Begin typing your search above and press return to search.

రెండు సినిమాల బ్యాక్‌డ్రాప్ ఒక్కటే.. కానీ!

By:  Tupaki Desk   |   24 Feb 2024 1:34 PM GMT
రెండు సినిమాల బ్యాక్‌డ్రాప్ ఒక్కటే.. కానీ!
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''ఆపరేషన్ వాలెంటైన్''. శక్తి ప్రతాప్ సింగ్ హడా అనే డెబ్యూ డైరెక్టర్ ఈ బైలింగ్వెల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ఏరియల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ తో మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లార్, రుహానీ శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. రీసెంట్ గా స్టార్ హీరోలు రామ్ చరణ్, సల్మాన్ ఖాన్ లు రిలీజ్ చేసిన తెలుగు హిందీ ట్రైలర్స్ ఈ సినిమాకు కావల్సినంత బజ్ తెచ్చిపెట్టాయి.

2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో భారత జవాన్లపై జరిగిన ఉగ్ర దాడి, ఆ తర్వాత ఉగ్రవాదులపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రతీకారం తీర్చుకోవడం వంటి సంఘటనల ఆధారంగా 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమా తెరకెక్కిందనే సంగతి ఇటీవలే అధికారికంగా వెల్లడించారు. మేకర్స్ మిషన్‌ కు వేరే పేరు పెట్టినప్పటికీ, రియల్ ఇన్సిడెంట్స్ కు కాస్త కల్పితం జోడించి ఈ చిత్రాన్ని రూపొందించినట్లుగా తెలుస్తోంది. అయితే యాదృచ్ఛికంగా ఇదే స్టోరీ లైన్ తో ఈ మధ్య 'ఫైటర్' అనే సినిమా రావడం ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, దీపికా పదుకునే, అనిల్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ సినిమా 'ఫైటర్'. పఠాన్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన చిత్రమిది. పుల్వామా దాడి ఆధారంగా దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ రూపొందించబడింది. భారీ స్కేల్ లో తీసిన హై బడ్జెట్ సినిమా కాబట్టి, సహజంగానే అధ్బుతమైన విజువల్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు పరిమిత బడ్జెట్ లో తీసిన ''ఆపరేషన్ వాలెంటైన్'' మూవీలో కూడా టాప్ నాచ్ విజువల్స్ ఉండటం విశేషమనే చెప్పాలి.

'ఆపరేషన్ వాలెంటైన్' చిత్రాన్ని సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌, గాడ్‌ బ్లెస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, రినైసన్స్‌ పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సినిమా కోసం దాదాపు 40 కోట్లు ఖర్చు చేసినట్లు టాక్. కానీ ట్రైలర్ లో వరల్డ్ క్లాస్ విజువల్స్ చూస్తే మాత్రం ఎన్ని వందల కోట్ల బడ్జెట్ తో తీసారో అనుకునే విధంగా ఉన్నాయి. మేకింగ్ క్వాలిటీ, గ్రాండియర్ విజువల్స్, యాక్షన్ సీన్స్ తో అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఒక హై టెక్నికల్ స్టాండర్డ్ ఉన్న ప్రోడక్ట్ తో వస్తున్నారనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. ఈ అంశాలన్నీ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యేలా చేశాయి.

కెరీర్ ప్రారంభం నుంచీ వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ తేజ్.. 'ఆపరేషన్ వాలెంటైన్' స్క్రిప్ట్ ను నమ్మి కొత్త దర్శకుడితో ఈ మూవీ చేయడానికి అంగీకరించారు. నిజానికి శక్తి ప్రతాప్ సింగ్ డెబ్యూ డైరెక్టర్ అయినప్పటికీ, గతంలో యాడ్-ఫిల్మ్ మేకర్ గా సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన అనుభవం ఉంది. ఆ అనుభవంతోనే పుల్వామా దాడికి ముందు, తర్వాత జరిగిన సంఘటలను జనాలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైమానిక దళ వీరుల అలుపెరుగని పోరాటాన్ని, దేశాన్ని రక్షించడంలో ఎదుర్కొనే సవాళ్లను తెర మీదకు తీసుకొస్తున్నారు.

'ఆపరేషన్ వాలెంటైన్' మూవీలో ఐఏఎఫ్ ఆఫీసర్ పాత్రలో వరుణ్ తేజ్.. రాడార్ ఆఫీసర్ పాత్రలో మానుషి చిల్లర్ కనిపించనున్నారు. మిక్కీ జె మేయర్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 25) సాయంత్రం హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.