మట్కా: వరుణ్ తేజ్ కు మరో బాక్సాఫీస్ షాక్
కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు కేవలం రూ. 70 లక్షల వసూళ్లను మాత్రమే సాధించగలిగింది.
By: Tupaki Desk | 15 Nov 2024 6:00 AM GMTవరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ మట్కా గురువారం గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. గతకొంత కాలంగా వరుసగా బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ చూస్తున్న వరుణ్ తేజ్ ఈసారి ఎలాగైనా మంచి కంటెంట్ తో మెప్పించాలి అని టాలెంటెడ్ డైరెక్టర్ కరుణకుమార్ దర్శకత్వంలో మట్కా సినిమాను తెరపైకి తీసుకు వచ్చాడు. గ్యాంబ్లర్ రతన్ ఖేత్రీ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో, 1958 నుండి 1982 మధ్య విశాఖపట్నం నేపథ్యంను హైలెట్ చేశారు.
మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ పీరియాడిక్ డ్రామా విడుదలకు ముందు కొంత హైప్ క్రియేట్ చేసింది. అయితే బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఊహించని షాక్ ఎదురైంది. మొదటి రోజు ప్రేక్షకులపై ప్రభావం చూపడంలో విఫలమైంది. కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు కేవలం రూ. 70 లక్షల వసూళ్లను మాత్రమే సాధించగలిగింది.
వరుణ్ తేజ్ కెరీర్‌లో ఇదే అతనికి అతి తక్కువ ఓపెనింగ్స్ అందించిన సినిమాగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో గురువారం ఈ చిత్రానికి 15.71% మాత్రమే థియేటర్ ఆక్యుపెన్సీ నమోదవ్వగా, అత్యధికంగా విశాఖపట్నంలో 27.75% ఆక్యుపెన్సీ నమోదైంది. ఇది వరుణ్ తేజ్ గత చిత్రం ఆపరేషన్ వాలెంటైన్ తో పోలిస్తే చాలా తక్కువ వసూళ్లను రాబట్టింది. ఆ చిత్రం నెగటివ్ రివ్యూలను ఎదుర్కొన్నప్పటికీ, రూ. 1.45 కోట్ల ప్రారంభ వసూళ్లను సాధించింది.
ఇక మట్కా చిత్రంలో 24 ఏళ్ల వాసు జీవిత ప్రయాణాన్ని చూపిస్తూ, అతను గ్యాంబ్లర్‌గా, గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగిన క్రమాన్ని ఆకర్షణీయంగా చిత్రీకరించారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్‌కు జోడీగా మీనాక్షి చౌదరి నటించగా, నోరా ఫతేహీ తన తెలుగు తెర అరంగేట్రం చేసింది. ఇక మొదటి రోజు ఈ సినిమా ప్రేక్షకుల నుంచి అనుకున్న స్పందనను రాబట్టలేకపోవడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది, వచ్చే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద మరింత స్ట్రాంగ్ నెంబర్లు అందుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ సినిమా కోసం దాదాపు 45 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు నిర్మాత క్లారిటీ ఇచ్చారు. అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా సినిమా రైట్స్ అమ్మేసుకోవడంతో ఆయన సేఫ్ అయ్యారు. ఇక వరుణ్ తేజ్ కూడా సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాడు. కానీ కంటెంట్ పూర్తి స్థాయిలో ఆడియెన్స్ కు కనెక్ట్ కాలేకపోయింది.
వరుణ్ తేజ్ ఇంతకుముందు చేసిన గని - గాండీవదారి అర్జున్ - ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. ఫుల్ రన్ లో ఆ సినిమాలు కనీసం 10 కోట్లు కూడా దాటలేదు. థియేట్రికల్ గా సగానికి పైగా నష్టాలు కలిగించినట్లు టాక్. ఇక మట్కా పరిస్థితి కూడా క్లిష్టంగానే ఉంది. మరి ఈ సినిమా వీకెండ్స్ లో ఏమైనా పుంజుకుంటుందో లేదో చూడాలి.