వెంకటేష్ బాలీవుడ్ హీరోలా ఊపేస్తున్నాడు!
అయితే మునుపటితో పొలిస్తే ఈ మధ్య కాలంలో కొందరి హీరోల్లో మార్పు వచ్చింది. అందులో విక్టరీ వెంకటేష్ ముందున్నారు.
By: Tupaki Desk | 2 Jan 2025 12:30 PM GMTసినిమా ప్రచార కార్యక్రమాల్లో బాలీవుడ్ స్టార్ హీరోలు ఎంత ఉత్సాహంగా కనిపిస్తారో చెప్పాల్సిన పనిలేదు. అభిమానులతో ఇంటరాక్షన్ అయినా...టీవీ షోల్లో అయినా వాళ్లతో మమేకవ్వడం అన్నది వాళ్లకు మాత్రమే తెలిసిన టెక్నిక్. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, హృతిక్ రోషన్ ఇలా స్టార్ హీరోల నుంచి తర్వాత తరం హీరోల వరకూ ఎవరైనా సరే తమ సినిమా రిలీజ్ అవుతుందంటే? ఎంతో ఉత్సాహంగా కనిపిస్తారు.
అభిమానులతో కలిసి డాన్సులు వేస్తారు. గ్రూప్ డాన్సర్స్ అభిమానంతో పిలిస్తే కాదనకుండా స్టేజ్ మీదకు వెళ్లి డాన్సులు చేస్తుంటారు. ఇక టీవీ షోల్లో హోస్ట్ లతో కలిసిపోవడం అన్నది వాళ్లకే చెల్లింది. బాలీవుడ్ హీరోల్లో ఈ కల్చర్ చాలా కాలంగానే ఉంది. సూపర్ స్టార్ అనే భావన ఎక్కడా చూపించరు. ఎంతో ఓపెన్ గా మాట్లాడుతారు. అంతే ఓపెన్ గానూ వ్యవహరిస్తారు. అయితే టాలీవుడ్ హీరోల్లో ఈ కల్చర్ లేదు. ఈవెంట్ కు వచ్చారంటే ఒక్కొక్కరు ఒక్కో రేంజ్ ఫీలవుతుంటారు.
తమ సినిమా ప్రమోషన్ అయినా వేదికపై తమ సినిమాకి తామే చీఫ్ గెస్ట్ లు గా కనిపిస్తుంటారు. అయితే మునుపటితో పొలిస్తే ఈ మధ్య కాలంలో కొందరి హీరోల్లో మార్పు వచ్చింది. అందులో విక్టరీ వెంకటేష్ ముందున్నారు. ఒకప్పుడు వెంకటేష్ మీడియాలో పెద్దగా కనిపించేవారు. సినిమా రిలీజ్ వారం రోజుల ముందు మాత్రమే కనిపించేవారు. కానీ తాజాగా వెంకటేష్ `సంక్రాంతికి వస్తున్నాం` సినిమా ప్రమోషన్ చేస్తున్న తీరు చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తుంది.
తానో పెద్ద హీరో అన్న విషయాన్ని పక్కనబెట్టి టీమ్ అందరితో ఎంతో చలాకీగా కనిపిస్తున్నారు. వాళ్లతో కలిసి డాన్సులు చేస్తున్నారు. జోకులు వేస్తున్నారు. అభిమానులతో ఎంతో ఓపెన్ గా మాట్లాడుతున్నారు. యువతకి సందేశం ఇస్తున్నారు. తనలో ఆద్యాత్మిక చింతనని బయట పెడుతున్నారు. ఇక నటసింహ బాలకృష్ణ ఆహా వేదకగా అంతే ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున కూడా అంతే సరదాగా ఇంటరాక్ట్ అవుతున్నారు.