చై-శోభితపై జోశ్యం: మహిళా కమిషన్ ముందు వేణు స్వామి క్షమాపణ
2027 చివరి నాటికి మరో మహిళ కారణంగా వారి వివాహ సంబంధం ముగిసిపోతుందని అతడు జోశ్యం చెప్పాడు.
By: Tupaki Desk | 21 Jan 2025 12:31 PM GMTనాగ చైతన్య- శోభిత ధూళిపాల జంట నిశ్చితార్థ సమయంలో వివాదాస్పద జ్యోతిష్కుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 2027 చివరి నాటికి మరో మహిళ కారణంగా వారి వివాహ సంబంధం ముగిసిపోతుందని అతడు జోశ్యం చెప్పాడు. వేణు స్వామి అసందర్భపు జోశ్యం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.
నాగచైతన్య అభిమానులు, తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టిఎఫ్‌జేఏ) సభ్యులు అతడిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. నాగచైతన్యపై వేణుస్వామి అనుచిత వ్యాఖ్యల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుకు ప్రతిస్పందనగా, తెలంగాణ హైకోర్టు ఈ విషయంపై దర్యాప్తునకు ఆదేశించింది.
అయితే వేణు స్వామి కోర్టులో ఫిర్యాదును సవాలు చేసి, మొదట మహిళా కమిషన్ నుండి చర్యలకు వ్యతిరేకంగా స్టే పొందారు. కానీ తెలంగాణ హైకోర్టు తరువాత ఈ స్టేను రద్దు చేసి, ఫిర్యాదును పూర్తిగా దర్యాప్తు చేయాలని కమిషన్‌ను ఆదేశించింది. ఆరోపణలకు సంబంధించి చర్యలు తీసుకునే అధికారం కమిషన్‌కు ఉందని కోర్టు ధృవీకరించింది. ఈ తీర్పు తర్వాత మహిళా కమిషన్ వేణు స్వామిని విచారణకు పిలిచి, వారంలోపు దర్యాప్తుకు సహకరించాలని గడువు విధించింది.
ఇటీవల నాగచైతన్య - శోభిత జంట పెళ్లితో ఒకటైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు తెలంగాణ ఉమెన్ కమిషన్ ముందు వేణుస్వామి బహిరంగంగా క్షమాపణ చెప్పారని మీడియాలో కథనాలొస్తున్నాయి. హీరో నాగచైతన్య- శోభిత జంటపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు వేణు స్వామి పేర్కొన్నారు. ఇద్దరూ మళ్లీ విడాకులు తీసుకుంటారని జ్యోతిష్యం చెప్పిన వేణుస్వామి ఇప్పుడు పూర్తిగా క్షమాపణలు కోరారు. నేడు ఉమెన్ కమిషన్ కార్యాలయానికి హాజరై తన వ్యాఖ్యలను ఉపసరించుకున్నట్లు వేణుస్వామి తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం కానివ్వొద్దని వేణు స్వామిని ఉమెన్ కమిషన్ హెచ్చరించింది.