు. ఈ సారి గట్టి హిట్ కొడతానని ధీమా వ్యక్తం చేశారు.

ఇక వరుణ్ తేజ్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారగా.. ఆయన చెప్పిన మాటలు నిజమేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అల్లు అర్జున్ కు కౌంటర్ ఇచ్చారని కొందరు అంటున్నారు. అయితే ఏపీ ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవి ఇంటికి వెళ్లి బన్నీ విష్ చేసిన తర్వాత నుంచి మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య గ్యాప్ పెరిగిందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నాక.. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీతో కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారని అనేక మంది ఆరోపిస్తున్నారు. ఇప్పుడు వరుణ్ ఆ విషయంలోనే బన్నీకి కౌంటర్ ఇచ్చారని చెబుతున్నారు. మరికొందరు అదేం కాదని అంటున్నారు. మరి వరుణ్ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటనేది తెలియాలి అంటే ఆయనే క్లారిటీ ఇవ్వాలి. ఇక పుష్ప 2 ప్రమోషన్ హడావుడిలో మెగా బాండింగ్ గురించి బన్నీ మరోసారి క్లారిటీ ఇస్తారేమో చూడాలి.