గత ఐదేళ్లుగా నేను ఫెయిల్యూర్‌నే!
ఛలో సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన వెంకీ కుడుముల మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకోవడంతో పాటూ డైరెక్టర్ లో విషయముంది అనిపించుకున్నాడు.
By: Tupaki Desk | 26 March 2025 8:51 AMఛలో సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన వెంకీ కుడుముల మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకోవడంతో పాటూ డైరెక్టర్ లో విషయముంది అనిపించుకున్నాడు. దాని తర్వాత నితిన్ తో కలిసి భీష్మ మూవీ చేసి మరో బ్లాక్ బస్టర్ ను అందుకున్న వెంకీ కుడుముల ఆ సినిమా తర్వాత మరో సినిమా తీయడానికి ఐదేళ్లు పట్టింది.
ఐదేళ్ల తర్వాత వెంకీ మరోసారి తన సక్సెస్‌ఫుల్ హీరో నితిన్ తో జత కట్టాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వెంకీ చేసిన రాబిన్‌హుడ్ సినిమా మార్చి 28న రిలీజవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వెంకీ తన కెరీర్ గురించి, గత ఐదేళ్లుగా తను పడిన ఇబ్బందుల గురించి మాట్లాడాడు.
వాస్తవానికి భీష్మ సినిమా తర్వాత కొన్నాళ్లకు వెంకీకి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. కానీ వెంకీ చెప్పిన కథ చిరూకి అసంతృప్తిని మిగల్చడంతో ఇంకో స్టోరీ రాసుకుని రా వెంకీ, తప్పకుండా చేసేద్దమని చిరూ చెప్పారని వెంకీ అన్నాడు. చిరంజీవి వల్లే సినిమాల్లోకి వచ్చిన తాను లైఫ్ లో ఒక్కసారైనా ఆయన్ని కలిసి ఫోటో దిగాలనుకునేవాడినని, అలాంటిది భీష్మ తర్వాత ఆయన్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చినప్పుడు ఎంతో ఆనందించి కథ రాసుకున్నానని కానీ ఆ కథ ఆయనకు పెద్దగా నచ్చకపోవడంతో చిరూ మూవీ ఆగిపోయిందని వెంకీ చెప్పుకొచ్చాడు.
కానీ ఆ తర్వాత చిరంజీవిని సంతృప్తి పరిచే కథ రాయలేకపోయానని, ఆయనతో సినిమా చేస్తే అది నెక్ట్స్ లెవెల్ లో ఉండాలని ఫిక్సయ్యానని, అదే మాట ఆయనతో చెప్పి మరో మూవీ చేసుకుని వస్తానని చెప్పడంతో ఆయన కూడా ఒప్పుకున్నారని, చిరూ తనను ఎప్పుడూ ఎంతో సపోర్ట్ చేస్తారని, ఇప్పటికీ మెసేజెస్ పెడుతుంటారని వెంకీ తెలిపాడు.
అయితే ఈ ఐదేళ్లు తానొక ఫెయిల్యూర్‌నే అని, లైఫ్ లో అనుకున్నవి ఏవీ సాధించలేకపోయానని, తన ఫేవరెట్ హీరో చిరంజీవితో సినిమా చేయలేకపోయానని, ఇంట్లో వాళ్లు పెళ్లి చేసుకోమంటే పెళ్లి కూడా ఇప్పుడే వద్దని చెప్పి ఇంట్లో వాళ్లను కూడా బాధ పెట్టానని, ప్రస్తుతానికి తన ఫోకస్ మొత్తం సినిమాల పైనే ఉందని, ఇప్పుడు చేస్తున్న రాబిన్ హుడ్ సినిమా తన కెరీర్లో ఎంతో ముఖ్యమైనదని వెంకీ తెలిపాడు.