Begin typing your search above and press return to search.

అప్‌డేట్ వ‌స్తుంది.. బలగం వేణు మ‌రో ప్ర‌య‌త్నం!

వేణు తన రెండవ చిత్రానికి సిద్ధమవుతున్నాడు. ఎలాంటి స‌వాల్ ని అయినా స్వీక‌రిస్తాన‌ని, అప్ డేట్ వ‌స్తోంద‌ని తాజాగా ప్ర‌క‌టించాడు.

By:  Tupaki Desk   |   6 Feb 2025 7:46 AM GMT
అప్‌డేట్ వ‌స్తుంది.. బలగం వేణు మ‌రో ప్ర‌య‌త్నం!
X

తెలుగు గ‌డ్డ‌పై నేటివిటీ క‌థ‌లు, ప‌ల్లె ప‌ట్టు క‌థ‌లు, జాన పదుల క‌థ‌లు.. క్లాసిక్ డే సినిమాలో విస్త్ర‌తంగా క‌నిపించాయి. నేటిత‌రం ద‌ర్శ‌కులు కూడా నేటివిటీ క‌థ‌లు, పాత్ర‌ల‌తో సినిమాలు తీసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మ‌న నేల .. మ‌న మ‌ట్టి వాస‌న‌.. మ‌న సంస్కృతి సాంప్ర‌దాయాల‌కు చెందిన క‌థ‌లు తెర‌పై చూసేందుకు, ఆస్వాధించేందుకు ఎంతో ముచ్చ‌ట‌గొలుపుతాయి. ఇలాంటి క‌థ‌లు గుండె లోతుల్ని స్ప‌ర్శిస్తాయి.


అలాంటి ఒక ప్ర‌య‌త్నం చేసాడు న‌టుడు వేణు యెల్దండి. తెలంగాణ‌ మట్టి సారాన్ని, సంస్కృతిని తెర‌పై ఆవిష్క‌రిస్తూ అత‌డు స్వీయ‌ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన `బ‌లగం` చిత్రం హృద‌యాల‌ను క‌దిలించింది. తన తొలి ప్ర‌య‌త్న‌మే వేణు అంద‌రి మ‌నసులు గెలుచుకున్నాడు. బ‌ల‌గం ఊహించని విజయంతో అతడు రెట్టించిన ఉత్సాహంతో ఉన్నాడు. ఇప్పుడు బలగం వేణుగా గుర్తింపు ద‌క్కింది కాబ‌ట్టి ఆ గుర్తింపున‌కు సార్థ‌క‌త‌నివ్వాల‌ని త‌పిస్తున్నాడు. వేణు తన రెండవ చిత్రానికి సిద్ధమవుతున్నాడు. ఎలాంటి స‌వాల్ ని అయినా స్వీక‌రిస్తాన‌ని, అప్ డేట్ వ‌స్తోంద‌ని తాజాగా ప్ర‌క‌టించాడు.


తాజాగా బలగం వేణు తన సోషల్ మీడియాలో ఒక కొత్త ఫోటోను షేర్ చేసాడు. దానికి ఆసక్తికర క్యాప్షన్ కూడా ఇచ్చాడు. `సిద్ధమవుతున్నా... త్వరలో అప్‌డేట్ వ‌స్తుంది``అని వేణు రాసాడు. జిమ్‌లో వ్యాయామం చేస్తున్న ఫోటోతో ఈ క్యాప్ష‌న్ ని షేర్ చేసాడు. ఫోటోలో వేణు కండలు మెలి తిప్పుతున్నాడు. అత‌డు త‌న రూపాన్ని మార్చేందుకు క‌ఠినంగానే శ్ర‌మిస్తున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. అది స‌క్సెస్ ఇచ్చిన కిక్కు. వేణు ఎల్ల‌మ్మ‌ చిత్రంలో కీలక పాత్ర పోషించవచ్చని కూడా హింట్ అందుతోంది. తన రెండవ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. నిర్మాత దిల్ రాజు ఈ చిత్రానికి ప‌ట్టుబ‌డుల్ని స‌మ‌కూర్చ‌నున్నారు.

తొలి ప్ర‌య‌త్నం విజ‌యం సాధించాక‌, ఈసారి కూడా తెలంగాణ ప్రజలకు బాగా నచ్చే టైటిల్‌ను వేణు ఎంచుకున్నాడు. ఎల్లమ్మ టైటిల్ తోనే నేటివిటీ ప‌రంగా క్యూరియాసిటీని పెంచాడు. ఈ కథే దర్శకుడిని ఈ టైటిల్‌ను ఖరారు చేయడానికి ప్రేరేపించిందని భావిస్తున్నారు. నితిన్ ప్రధాన పాత్ర పోషించనుండగా, సహజ నటి సాయి పల్లవి క‌థానాయిక‌గా న‌టిస్తుంద‌ని తెలుస్తోంది. ఈ చిత్రంలో నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా నటిస్తారని ఊహాగానాలు వినిపించాయి కానీ అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ చివరికి నితిన్ వద్దకు వెళ్లింది.

దిల్‌రాజు వేణుకు పూర్తి సృజనాత్మక స్వేచ్ఛను ఇచ్చి ప్రోత్స‌హిస్తున్నారు. ఎల్లమ్మ అనే టైటిల్‌తో ప్రామాణికమైన తెలుగు నేటివిటీతో ఆకర్షణీయంగా క‌నిపిస్తోంది. తెలంగాణలో- ఎల్లమ్మ దేవ‌తా రూపం. గ్రామ దేవతగా కూడా పూజ‌లందుకుంటుంది. బలమైన సాంస్కృతిక సంబంధాన్ని క‌లిగి ఉన్న టైటిల్ కావ‌డంతో మూవీపై ఆస‌క్తి పెరుగుతోంది.