Begin typing your search above and press return to search.

వరుణ్ ఆపరేషన్ వాలెంటైన్.. ఎప్పుడూ లేనంత కష్టం..

మెగా హీరో వరుణ్ తేజ్.. మరో వారం రోజుల్లో ఆపరేషన్ వాలెంటైన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   22 Feb 2024 9:54 AM GMT
వరుణ్ ఆపరేషన్ వాలెంటైన్.. ఎప్పుడూ లేనంత కష్టం..
X

మెగా హీరో వరుణ్ తేజ్.. మరో వారం రోజుల్లో ఆపరేషన్ వాలెంటైన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. సాధారణంగా వరుణ్.. తన సినిమా ప్రమోషన్లలో పాల్గొనడం అనేది ఒక లెవెల్ వరకు ఉంటుంది.. కానీ ఈ సారి మాత్రం వరుణ్ ఓ రేంజ్ లో ఆపరేషన్ వాలెంటైన్ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. గతకొద్ది రోజులుగా గ్యాప్ ఇవ్వకుండా బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాతోనే బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న వరుణ్.. అందరి దృష్టి తన సినిమాపై పడేలా చేస్తున్నారు.

అతని గత సినిమాలు గని, గాండీవదారి అర్జున్ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అందుకే ఈసారి ప్రమోషన్స్ నుంచే సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యేలా అడుగులు వేస్తున్నారు. ముంబయిలో కొన్ని రోజులపాటు మకాం వేసిన వరుణ్ తేజ్.. కేవలం రెండు రోజుల్లో 26 ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ తర్వాత వందేమాతరం సాంగ్ ను వాఘా బోర్డర్ కు వెళ్లి ఆర్మీ అధికారుల సమక్షంలో రిలీజ్ చేశారు. రెండో పాటను ఓ కళాశాలలో లాంఛ్ చేశారు. ఆ తర్వాత అక్కడ విద్యార్థులతో ముచ్చటించారు. ఇటీవల ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామా దాడి జరిగిన ప్రాంతానికి వెళ్లి అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు వరుణ్ నివాళులర్పించారు.

ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో వరుణ్ తేజ్.. తెలుగులో ప్రమోషన్లు స్టార్ చేశారు. హైదరాబాద్ లో ఒక్కరోజులోనే 30 ఇంటర్వ్యూలు ఇచ్చారు. ప్రమోషన్ల కోసం రోడ్ టూర్ కు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ప్రెస్ మీట్లు నిర్వహించారు. వివిధ షాపింగ్ మాల్స్ కు వెళ్లి సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఏలూరులో జరిగిన ఓ జాతరలో సందడి చేశారు. తాజాగా మిలటరీ మాధవరం గ్రామంలో అమరవీరులకు నివాళులు అర్పించారు వరుణ్.

ఆపరేషన్ వాలెంటైన్ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, సాంగ్స్, పోస్టర్స్ అన్నీ ఆకట్టుకుని మూవీ పై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇటీవల మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్.. సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. వరుణ్ స్టంట్స్, మానుషితో లవ్ ట్రాక్, పవర్ ఫుల్ దేశ భక్తి డైలాగులతో ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఐదేళ్ల క్రితం పుల్వామాలో భారత జవాన్లపై జరిగిన దాడి, తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తీర్చుకున్న ప్రతీకారం చుట్టూ ఈ సినిమా కథ ఉండనుంది.

పాన్ ఇండియాలో లెవెల్ లో మార్చి 1వ తేదీన ఈ సినిమా తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా ద్వారా వరుణ్ తేజ్ బాలీవుడ్ కు పరిచయం కానుండగా.. బీటౌన్ బ్యూటీ మానుషీ చిల్లర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. పవర్ ఫుల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి రుద్రగా వరుణ్ ఈ మూవీలో కనిపించనున్నారు. మరి ఈ ప్రమోషన్స్.. వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ కు భారీ ఓపెనింగ్స్ తెస్తాయో లేదో చూడాలి.