భుజానికి గాయం.. లెక్కచేయని విజయ్ దేవరకొండ!
ఇటీవల ఓ హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నప్పుడు, విజయ్ దేవరకొండ భుజానికి గాయమైనట్లు సమాచారం.
By: Tupaki Desk | 4 Nov 2024 5:38 PM GMTరౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గత కొన్నేళ్ళుగా తన రేంజ్ కు తగ్గ సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నారు. 'లైగర్' 'ది ఫ్యామిలీ స్టార్' చిత్రాలు డిజాస్టర్లుగా మారగా.. 'ఖుషి' సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంతగా వసూళ్లు రాబట్టలేదు. దీంతో యువ హీరో తదుపరి ప్రాజెక్ట్స్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. భిన్నమైన స్క్రిప్ట్స్ ను ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టిగా నిర్ణయించుకున్న విజయ్.. ఈ మూవీ కోసం తనను తాను అంకితం చేసుకున్నాడు. గాయాన్ని సైతం లెక్కచేయకుండా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
ప్రస్తుతానికి 'VD 12' అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతోన్న విజయ్ దేవరకొండ - గౌతమ్ ల సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. శ్రీలంక, కేరళ, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో చిత్రీకరణ సాగుతోంది. ఇటీవల ఓ హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నప్పుడు, విజయ్ దేవరకొండ భుజానికి గాయమైనట్లు సమాచారం. అతను గాయంతో బాధపడుతుండంతో, డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారట. కానీ విజయ్ షూటింగ్ కు ఏమాత్రం బ్రేక్ ఇవ్వకుండా, ముందుగా ప్లాన్ చేసినట్లుగానే ఆ షెడ్యూల్ ను కొనసాగించి ప్రొఫెషనలిజం చూపించారు. గాయాన్ని సైతం లెక్క చేయకుండా ఆ ఛాలెంజింగ్ యాక్షన్ సీన్ షూట్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది చివరి నాటికి VD12 షూటింగ్ పూర్తి చేయాలని నిశ్చయించుకున్న విజయ్ దేవరకొండ.. షెడ్యూల్స్ డిస్టర్బ్ అవ్వకూడదనే గాయంతో బాధపడుతున్నా షూటింగ్ లో పాల్గొన్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అయితే గాయం తిరగబెట్టకుండా తగినంత జాగ్రత్తలు తీసుకున్నాడట. ఫిజియోథెరపీ తీసుకుంటూనే సినిమా షూటింగ్ చేస్తున్నాడట. కాబట్టి అభిమానులు విజయ్ గాయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. గౌతమ్ తిన్ననూరి సినిమా చిత్రీకరణ కంప్లీట్ అయిన వెంటనే, తన నెక్స్ట్ మూవీ షూటింగ్ కూడా ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు.
సినిమా కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే యాక్టర్స్ లో విజయ్ దేవరకొండ ఒకరు. ప్లాపులు వచ్చాయని నిరాశ పడకుండా, స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు సాగిపోడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇప్పుడు భుజం గాయాన్ని కూడా లెక్కచేకుండా VD12 షూటింగ్ కంటిన్యూ చేస్తున్నాడంటే, విజయ్ ఎంతటి డెడికేషన్ ఉన్న నటుడో అర్థం అవుతుంది. గఅతను తంలోనూ అనేక సందర్భాల్లో ఇలానే వ్యవహరించాడు. తాజా ఘటన సినిమా పట్ల అతని చిత్తశుద్ధిని, అంకితభావాన్ని మరోసారి నిరూపిస్తోంది.
కాగా, హైవోల్టేజ్ యాక్షన్ మూవీగా 'VD 12' రూపొందుతోంది. గౌతమ్ తిన్ననూరి KGF తీస్తే ఎలా ఉంటుందో ఇది అలా ఉంటుందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇందులో విజయ్ దేవరకొండ సరసన 'మిస్టర్ బచ్చన్' ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే రిలీజైన విజయ్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే టైటిల్ ను అనౌన్స్ చేస్తామని మేకర్స్ తెలిపారు. 2025 మార్చి 28న సినిమాని రిలీజ్ చేయనున్నట్టు గతంలో ప్రకటించారు.