సీనియర్ స్టార్స్ బాక్స్ ఆఫీస్ పోరులో వెంకీ సునామీ!
అయితే గ్రాస్ పరంగా భారీ హిట్లు అందించినా, వెంకటేష్ తాజా చిత్రం కలెక్షన్ల పరంగా ఉన్న స్థాయికి చేరుకోవడం లేదు.
By: Tupaki Desk | 28 Jan 2025 9:31 AM GMTటాలీవుడ్ సీనియర్ హీరోల బాక్స్ ఆఫీస్ రికార్డుల పోరు మరోసారి ఉత్కంఠభరితంగా మారింది. విక్టరీ వెంకటేష్ తన తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాంతో సీనియర్ హీరోలలో ఓ సరికొత్త హై బెన్చ్ మార్క్‌ను నెలకొల్పాడు. పండుగ సీజన్లో విడుదలైన ఈ సినిమా మొదటి నుంచి భారీ వసూళ్లతో దూసుకుపోతూ, అన్ని ఏరియాల్లోనూ సీనియర్ హీరోల రికార్డులను తిరగరాస్తోంది.
రెండు వారాల్లోనే ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లతో గ్రాస్ పరంగా 260 కోట్ల మార్క్‌ను దాటేసింది. ముఖ్యంగా షేర్ పరంగా 141 కోట్లకు చేరువగా ఉండటంతో, గతంలో చిరంజీవి సైరా నరసింహా రెడ్డి సినిమా సాధించిన 143 కోట్ల షేర్‌ను సైతం ఈవెనింగ్ షోలు దాటివేసే అవకాశముంది. ఇది టాలీవుడ్ సీనియర్ హీరోల బాక్స్ ఆఫీస్ చరిత్రలో నయా రికార్డ్‌గా నిలవనుంది.
మెగాస్టార్ చిరంజీవి గతంలో సైరా నరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి చిత్రాలతో సీనియర్ హీరోల రేసులో ఆధిపత్యం చాటుకున్నారు. కానీ వెంకటేష్ తాజా సినిమా సంక్రాంతి సీజన్లో మాత్రమే కాకుండా, లాంగ్ రన్లో కూడా తనదైన ముద్ర వేశారు. ఈ సినిమాతో వెంకటేష్ గ్రాస్ పరంగా మెగాస్టార్ రికార్డులను తిరగరాయడంతో పాటు, సీనియర్ స్టార్స్‌లో అతిపెద్ద హిట్‌ను అందుకునే దిశగా పయనిస్తున్నారు.
ఇదిలా ఉండగా, మరో వైపు బాలకృష్ణ వీర సింహా రెడ్డి, డాకు మహరాజ్ లాంటి సినిమాలతో సీనియర్ హీరోల వరుస హిట్ రికార్డును కొనసాగిస్తూనే ఉన్నారు. అఖండ నుంచి వరుసగా బాలయ్య సినిమాలూ 100 కోట్లు దాటిన ఘనతను పొందాయి. అయితే గ్రాస్ పరంగా భారీ హిట్లు అందించినా, వెంకటేష్ తాజా చిత్రం కలెక్షన్ల పరంగా ఉన్న స్థాయికి చేరుకోవడం లేదు.
మరోవైపు, నాగార్జున మాత్రం ఈ మధ్య సరైన సక్సెస్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆయనకు ఈ స్థాయి హిట్ కూడా రాలేదు. ఆయన సోగ్గాడే చిన్ని నాయనా తరువాత మళ్ళీ ఆ స్థాయిలో సక్సెస్ పడలేదు. అయితే ఆ సినిమా కూడా వంద కోట్లను టచ్ చేయలేదు. టాలీవుడ్ టాప్ సీనియర్ స్టార్స్ లో ఒక్క నాగ్ మాత్రమే ఇంకా 100 కోట్ల మార్క్ ను అందుకోలేదు. ఇక సంక్రాంతి సందర్భంగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం ఫ్యామిలీ ప్రేక్షకులతో పాటు యూత్‌ను కూడా థియేటర్లకు రప్పించగలిగింది. ఈ విజయంతో సీనియర్ హీరోలలో వెంకటేష్ తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నారు.