వెంకీ మామ చెప్పిన నాలుగు జీవిత సూత్రాలు..!
ఈ సందర్భంగా ఆనందకరమైన జీవితం గడపడానికి నాలుగు సూత్రాలు ఆచరిస్తే సరిపోతుందని చెప్పారు.
By: Tupaki Desk | 14 Jan 2025 4:07 AM GMTసంక్రాంతి కానుకగా 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల రానా హోస్ట్ చేస్తున్న 'ది రానా దగ్గుబాటి షో’లో పాల్గొన్నారు వెంకీ. ఈ సందర్భంగా ఆనందకరమైన జీవితం గడపడానికి నాలుగు సూత్రాలు ఆచరిస్తే సరిపోతుందని చెప్పారు.
"నేను జీవితంలో నాలుగు విషయాలు పాటిస్తాను. కష్టపడటం.. నివేదించటం.. బయటకు వచ్చేయడం.. అంగీకరించడం. మనం ఏ పని చేసినా కచ్చితంగా బాగా కష్టపడాలి. దాని ఫలితాన్ని ఈ ప్రపంచానికి వదిలేయాలి. ఈ రెండూ ఎంత ముఖ్యమో.. బయటపడటం, ఫలితాన్ని అంగీకరించడం కూడా అంతే ముఖ్యం" అని వెంకటేశ్ చెప్పారు. నిత్యం ధ్యాన సాధన చేయడం, గురువులు తనకు ఇచ్చిన సలహాలు స్వీకరించడం వల్లనే ఈ సూత్రాలు పాటించడం తనకు సాధ్యమైందని తెలిపారు.
ఈరోజుల్లో జనాలు ఎక్కువగా ఆందోళనకు గురికావడానికి కారణం వచ్చిన ఫలితాన్ని అంగీకరించలేకపోవడమేనని వెంకీ అభిప్రాయ పడ్డారు. దీనికి ఉదాహరణ ‘సంక్రాంతికి వస్తున్నాం’ గురించి చెప్పారు. "కష్టపడి సినిమా పూర్తి చేశా. దాన్నుంచి బయటకు వచ్చేశాను. రిజల్ట్ ఎలా వచ్చినా దాన్ని తీసుకుంటా. ప్రస్తుతం జనాలు ఆందోళనపడటానికి కారణం వారి జీవితంలో జరిగే వాటిని అంగీకరించలేకపోవడమే" అని వెంకీ పేర్కొన్నారు.
వెంకటేష్ లోని ఆధ్యాత్మిక కోణం గురించి మనందరికీ తెలిసిందే. అంత పెద్ద సీనియర్ హీరో అయినా, స్పిరుచ్యువల్ బాటలో నడవడం ఆశ్చర్య పరుస్తుంది. అందరు హీరోలు షూటింగ్ విరామం దొరికితే హాలీడే కోసం విదేశాలకు వెళ్తుంటే, వెంకీ మాత్రం హిమాలయాలకు వెళ్తుంటారు. ఆశ్రమాలకు వెళ్లి కొన్ని రోజులు గడిపి వస్తుంటారు. ఇక ఆయన ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో మాట్లాడినా ఎక్కడో చోట ఆధ్యాత్మిక అంశాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. మనం జీవించే జీవితం జీవితం కాదని.. మనం మనం కాదని.. మనలోన ఇంకొకడు ఉంటాడని చెబుతూ వస్తుంటారు.
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్' టాక్ షోలో ఇటీవల వెంకటేశ్ తన ఆధ్యాత్మిక ప్రయాణం గురించి మాట్లాడారు. ఇదే క్రమంలో రానా దగ్గుబాటి షోలో సంతోషకరమైన జీవితం గడపడానికి పాటించాల్సిన నాలుగు సూత్రాలు ఏంటనేది వివరించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో బాబాయ్ - అబ్బాయ్ కలిసి సందడి చేసిన ఈ ఎపిసోడ్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఇదిలా ఉంటే, వెంకటేశ్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఈరోజు (జనవరి 14) ధియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ ఈ మూవీని నిర్మించారు. కేవలం 72 రోజుల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేశారు. ఇది పర్ఫెక్ట్ పండుగ సినిమాగా మేకర్స్ చెబుతూ వచ్చారు. ప్రమోషన్స్ చాలా గట్టిగా చేశారు. మరి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి.