వరుణ్ హారర్ సినిమా చూస్తే కోలా ఫ్రీ
అయితే ఇటీవల ప్రముఖ కోలా బ్రాండ్ తో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా ఒప్పందం విమర్శలకు తావిస్తోంది.
By: Tupaki Desk | 19 Jan 2025 10:49 AM GMTకోలాలు విషపూరితమని చాలా పరిశోధనలు స్పష్ఠం చేసాయి. బాధ్యతాయుతమైన హీరోలు కోలాలకు ప్రచారం కల్పిస్తే, వారి అభిమానులు కూడా ఈ విషం భారిన పడి అనారోగ్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చాలా విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి విమర్శల నడుమ చాలామంది పేరున్న హీరోలు కోలాలు, కూల్‌డ్రింక్‌ల ప్రచారానికి దూరంగా ఉన్నారు. రజనీకాంత్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్లు ఇలాంటి ఆఫర్లను తిరస్కరించారని గతంలో కథనాలొచ్చాయి.
అయితే ఇటీవల ప్రముఖ కోలా బ్రాండ్ తో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా ఒప్పందం విమర్శలకు తావిస్తోంది. కోలాల్ని నిల్వ చేసేందుకు పెస్టిసైడ్ (పురుగుమందు) మోతాదును గరిష్ఠంగా ఉపయోగిస్తున్న ఈ కూల్ డ్రింక్స్ కి ప్రచారం కల్పించే ఆలోచన సరికాదని పలువురు సూచిస్తున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి థమ్సప్ కి ప్రచారం చేయగా, రామ్ చరణ్ పెప్సీ, ఫ్రూటీ వంటి వాటికి ప్రచారం కల్పించారు. కానీ ఇలాంటి బ్రాండ్లకు వారు దూరంగా ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చాలా కాలంగా ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించి కోలాల ప్రచారానికి దూరమయ్యారు. మళ్లీ ఇప్పుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కోలా కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగాలని ఆలోచించడం ఆశ్చర్యపరుస్తోంది. బాబాయ్ పవన్ కల్యాణ్ స్ఫూర్తితో నిషేధిత కోలాలకు ప్రచారం చేయడం మానుకోవాలని ఈ సందర్భంగా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
సినిమాలతోనే సాధించాలి:
వరుణ్ తేజ్ మెగా కుటుంబంలోనే విలక్షణమైన హీరో. అతడి ఎంపికలు ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంటాయి. వైవిధ్యమైన కథాంశాలు, స్క్రిప్టులను ఎంపిక చేసుకుని డేరింగ్ గా ముందుకు సాగే అతడి గట్స్ కి ఫ్యాన్సున్నారు. అయితే ఇటీవల ఎందుకనో అతడికి ఆశించిన విజయాలు దక్కడం లేదు. `మట్కా` సినిమాతో లేటెస్ట్ గా ఫ్లాప్ ఎదుర్కొన్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పుడు ఇండో కొరియన్ హర్రర్ కామెడీ గ్రాండ్ రీమేక్ కోసం సిద్ధమవుతున్నాడని సమాచారం. తాత్కాలికంగా VT 15 అనే టైటిల్ ని ఎంపిక చేయగా, ఈ సినిమా కామెడీ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రక్తి కట్టించనుందని తెలుస్తోంది.
వరుణ్ తేజ్ పుట్టినరోజును పురస్కరించుకుని మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించారు. ఈ పోస్టర్‌లో డ్రాగన్ డిజైన్, మంటల్లో కాలిపోతున్న వస్త్రంతో కూడిన మార్మిక కూజా కనిపించింది. `వేట హిలేరియస్‌గా మారినప్పుడు` అనే ట్యాగ్ లైన్ ఆకట్టుకుంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా , ఏక్ మినీ కథ వంటి విజయవంతమైన చిత్రాలతో ఆకట్టుకున్న మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తుండగా, ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి థమన్.ఎస్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ వివరాలు, విడుదల తేదీ త్వరలో వెల్లడించనున్నారు.