'మట్కా' ఫస్ట్ లుక్: గ్యాంగ్‌స్టర్ కళ్లలో కసి!
తాజాగా నిర్మాతలు వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు. పోస్టర్‌లో రెట్రో స్టైల్ గ్యాంగ్ స్టర్ గా వరుణ్ తేజ్ లుక్ ఎంతో నేచురల్ గా ఆకట్టుకుంటోంది.
By: Tupaki Desk | 11 Aug 2024 9:40 AM GMTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తొలి పాన్-ఇండియన్ చిత్రం 'మట్కా' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై సంచలనం సృష్టిస్తోంది. పలాస ఫేం కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ - SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. డా. విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మాతలు. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. మీనాక్షి చౌదరి కథానాయిక కాగా, నోరా ఫతేహి ప్రత్యేక పాత్రలో నటించింది. ప్రస్తుతం ఈ మెగా ప్రాజెక్ట్ చిత్రీకరణ దశలో ఉంది.
తాజాగా నిర్మాతలు వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు. పోస్టర్‌లో రెట్రో స్టైల్ గ్యాంగ్ స్టర్ గా వరుణ్ తేజ్ లుక్ ఎంతో నేచురల్ గా ఆకట్టుకుంటోంది. చేతిలో సిగార్ .. ముడివేసిన భృకుటితో అతడి ఇంటెన్స్ లుక్ నిజంగా అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్. ముఖ్యంగా ఎరుపు రంగు టైతో ముదురు పిన్‌స్ట్రైప్డ్ సూట్‌లో అతని క్లాసిక్ లుక్ హృదయాల్లోకి దూసుకెళుతోంది.
స్లిక్ బ్యాక్ హెయిర్ స్టైల్.. కోర మీసాలు, తలకు రింగు, ఒంటిపై బంగారు ఆభరణాలు, బ్రౌన్ కళ్లద్దాలు.. ఇవన్నీ వరుణ్ లోని గ్యాంబ్లర్ కి అదనపు హంగుగా కనిపిస్తున్నాయి. అతడి చురుకైన చూపులు.. డ్యాషింగ్ ఎక్స్ ప్రెషన్స్ ఈ పోస్టర్ లో హైలైట్ గా కనిపిస్తున్నాయి. లెదర్ కుర్చీలో రిలాక్స్‌డ్ గా కూచోవడంలోనే కాదు ప్రత్యర్థులకు దడ పుట్టించడంలోను అతడు ప్రత్యేకమైన వ్యక్తి అని అర్థమవుతోంది.
అయితే స్పేడ్ సింబల్ ...ఆ పేకాట సెటప్ చూస్తుంటే సంఘంలోని చాలా అరాచకాలతో సదరు గ్యాంగ్ స్టర్ డీల్ చేస్తుంటాడని మీనింగ్. గ్యాంగ్ స్టర్స్ అంటేనే నేరప్రపంచం. ఇందులో జూదం కూడా ఒక భాగం. అయితే ఈ ప్రపంచంలో గెలిచినవాడికే ఎక్కువ గౌరవం. ఓటమి ఇక్కడ చావుతో సమానం. అందువల్ల గెలుపే ధ్యేయంగా దూసుకెళ్లే గ్యాంగ్ స్టర్ గా వరుణ్ తేజ్ కళ్లలో కసి, చురుకుదనం కనిపిస్తోంది.
1958 -1982 మధ్య కాలంలో సాగే గ్యాంగ్ స్టర్ స్టోరి ఇది. ఈ చిత్రం వైజాగ్ నేపథ్యంల్లో తెరకెక్కింది. అక్కడి వాతావరణాన్ని ఆ కాలం నుండి చక్కగా రూపొందించిన సెట్‌లతో పునఃసృష్టించారని సమాచారం. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేస్తున్న వరుణ్ తేజ్ ఈ సినిమాపై భారీ హోప్స్ పెట్టుకున్నాడు. దీనిని పాన్ ఇండియా కేటగిరీలో బహుభాషల్లో విడుదల చేయనున్నారు. నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవిశంకర్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.