మట్కా.. వరుణ్ తేజ్ మామూలోడు కాదండోయ్!
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి కష్టపడుతున్నాడు హీరో వరుణ్ తేజ్.
By: Tupaki Desk | 9 Nov 2024 8:23 AM GMTమెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి కష్టపడుతున్నాడు హీరో వరుణ్ తేజ్. వైవిధ్యమైన స్కిప్ట్స్ తో ఆడియన్స్ ను అలరించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే సోలోగా సరైన హిట్టు కొట్టి చాలా కాలమే అయింది. గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఈసారి కచ్ఛితంగా హిట్టు కొట్టాలనే కసితో "మట్కా" మూవీతో వస్తున్నారు.
'పలాస' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం "మట్కా". వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో 1958-82 మధ్య కాలంలో జరిగిన నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న పీరియడ్ డ్రామా ఇది. మట్కా గ్యాంబ్లర్, గ్యాంగ్‌స్టర్ వాసు పాత్రలో వరుణ్ తేజ్ నటిస్తున్నారు. వాసు జీవితంలోని 24 ఏళ్ల ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇందులో పాత్రకు అనుగుణంగా నాలుగు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నారు. దీనికి తగ్గట్టుగా నాలుగు విధాలుగా వరుణ్ డబ్బింగ్ చెప్పడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
'మట్కా' సినిమాలో తన పాత్రకు డబ్బింగ్ ను వరుణ్ తేజ్ కంప్లీట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో గ్లింప్స్ ను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసారు. వరుణ్ తన క్యారక్టర్ లోని నాలుగు ఏజ్ గ్రూప్ లకు నాలుగు రకాల మాడ్యులేషన్ లో డబ్బింగ్ చెప్పినట్లు తెలుస్తోంది. కుర్రాడి నుంచి వయసు మీద పడిన వ్యక్తి వరకూ.. వాయిస్ లో నాలుగు రకాల వేరియేషన్స్ చూపించడం గురించే ఇండస్ట్రీలో అందరూ మాట్లాడుకుంటున్నారు. వరుణ్ తేజ్ డెడికేషన్, హార్డ్ వర్క్ ను మెచ్చుకుంటున్నారు. అతని కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందని భావిస్తున్నారు.
'మట్కా' చిత్రం నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, ఫస్ట్ గ్లింప్స్, టీజర్, సాంగ్స్, ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ మధ్య వదిలిన ట్రైలర్ అంచనాలు రెట్టింపు చేసింది. విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. టీమ్ అంతా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. రేపు (నవంబర్ 10) సాయంత్రం విశాఖపట్నంలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
వరుణ్ తేజ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీ ఇది. ఇందులో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సలోని, నవీన్ చంద్ర, రవి శంకర్, సత్యం రాజేష్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం సమకూర్చారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నవంబరు 14న పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళం కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.