Begin typing your search above and press return to search.

వేణుస్వామి వివాదం.. మంచు విష్ణు ఫోన్ కాల్ తో ముగింపు!

ఎంగేజ్మెంట్ అయిన రెండో రోజే నాగ చైతన్య, శోభిత గ్రహబలాలు బాగోలేదని వేణు స్వామి వ్యాఖ్యలు చేశారు

By:  Tupaki Desk   |   12 Aug 2024 12:44 PM GMT
వేణుస్వామి వివాదం.. మంచు విష్ణు ఫోన్ కాల్ తో ముగింపు!
X

సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ గా సుపరిచితుడు అయిన వేణు స్వామి కొద్ది రోజుల క్రితం నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ పై తన ప్రెడిక్షన్ చెప్పిన సంగతి తెలిసిందే. వారిద్దరి ఎంగేజ్మెంట్ అయిన రెండో రోజే నాగచైతన్య, శోభిత జాతక చక్రం ఇదే అంటూ ఒక టేబుల్ పై వారిద్దరి గ్రహబలాలు ఎలా ఉన్నాయో చూపిస్తూ వేణు స్వామి వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఎంగేజ్మెంట్ అయిన రెండో రోజే నాగ చైతన్య, శోభిత గ్రహబలాలు బాగోలేదని వేణు స్వామి వ్యాఖ్యలు చేశారు. మూడేళ్ళ తర్వాత వారిద్దరూ విడిపోతారంటూ కామెంట్స్ చేశారు. అలాగే నిశ్చితార్ధం చేసుకున్న ముహూర్తం కూడా మంచిది కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగ చైతన్య, శోభిత విడిపోతారంటూ వేణు స్వామి వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.

గతంలో సమంత - నాగచైతన్య వివాహ బంధంపై కూడా ఆయన ఇదే విధంగా స్పందించిన విషయం తెలిసిందే. అక్కినేని ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో వేణు స్వామిని విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. సెలబ్రెటీల జీవితాలలోకి దూరి వారిని బెదిరించి ఇలాంటి వారు బిజినెస్ చేసుకుంటున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా వేణు స్వామి నాగ చైతన్య, శోభిత వివాహ జాతకం చెప్పడంపై క్లారిటీ ఇచ్చారు.

గతంలో తాను నాగ చైతన్య సమంత వివాహం జాతకం చెప్పాను. అది జరిగింది. దానిని కొనసాగింపుగానే ఇప్పుడు నాగ చైతన్య శోభిత వివాహ జాతకం కూడా చెప్పానని వేణు స్వామి చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు వేణుస్వామి వివాదంపై ఇండస్ట్రీ తరపున మా అధ్యక్షుడు హీరో మంచు విష్ణు బాధ్యత తీసుకున్నారు. ఆయన ఒక అడుగు ముందుకు వేసి ప్రత్యేకంగా ఫోన్ లో మాట్లాడారు.

ఇక నుంచి సెలబ్రెటీలకు సంబంధించిన జాతకాల గురించి పర్సనల్ లైఫ్ గురించి ఏ విధంగాను కామెంట్స్ చేయవద్దని తెలిపారు. అయితే వేణుస్వామి కూడా మంచు విష్ణు మాటలను గౌరవించి తన సమాధానం ఇచ్చారు. సరే.. అని ఇక నుంచి టాలీవుడ్ సెలబ్రెటీలకు సంబంధించిన జీవితాలపై ఎలాంటి జ్యోతిష్యం చెప్పనని అన్నారు. మంచు విష్ణు కలుగ జేసుకోవడంతో ఒక్క ఫోన్ కాల్ తో వేణుస్వామి వివాదం ముగిసినట్లయ్యింది.

ఫైనల్ గా సెలబ్రెటీలు, రాజకీయ నాయకుల జ్యోతీష్యం చెప్పనని గతంలో తాను చెప్పిన మాటకి కట్టుబడి ఉంటున్నానని అన్నారు. ఇకపై సీలెబ్రిటీలు ఎవరి జాతకాలు చెప్పే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు. అలాగే మంచు విష్ణు కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడారని, అతనికి కూడా నేను వివరణ ఇవ్వడం జరిగిందని వేణు స్వామి వీడియో రిలీజ్ చేశారు. నాగ చైతన్య, శోభిత వివాహ జాతకం చెప్పడంపై సోషల్ మీడియాలో గత మూడు రోజులుగా చాలా విమర్శలు వస్తున్నాయి. అందుకే ఈ వివరణ ఇస్తున్నట్లు వేణు స్వామి వీడియోలో చెప్పుకొచ్చారు.