అట్లూరికి తెలుగు హీరోలు నచ్చడం లేదా!
ఇప్పటివరకూ వెంకీ అట్లూరీ డైరెక్టర్ గా ఐదు సినిమాలు చేసాడు.
By: Tupaki Desk | 18 Feb 2025 12:40 PM GMTయంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరీకి తెలుగు హీరోలు కనెక్ట్ అవ్వడం లేదా? అందుకే పరభాషా హీరోలపై మొగ్గు చూపుతున్నాడా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తోంది. ఇప్పటివరకూ వెంకీ అట్లూరీ డైరెక్టర్ గా ఐదు సినిమాలు చేసాడు. అందులో రెండు సినిమాలు ఇతర భాషలకు చెందిన హీరోలతోనే చేసాడు. 'తొలి ప్రేమ'తో దర్శకుడిగా పరిచమయ్యాడు. అందులో మెగా వారసుడు వరుణ్ తేజ్ హీరోగా నటించాడు.
ఆ సినిమా హిట్ అయింది. అటుపై అక్కినేని అఖిల్ తో 'మిస్టర్ మజ్ను' తెరకెక్కించాడు. కానీ సినిమా మిక్స్డ్ టాక్ వచ్చింది. అనంతరం యూత్ స్టార్ నితిన్ తో 'రంగ్ దే' రూపొందించాడు. ఈసినిమా ప్లాప్ అయింది. ఆ తర్వాత అట్లూరి తెలుగు హీరోల వైపు చూడటం మానేసాడు. అనంతరం ధనుష్ తో సార్ చిత్రాన్ని తెలుగు, తమిళ్ లో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. విద్యా వ్యవస్థను టచ్ చేస్తూ కాన్సెప్ట్ బేస్ లో తెరకెక్కించిన చిత్రమిది.
అటుపై మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా 'లక్కీ భాస్కర్' తెరకెక్కించాడు. డబ్బుంటునే మనిషికి విలువు అన్న పాయింట్ ని బలంగా చెప్పాడు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఈ విజయంతో వెంకీ కి దర్శకుడిగా ఇంకా మంచి పేరొచ్చింది. ఇది కూడా ఓ కాన్సెప్ట్ చుట్టూ తిరిగే స్టోరీ. తదుపరి కోలీవుడ్ స్టార్ సూర్యతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆ సినిమా ఎప్పుడైనా పట్టాలెక్కే అవకాశం ఉంది.
అయితే ఇవే సినిమాలు తెలుగు హీరోలతో చేయడం లేదు? అన్నది ఇక్కడ ఎదురవుతోన్న ప్రశ్న. టాలీవుడ్ హీరోలు ఆ కథలకు సెట్ అవ్వడం లేదా? వాళ్లు డేట్లు ఇవ్వడం లేదా? ఇంకేవైనా కారణాలు ఉన్నాయా? అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇతర భాషల హీరోలతో వెంకీ ఇలా చేయడం బిజినెస్ పరంగా కలిసొస్తుంది. రెండు భాషల్లోనూ ఆ సినిమాలకు మంచి బిజినెస్ అవుతుంది. వెంకీ కాన్సెప్ట్ లకు కూడా వాళ్లు పర్పెక్ట్ గా సూటవుతున్నారు అన్నది కాదనలేని నిజం.