నందమూరి మోక్షజ్ఞ.. రంగంలోకి మరో టాలెంటెడ్ డైరెక్టర్!
మొదటి సినిమా కోసం ప్రశాంత్ వర్మ వంటి దర్శకుడిని ఎంపిక చేయగా, రెండో చిత్రానికి వెంకీ అట్లూరి లాంటి దర్శకుడిని ఫైనల్ చేయడం వెనుక అందరికీ అర్థమయ్యేలా ఉంది.
By: Tupaki Desk | 2 Dec 2024 7:21 AM GMTనందమూరి మోక్షజ్ఞ తన సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ మొదటి సినిమా అనౌన్స్ చేయగా, అది నందమూరి అభిమానులలో భారీ అంచనాలను పెంచింది. ఈ ప్రాజెక్ట్ మీద ఇంకా బజ్ కొనసాగుతుండగానే, ఇప్పుడు మోక్షజ్ఞ రెండో సినిమాపై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి.
మోక్షజ్ఞ తన రెండో చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే బాలకృష్ణ ఈ సంస్థలో డాకు మహరాజ్ సినిమా చేశారు. అది సంక్రాంతికి రానున్న విషయం తెలిసిందే. అయితే ఇపుడు మోక్షజ్ఞ కోసం కూడా మరో ప్రాజెక్ట్ సెట్ చేసే ప్లాన్ లో ఉన్నారట. ఈ ప్రాజెక్ట్‌కు వెంకీ అట్లూరి దర్శకుడిగా ఫిక్స్ అయినట్లు సమాచారం. వెంకీ అట్లూరి ఇటీవలే దుల్కర్ సల్మాన్ తో చేసిన లక్కీ భాస్కర్ భారీ హిట్ సాధించగా, ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో మరింత భారీ బడ్జెట్ చిత్రాన్ని చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈ క్రమంలో బాలకృష్ణతో జరిగిన చర్చల తర్వాత మోక్షజ్ఞ కోసం ప్రత్యేకమైన కథను రూపొందించినట్లు తెలుస్తోంది. వెంకీ అట్లూరి ఇప్పటి వరకు తన సినిమాల్లో కుటుంబ బంధాలు, ప్రేమ కథలు, ఎమోషన్లను మిళితం చేసి ప్రేక్షకుల మన్ననలు పొందారు. మోక్షజ్ఞ కోసం కూడా ఆయన ఓ స్పెషల్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ కథకు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేతలు ఓకే చెప్పగా, ప్రస్తుతం స్క్రిప్ట్ చివరి దశలో ఉందట. ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి పాన్ ఇండియా స్కోప్ లో రూపొందనుందని సమాచారం.
బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ గురించి ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. మొదటి సినిమా కోసం ప్రశాంత్ వర్మ వంటి దర్శకుడిని ఎంపిక చేయగా, రెండో చిత్రానికి వెంకీ అట్లూరి లాంటి దర్శకుడిని ఫైనల్ చేయడం వెనుక అందరికీ అర్థమయ్యేలా ఉంది. మోక్షజ్ఞ కెరీర్ ని సరైన ట్రాక్ లో పెట్టడమే లక్ష్యంగా బాలయ్య ప్రణాళికలు రూపొందిస్తున్నారని అనిపిస్తోంది.
నందమూరి అభిమానులు ఇప్పటికే మోక్షజ్ఞ ప్రస్థానంపై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. మొదటి సినిమాపై భారీ అంచనాలు ఉన్న ఈ తరుణంలో రెండో చిత్రానికి ఇలాంటి ప్రముఖ దర్శకుడు, ప్రముఖ నిర్మాణ సంస్థ కలిసిరావడం మరింత క్రేజ్ పెంచుతోంది. వెంకీ అట్లూరి గత చిత్రాల విజయాలతో మంచి ట్రాక్ రికార్డ్ కలిగి ఉండటం మోక్షజ్ఞ రెండో చిత్రానికి అదనపు బలంగా మారుతోంది. ఈ ప్రాజెక్ట్‌పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధమైన తరువాత ఈ కాంబినేషన్‌పై క్లారిటీ ఇవ్వాలని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భావిస్తోందట. అయితే ఇప్పటి వరకు వెలువడిన సమాచారం ప్రకారం, ఈ సినిమా పక్కా పాన్ ఇండియా రేంజ్ లో భారీ ప్రాజెక్ట్ గా రూపొందనుందని తెలుస్తోంది.