వీర ధీర సూరన్ టీజర్: విక్రమ్ పవర్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్
స్టార్ హీరో విక్రమ్ సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంభంధం లేకుండా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 9 Dec 2024 3:22 PM GMTస్టార్ హీరో విక్రమ్ సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంభంధం లేకుండా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతీ సినిమాలో కూడా ఏదో ఒక బిన్నమైన కాన్సెప్ట్ ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. ఇక తన చివరి సినిమా తంగలాన్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దర్శకుడు పా రంజిత్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇప్పుడు, విక్రమ్ మరో సరికొత్త ప్రాజెక్ట్ వీర ధీర సూరన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఎస్‌యు అరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలైంది. టీజర్ చూస్తే, విక్రమ్ ఇందులో బిన్నమైన షేడ్స్ ఉన్న పాత్ర పోషించినట్లు కనిపిస్తోంది. ఒక వైపు ఆయన కుటుంబంలోని భార్య, కూతురుతో హ్యాపీగా జీవించే వ్యక్తిగా కనిపిస్తుండగా, మరొక వైపు మిస్టరీ వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నట్టు కనిపిస్తోంది. టీజర్ కథలోని ఈ మలుపులను చక్కగా హైలైట్ చేస్తూ, ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇక విక్రమ్ విలన్స్ తో ఎలాంటి గొడవలు ఉన్నాయి? అసలు అతను ఏం చేస్తాడు, క్యారెక్టర్ వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటీ? ఆ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. చిత్త (తెలుగులో చిన్న) సినిమాతో విజయాన్ని అందుకున్న ఎస్‌యు అరుణ్ కుమార్, ఈ సినిమా ద్వారా మరో హిట్ కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో విక్రమ్ తో పాటు ఎస్జే సూర్య, దుశార విజయన్, సురాజ్ వెంజారమూడు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
వీరి పాత్రలు కూడా కథకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు అదిరిపోయే సంగీతాన్ని అందిస్తున్నారు. థేని ఈస్వర్ సినిమాటోగ్రఫీ అందించగా, ప్రసన్న జికే ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. సీఎస్ బాలచందర్ ఆర్ట్ డైరెక్షన్ అందించారు. ఈ సినిమాను హెచ్.ఆర్. పిక్చర్స్ బ్యానర్‌పై రియా శిబు నిర్మించారు. టీజర్ చూసిన వెంటనే సినిమా మీద ఆసక్తి మరింతగా పెరిగింది.
ముఖ్యంగా విక్రమ్ నటన మరోసారి అద్భుతంగా ఉంటుందని స్పష్టమవుతోంది. కథలోని మలుపులు, అతడి వ్యక్తిత్వం, ఇంటెన్స్ సన్నివేశాలు సినిమా గురించి భారీ అంచనాలను పెంచేశాయి. విజువల్స్ కూడా ఆసక్తిగా ఉండటం టీజర్‌కు అదనపు ఆకర్షణగా నిలిచింది. వీర ధీర సూరన్ చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. జనవరి 2025లో ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్లు ప్లాన్ చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి.