బన్నీని కలిసిన వెంకీ, అఖిల్.. సమంత ఎమోషనల్ పోస్ట్!
తాజాగా విక్టరీ వెంకటేశ్, అఖిల్ అక్కినేని, అడివి శేష్ వంటి మరికొందరు హీరోలు అల్లు అర్జున్ ని మీట్ అయ్యారు.
By: Tupaki Desk | 14 Dec 2024 2:39 PM GMTసినీ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ పై విడుదలైన నేపథ్యంలో సినీ ప్రముఖులంతా ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారు. శనివారం ఉదయం నుండి అనేక మంది టాలీవుడ్ సెలబ్రిటీలు జూబ్లీహిల్స్‌లోని ఇంటికి వెళ్లి బన్నీని కలిశారు. తాజాగా విక్టరీ వెంకటేశ్, అఖిల్ అక్కినేని, అడివి శేష్ వంటి మరికొందరు హీరోలు అల్లు అర్జున్ ని మీట్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
సీనియర్ హీరో వెంకటేశ్ శనివారం సాయంత్రం అల్లు అర్జున్ నివాసానికి వచ్చి ఆయన్ని పరామర్శించారు. బన్నీతో పాటు కూర్చొని తాజా పరిణామాల గురించి చర్చించారు. అఖిల్ అక్కినేని, అడివి శేష్ సైతం విడివిడిగా అల్లు అర్జున్ తో కాసేపు ముచ్చటించారు. బన్నీ వారితో పాటు కారు వరకూ నడుచుకుంటూ వచ్చి బై చెప్పి పంపించారు. ఈ సందర్భంగా అఖిల్ "నిన్ను చూసి మేమంతా గర్వపడుతున్నాం. టేక్ కేర్" అని బన్నీతో చెప్పిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ఇదిలా ఉంటే, హీరోయిన్ సమంత రూత్ ప్రభు సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ ఉదంతంపై స్పందించింది. బన్నీ జైలు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత, ఆయన సతీమణి స్నేహా రెడ్డిని హత్తుకొని భావోద్వేగానికి లోనైన వీడియోని సామ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. దీనికి 'పుష్ప 2' సినిమాలోని 'సూసేకి' సాంగ్ ని జత చేసింది. అలానే "నేను ఏడవడం లేదు.. ఓకే" అనే క్యాప్షన్ పెట్టి అల్లు అర్జున్, స్నేహా లను ట్యాగ్ చేసింది.
ఇక అల్లు అర్జున్ అరెస్టుపై మరో హీరోయిన్ శ్రీలీల కూడా స్పందించింది. విశాఖపట్టణంలోని డాబా గార్డెన్స్‌లో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరైన శ్రీలీల మాట్లాడుతూ.. "ఇది చాలా దురదృష్టకరం. బన్నీ ఇప్పుడు బయటికి వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. అందరం చాలా టెన్షన్ పడ్డాము. అతను ఎల్లప్పుడూ సరైన పని చేస్తాడు. లాని అంత రెస్పెక్ట్ చేశారు కాబట్టి ఆయన రూల్స్ అన్నీ ఫాలో అయ్యాడు. అతను అంత పెద్ద స్టార్ అయ్యుండి ఒక సిటిజన్‌గా అన్నీ చేసాడు" అని అన్నారు.
'పుష్ప 2' ప్రీమియర్ నేపథ్యంలో హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి చెందడంతో, అల్లు అర్జున్ మీద పోలీసులు కేసు నమోదు చేసి, శుక్రవారం అరెస్ట్ చేశారు. అదే రోజు మధ్యంతర బెయిల్ వచ్చినప్పటికీ, ఆ రాత్రి అంతా బన్నీ జైలులోనే ఉండాల్సి వచ్చింది. శనివారం ఉదయం విడుదలై ఇంటికి వచ్చిన బన్నీని చూడగానే.. కుటుంబం అంతా భావోద్వేగాలకు గురైంది. బన్నీ మాత్రం చాలా ధైర్యంగా కనిపించాడు. ఎలాంటి కొత్త వివాదాలకూ చోటు ఇవ్వకుండా మీడియా ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడారు. అరెస్ట్ విషయంలో అల్లు అర్జున్ కి ఫుల్ సపోర్ట్ లభిస్తోంది. ఈ నేపథ్యంలో #NationWithAlluArjun అనే హ్యాష్ ట్యాగ్ ఎక్స్ లో వైరల్ అవుతోంది.